పోయినా... పొందండి ఇలా..! | You Can Get Your Cards Back If You Lose Them | Sakshi
Sakshi News home page

పోయినా... పొందండి ఇలా..!

Published Fri, Sep 25 2020 12:49 PM | Last Updated on Fri, Sep 25 2020 2:05 PM

You Can Get Your Cards Back If You Lose Them - Sakshi

గుడిపాల(చిత్తూరు): ప్రస్తుత సాంకేతిక యుగంలో మానవ జీవితం కార్డుల చుట్టూ తిరుగుతోంది. ఏటీఎం కార్డులు మొదలు పాన్, ఆధార్, రేషన్‌ కార్డులు నిత్య జీవితంలో భాగమయ్యాయి. అందుకే వాటిని జాగ్రత్తగా భద్రపరచుకుంటాం. ఒక్కోసారి వివిధ కారణాల వల్ల కార్డులు పోయినప్పుడు ఆందోళన తప్పదు. అయితే కొంత సమయం తీసుకున్నా.. వాటిని తక్కువ ఖర్చుతోనే తిరిగి పొందవచ్చు. (చదవండి: వీనుల విందుగా సుందరకాండ

డ్రైవింగ్‌ లైసెన్స్‌..
డ్రైవింగ్‌ లైసెన్స్‌ పోగొట్టుకున్న వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారు అందించే నాన్‌ ట్రేస్డ్‌ సర్టిఫికేట్‌తోపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ జిరాక్స్‌ను, లాస్‌ ఆర్‌ డిస్ట్రడన్‌ ఆఫ్‌ లైసెన్స్‌ అండ్‌ అప్లికేషన్‌ ఫర్‌ డూప్లికేట్‌ ఫారం (ఎల్‌ఎల్‌డీ)తో రోడ్డు రవాణా కార్యాలయానికి అందించాలి. రూ.20 బాండ్‌ పేపర్‌పై కార్డు పోయిన వివరాలు తెలియజేయాలి. ఎల్‌ఎల్‌డీ ఫారంను సంబంధిత శాఖ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. (చదవండి: కుప్పంలో టీడీపీ నేతల దౌర్జ‌న్యం)

రేషన్‌కార్డు..
ప్రభుత్వం అందించే సబ్సిడీ సరుకుల కోసమే కాకుండా ఆదాయం సహా పలురకాల ధ్రువపత్రాలు పొందేందుకు రేషన్‌కార్డు ఉపయోగపడుతుంది. రేషన్‌కార్డ్‌ ఉంటే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఈ కార్డు పోయినప్పుడు రేషన్‌ కార్డు నంబర్‌తో స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించాలి. వారు అదే నంబర్‌పై నామమాత్రపు రుసుముతో కొత్త కార్డు జారీ చేస్తారు. వెబ్‌సైట్‌ ద్వారా జిరాక్స్‌ కాపీ పొందవచ్చు.

ఆధార్‌కార్డ్‌.. 
ఈ కార్డ్‌పోతే టోల్‌ఫ్రీ నెంబర్‌ 18001801947కు కాలేచేసి, పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి. ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే కొత్తకార్డు మళ్లీ పోస్ట్‌ద్వారా పంపిస్తారు. వెబ్‌సైట్‌లో కానీ, గ్రామ, వార్డు సచివాలయాల్లో కానీ పూర్తి సమాచారం పొందవచ్చు. 

పాన్‌కార్డ్..‌
పాన్‌కార్డ్‌ (పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబర్‌)పోతే సంబంధిత ఏజెన్సీలో పాత పాన్‌కార్డ్‌ జిరాక్స్, రెండు కలర్‌ ఫొటోలు, నివాస ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కొత్త పాన్‌కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనికి అదనంగా రూ.90 చెల్లించాలి. సుమారు 20 రోజుల్లో మరో కార్డును జారీ చేస్తారు.

ఏటీఎం కార్డు..
బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించాలంటే ఏటీఎం కార్డు తప్పనిసరి. దీనిని పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగలించినా సంబంధిత బ్యాంకులో ఫిర్యాదు చేయాలి. ఏటీఎం కార్డును వెంటనే బ్లాక్‌ చేయించాలి. బ్యాంక్‌ అధికారులు ఈ విషయాన్ని నిర్ధారించుకొని కొత్త కార్డు జారీ చేస్తారు. 

పాస్‌పోర్ట్‌..
పాస్‌పోర్ట్‌ పోగొట్టుకుంటే ముందుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. పోలీసులు విచారణ జరిపి లభించకపోతే నాన్‌ట్రేస్డ్‌ ధృవపత్రం ఇస్తారు. అనంతరం పాస్‌పోర్ట్‌ అధికారి పేరిట రూ.వెయ్యి డీడీ తీయాలి. ఈ రెండింటినీ జతపరచి, దరఖాస్తు చేయాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ జరిపి, డూప్లికేట్‌ పాస్‌పోర్ట్‌ జారీ చేస్తారు. దీనికి 3 నెలల కాలవ్యవధి పడుతుంది. తత్కాల్‌ పాస్‌పోర్ట్‌ కోసం నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి.

ఓటరు గుర్తింపు కార్డు..
కేవలం ఓటు వేయడానికి కాకుండా, కొన్నిసార్లు నివాసం, పుట్టినతేదీ ధృవీకరణ కోసం ఈ కార్డు ఉపయోగ పడుతుంది. ఓటరు కార్డును పోగొట్టుకుంటే పోలింగ్‌బూత్‌ నంబర్, కార్డ్‌ నంబర్‌తోపాటు రూ.10 చెల్లించి, మీ–సేవా కేంద్రంలో మళ్లీకార్డు పొందవచ్చు. నంబర్‌ ఆధారంగా స్థానిక రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా అందజేస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement