సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీల్లో చాలా మంది తరచుగా పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజరు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాలకు రాకుండా ఎగ్గొట్టేవారిని నిశితంగా కనిపెడుతున్నామని హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కీలక చర్చలు జరుగుతున్న సమయంలోనూ ఎంపీల హాజరు శాతంతక్కువగా ఉండటాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు.
మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ... ‘మీరు నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి అమిత్ షా వస్తానని, చివరి నిమిషంలో రాకుండా ఉంటే మీకు ఎలా ఉంటుంది. ఒకవేళ 2 లక్షల ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచిన మీకు సన్నిహిత మిత్రుడు ఓటు వేయలేదని తెలిస్తే ఎలా ఫీలవుతారు? పార్లమెంట్‌లో మన ఎంపీలు తక్కువగా ఉన్నప్పుడు నేను కూడా అలాగే ఫీలవుతాన’ని మోదీ అన్నారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరై చర్చల్లో పాలుపంచుకోవడం అలవాటుగా మార్చుకోవాలని ఎంపీలకు సూచించారు. అంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పహ్లాద్ జోషి మాట్లాడుతూ... ఎంపీలు సమయపాలన పాటించాలని కోరారు. ట్రిఫుల్ తలాక్ బిల్లు గురించి న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment