న్యూఢిల్లీ: న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకే కుటుంబానికి చెందినవనీ, అవి మూడు ఒకదానినొకటి బలోపేతం చేసుకునేలా పనిచేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ మూడు వ్యవస్థల మధ్య ఉండే సమన్వయమే రాజ్యాంగానికి వెన్నెముకని ఆయన పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఈ మూడు వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏ ఆధికారానికైనా ఓ హద్దు ఉంటుందంటూ నాడు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ చెప్పిన మాటలను మోదీ గుర్తుచేశారు.
పాలనలో న్యాయవ్యవస్థ పాత్రపై న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరగడంతో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మారిన కాలానికి అనుగుణంగా ఎలా ముందుకెళ్లాలనేదానిపై మూడు వ్యవస్థలూ లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మూడు వ్యవస్థలూ మీది తప్పంటే మీది తప్పంటూ పరస్పరం విమర్శించుకోవాల్సిన అవసరం లేదనీ, ఏదేనీ ఒక వ్యవస్థలోని లోపాలు, బలాబలాలు...మిగతా రెండు వ్యవస్థల్లోని వారికీ తెలుసని అన్నారు.
జాతీయ న్యాయదినోత్సవం సందర్భంగా రెండు రోజులపాటు సుప్రీంకోర్టు, నీతి ఆయోగ్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో మోదీ ముగింపు ప్రసంగం చేశారు. పౌరులు హక్కుల కోసం పోరాడటంతోపాటు బాధ్యతలను కూడా విస్మరించరాదని హితవు పలికారు. మోదీ కన్నా ముందు కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అధికారాల విభజనపై న్యాయవ్యవస్థను ఉద్దేశించి మాట్లాడారు. ‘అధికార విభజన సిద్ధాంతానికి కార్యనిర్వాహక వ్యవస్థ ఎలా కట్టుబడి ఉంటుందో, న్యాయవ్యవస్థ కూడా అలానే ఉండాలి.
చట్టాల రూపకల్పన అంశాన్ని ఎన్నికైన ప్రభుత్వాలకే వదిలేయాలి. పరిపాలన అనేది ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వమే చేయాలనీ, వారే ప్రజలకు జవాబుదారీగా ఉండాలని జాతి నిర్మాతలు స్పష్టంగా పేర్కొన్నారు. న్యాయవ్యవస్థకు స్వతంత్రత ఎంతో ముఖ్యమైనదే. కానీ న్యాయవ్యవస్థలో జవాబుదారీ తనం, నిజాయితీ కూడా ముఖ్యమైనవే. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని ప్రభుత్వం ఆమోదిస్తుంది. అయితే న్యాయమూర్తుల నియామకాలను పరిశీలించాలన్న సలహా కూడా అభినందించదగ్గదే’ అని రవిశంకర్ అన్నారు.
న్యాయ గడియారాల ఏర్పాటు: మోదీ
కోర్టులు కేసులను పరిష్కరిస్తున్న వేగాన్ని బట్టి వాటికి ర్యాంకులిచ్చేలా దేశంలోని వివిధ కోర్టుల పరిసరాల్లో ‘న్యాయ గడియారాల’ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని మోదీ సూచించారు. దీనివల్ల కేసులను త్వరితగతిన పరిష్కరించడంలో న్యాయమూర్తుల మధ్య పోటీ కూడా ఏర్పడుతుందనీ, తద్వారా కేసుల సంఖ్య తగ్గుతుందని మోదీ పేర్కొన్నారు.
మరొకరు తలదూర్చకూడదు...
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు నిర్వహించిన మరో కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు వాటి స్వేచ్ఛ పరిధి గురించి అప్రమత్తతతో ఉండాలనీ, ఆయా వ్యవస్థల స్వతంత్రతను కాపాడుకోవడానికి అవి పాటుపడాలని అన్నారు. ఈ మూడు వ్యవస్థల మధ్య అధికారాల విభజనను గుర్తెరిగి నడచుకోవాలనీ, ఒకరి విధుల్లో మరొకరు తలదూర్చకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. రాజ్యాంగం అంటే కాగితాలు కాదనీ, ప్రాణమున్న పత్రమని కోవింద్ పేర్కొన్నారు.
విధానాలను తనిఖీ చేసే అధికారం మాకుంది: సీజేఐ
రవి శంకర్ ప్రసాద్ వ్యాఖ్యలపై సీజేఐ జస్టిస్ మిశ్రా స్పందిస్తూ ‘మూడు వ్యవస్థల మధ్య పరస్పర గౌరవం ఉండాలి. ఈ మూడింటిలో మాకున్న అధికారాలే గొప్పవంటూ ఏ వ్యవస్థా చెప్పుకోవడానికి లేదు. మేం ఏ విధానాలనూ తీసుకురావడం లేదు. కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను తనిఖీ చేసే, అవి అమలయ్యేలా చూసే అధికారం మాకు ఉంది. రాజ్యాంగమే పరిపాలనాధిపతి అని సుప్రీంకోర్టులో మేం విశ్వసిస్తాం. పాటిస్తాం.
చట్టాలకు లోబడి ప్రభుత్వాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని సరిచూసేందుకు అవసరమైన అధికారాలిస్తూ, రాజ్యాంగానికి తుది రక్షణదారుగా న్యాయవ్యవస్థను రాజ్యాంగమే నిలిపింది’ అని మిశ్రా పేర్కొన్నారు. పాలనాపరమైన విధానాలు తీసుకురావడానికి ప్రజాహిత వ్యాజ్యాలను దుర్వినియోగం చేస్తున్నారన్న వ్యాఖ్యలను జస్టిస్ మిశ్రా తిరస్కరించారు. పౌరుల ప్రాథమిక హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment