జలంధర్: దేశంలో డ్రైవింగ్ లైసెన్సులు పొందేందుకు త్వరలోనే ఆధార్‌ను తప్పనిసరి చేస్తామని కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దీనివల్ల నకిలీ, డూప్లికేట్ లైసెన్సుల జారీకి అడ్డుకట్ట పడుతుందన్నారు. పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరిగిన 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడారు. డ్రైవింగ్ లైసెన్సులను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన బిల్లు ప్రస్తుతం పార్లమెంటులో పెండింగ్‌లో ఉందని ప్రసాద్ వెల్లడించారు.
‘పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్న మోటార్ వాహనాల చట్టంలో మరో కీలక సవరణ చేయబోతున్నాం. త్వరలోనే మోటార్ వాహనాల లైసెన్సులకు ఆధార్‌ను అనుసంధానం చేయడం తప్పనిసరి కానుంది. వ్యక్తుల గుర్తింపును ధ్రువీకరించడంలో ఆధార్ అన్నది గొప్ప పరిణామం’ అని పేర్కొన్నారు. ఆధార్–డ్రైవింగ్ లైసెన్సు అనుసంధానంతో వచ్చే ప్రయోజనాలపై మాట్లాడుతూ..‘ఉదాహరణకు ఓ తాగుబోతు వాహనం నడుపుతూ నలుగురు వ్యక్తులను గుద్ది చంపేశాడనుకోండి. ప్రస్తుత పరిస్థితుల్లో అతను పంజాబ్ నుంచి మరో రాష్ట్రానికి పారిపోయి తప్పుడు డాక్యుమెంట్లతో కొత్త డ్రైవింగ్ లైసెన్సు పొందగలడు.
కానీ ఆధార్‌తో డ్రైవింగ్ లైసెన్సును అనుసంధానిస్తే.. ఇలాంటి ఘటనలు నిలిచిపోతాయి. ఓ వ్యక్తి మహా అయితే తన పేరును మార్చుకోగలడు తప్ప చేతి వేలిముద్రలను మార్చుకోలేడు. ఎవరైనా వ్యక్తులు నకిలీ పేరుతో డ్రైవింగ్ లైసెన్సు పొందేందుకు యత్నిస్తే.. కొత్త వ్యవస్థ బయోమెట్రిక్ ఆధారంగా సదరు వ్యక్తికి ఇప్పటికే లైసెన్స్ ఉందని హెచ్చరిస్తుంది. అంతేకాకుండా వాహనదారుల ట్రాఫిక్ ఉల్లంఘనలు, జరిమానాలు ఆధార్‌తో అనుసంధానం అవుతాయి. దీనివల్ల జరిమానాలు కట్టకుండా వాహనాలు నడపడం కష్టమవుతుంది. ప్రస్తుతం దేశంలో 124 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment