న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్
అహ్మదాబాద్: స్వాతంత్య్రానంతరం కశ్మీర్ విషయంలో భారత తొలి ప్రధాని నెహ్రూ చేసింది తప్పనీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసింది సరైనదనీ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసి ప్రధాని మోదీ అలనాటి చారిత్రక తప్పిదాన్ని సరిచేశారన్నారు. ఆర్టికల్ 370 విషయంలో నెహ్రూ చేసిన తప్పిదాన్ని సరిదిద్దేందుకు మోదీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అభినందించాయన్నారు.
భారత్ చర్యని బ్రిటన్, రష్యా, అమెరికా, ఫ్రాన్స్‌లు అభినందించాయని గుర్తుచేశారు. చివరకు చైనా సైతం భారత్ నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించలేకపోయిందన్నారు. కశ్మీర్ అంశంలో కాంగ్రెస్ అభిప్రాయం ఏమిటన్నది ఇప్పటి వరకు అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ భారీ బహిరంగ సభ ఏర్పాటుపై చేసిన ప్రకటన పట్ల స్పందిస్తూ ముందు ఆ ప్రాంతంలో నివసిస్తోన్న ప్రజల ప్రజాస్వామిక హక్కులను గురించి మాట్లాడాలని పాక్ ప్రధానికి సూచించారు. పాక్‌ఆక్రమిత కశ్మీర్‌లో నివసిస్తోన్న ప్రజలకు నిజంగా ప్రజాస్వామిక హక్కులున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించారా? అని ఇమ్రాన్‌ను ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment