jammu kashmir issue
-
ఐరాస వేదికగా పాక్‌పై విరుచుకుపడ్డ భారత్
న్యూయార్క్: ఉగ్రవాదులకు సహకరించడంలో దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన పాకిస్తాన్... ముష్కర మూకలకు ఆశ్రయం కల్పించడంపై ఐక్యరాజ్యసమితిలో పాక్‌పై భారత్ విరుచుకుపడింది. 26/11 ముంబైపై ఉగ్రదాడులకు పాల్పడినవారికి పాకిస్తాన్ రాజభోగాలు కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐరాసలో ఇస్లామాబాద్ రాయబారి మునీర్ అక్రమ్ జమ్మూ కాశ్మీర్ సమస్యను లేవనెత్తిన తర్వాత భారతదేశం పాకిస్తాన్‌ను గట్టిగా తిప్పికొట్టింది. ప్రపంచంలోని చాలా ఉగ్రవాద దాడులకు మూలం, లేదా ఏదో ఒక రూపంలో ఆ దేశానికి సంబంధం ఉంటుందని ఐరాస భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి ఆర్.మధుసూదన్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ‘సాయుధ ఘర్షణల నుంచి పౌరులను రక్షించాలి’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. అంతకుముందు ఐరాసలో భారత శాశ్వత రాయబారి తిరుమూర్తి మాట్లాడుతూ, దశాబ్దాలుగా సరిహద్దు ఉగ్రవాదం యొక్క శాపాన్ని చవిచూసిన భారతదేశం, ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలలో ఎల్లప్పుడూ ముందంజలో ఉందని తెలిపారు. సెక్రటరీ జనరల్ నివేదిక ప్రకారం, పట్టణ ప్రాంతాలలో 50 మిలియన్లకు పైగా ప్రజలు సంఘర్షణతో ప్రభావితమయ్యారని, అఫ్ఘనిస్తాన్, లిబియా, సిరియా, యెమెన్‌లోని ప్రజలు అంతర్గత సంఘర్షణల వల్ల కలిగే వినాశనాన్ని చూశారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద పోరు మళ్లీ పెరిగింది, ఇది కోవిడ్ మహమ్మారి కొనసాగుతుండటం వల్ల మరిం త క్లిష్టంగా మారిందని తిరుమూర్తి అన్నారు. సంఘర్షణానంతరం ఆయా ప్రాంతాల్లో సామాజికఆర్థిక పునరుద్ధరణ, శాంతిని పెంపొందించడం, పౌరులకు మౌలిక సదుపాయాల కల్పన, పునరావాసం కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. -
నెహ్రూ తప్పును మోదీ సరిదిద్దారు
అహ్మదాబాద్: స్వాతంత్య్రానంతరం కశ్మీర్ విషయంలో భారత తొలి ప్రధాని నెహ్రూ చేసింది తప్పనీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసింది సరైనదనీ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసి ప్రధాని మోదీ అలనాటి చారిత్రక తప్పిదాన్ని సరిచేశారన్నారు. ఆర్టికల్ 370 విషయంలో నెహ్రూ చేసిన తప్పిదాన్ని సరిదిద్దేందుకు మోదీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అభినందించాయన్నారు. భారత్ చర్యని బ్రిటన్, రష్యా, అమెరికా, ఫ్రాన్స్‌లు అభినందించాయని గుర్తుచేశారు. చివరకు చైనా సైతం భారత్ నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించలేకపోయిందన్నారు. కశ్మీర్ అంశంలో కాంగ్రెస్ అభిప్రాయం ఏమిటన్నది ఇప్పటి వరకు అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ భారీ బహిరంగ సభ ఏర్పాటుపై చేసిన ప్రకటన పట్ల స్పందిస్తూ ముందు ఆ ప్రాంతంలో నివసిస్తోన్న ప్రజల ప్రజాస్వామిక హక్కులను గురించి మాట్లాడాలని పాక్ ప్రధానికి సూచించారు. పాక్ఆక్రమిత కశ్మీర్లో నివసిస్తోన్న ప్రజలకు నిజంగా ప్రజాస్వామిక హక్కులున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించారా? అని ఇమ్రాన్‌ను ప్రశ్నించారు. -
అక్టోబర్‌లో భారత్‌తో యుద్ధం!
ఇస్లామాబాద్: అక్టోబర్ లేదా నవంబర్‌లో భారత్, పాక్‌ల మధ్య యుద్ధం జరగబోతోందని పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ బుధవారం రావల్పిండిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బహుశా, రెండు దేశాల మధ్య ఇదే తుది యుద్ధం కానుంది’ అని పేర్కొన్నారని పాకిస్తాన్ టుడే తెలిపింది. ‘భారత్‌లో ముస్లిం వ్యతిరేక భావజాలం ఉందని జిన్నా ఏనాడో చెప్పారు. ఆ దేశంతో చర్చలు జరిగే అవకాశాలున్నాయని ఇంకా భావించే వారు మూర్ఖుల కిందే లెక్క’ అని రషీద్ వ్యాఖ్యానించారు. కశ్మీరీలకు సంఘీభావం తెలపాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చిన ఆయన ముహర్రం తర్వాత కశ్మీర్ లోయను సందర్శిస్తానన్నారు. కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పాక్ ఈ అంశంపై అంతర్జాతీయ మద్దతు కూడగట్టే విషయంలో తీవ్రంగా విఫలమై, ఏకాకిగా మారిపోవడం తెల్సిందే. (చదవండి: భారత్‌తో అణు యుద్ధానికైనా రెడీ) -
కశ్మీరీల భాగస్వామ్యంతోనే ముందడుగు
జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి 370, 35(ఎ) అధికరణల ద్వారా దశాబ్దాల క్రితం దఖలు పడిన ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించడం ద్వారా ఏడు దశాబ్దాలుగా రగులుతున్న కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే సువర్ణావకాశం ఏర్పడటం దేశ చరిత్రలో ఓ అపురూప ఘట్టం. ఎంతో సాహసోపేతంతో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సహా మరికొన్ని ప్రాంతీయ పార్టీలు బేషరతుగా తమ సంపూర్ణ మద్దతును ప్రకటించి, దేశ ప్రయోజనాలు అన్నింటికంటే అత్యంత ప్రధానమైనవని చాటి చెప్పాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం లేకపోవడం ఆ పార్టీ డొల్లతనాన్ని ఎత్తి చూపింది. ఆ పార్టీలో కొంతమంది సీనియర్ నేతలతో పాటు యువ నేతలు కూడా ఎన్డీఏ చర్యను సమర్థించడం గమనార్హం. కాంగ్రెస్ బలహీనతను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంది. భారత్‌ను ఇరుకున పెట్టడానికి అంతర్జాతీయ సమాజం మద్దతును కూడగట్టాలని ప్రయత్నించి పాకిస్తాన్ భంగపాటుకు గురయ్యింది. కశ్మీర్ రాష్ట్రాన్ని ఏలిన ప్రభుత్వాలు అక్కడి ప్రజలకు తగిన నమ్మకాన్ని కల్పించలేకపోయాయి. పాకిస్తాన్ తయారు చేసిన ఉగ్రవాద మూకలు రాష్ట్రంలోకి చొరబడకుండా నిలువరించలేకపోయాయి. ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని మతవాద రాజకీయాలకు పరోక్షంగా సహకరించాయి. కశ్మీర్ అంశంలో స్పష్టమైన వైఖరి అవలంబించింది ఒక్క బీజేపీయే అన్నది నిర్వివాదాంశం. కేంద్రంలో కనుక తాము అధికారం చేపడితే 370 ఆర్టికల్‌ను రద్దుచేసి కశ్మీర్‌ను జాతీయ స్రవంతిలోకి తీసుకువస్తామని బీజేపీ మొదట్నుంచీ చెబుతూ వస్తోంది. కశ్మీర్‌పై ఉదారవాద వైఖరి ప్రదర్శిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ‘దీనికి రాజకీయ పరిష్కారం’ అనివార్యం అనే విధానాన్ని అవలంబించింది. కానీ, రాజకీయ పరిష్కారం అంటే ఏమిటో ఏనాడూ స్పష్టం చేయలేకపోయింది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉండగా పాకిస్తాన్‌తో కుదుర్చుకున్న ‘సిమ్లా ఒప్పందం’ ఎటువంటి పరిష్కారాన్ని చూపించలేకపోయింది. ఇక, జమ్మూ కశ్మీర్‌లోని ప్రధాన ప్రాంతీయ పార్టీల్లో ఒకటైన నేషనల్ కాన్ఫరెన్స్ ఎప్పటికప్పుడు కప్పదాట్ల వైఖరితో వ్యవహరిస్తూ స్థానిక ప్రజల ఆదరణ సంపాదించలేకపోయింది. ఆ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కశ్మీర్ సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలనేవారు. ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లాదీ అదే పాట. అధికారం పోయాక నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు మాట మార్చారు. హురియత్ కాన్ఫరెన్స్‌ను చర్చల్లో భాగస్వామ్యం చేయాలన్నారు. జమ్మూ కశ్మీర్లో మరో ప్రధాన ప్రాంతీయ పార్టీ అయిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ విధానం మొదట్నుంచీ వేర్పాటువాదులకు అనుకూలమే. 2015లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించని నేపథ్యంలో పీడీపీతో బీజేపీ జత కలిసింది. మహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వం కశ్మీర్లో శాంతిని నెలకొల్పడంలో పూర్తిగా విఫలం చెందడమే కాకుండా.. స్థానిక పోలీస్ యంత్రాంగానికి, సైన్యానికి మధ్య సమన్వయం లోపించిన పరిస్థితి ఉత్పన్నమైంది. భద్రతా బలగాలపై రాళ్లు విసిరినందుకు స్థానిక యువతపై నమోదైన క్రిమినల్ కేసులను ముఫ్తీ ప్రభుత్వం ఎత్తివేసింది. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ చావు దెబ్బ తిన్నప్పటికీ..ఆ సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి తగిన చొరవ చూపలేకపోయింది. 2014లో ఆ దిశగా అడుగులు వేయడానికి బీజేపీకి కొన్ని పరిమితులు ఎదురయ్యాయి. లోక్‌సభ ఎన్నికలలో సంపూర్ణ మెజార్టీ సాధించిన తర్వాత కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కశ్మీర్ అంశాన్ని పరిష్కరించడానికి వేగంగా అడుగులు ముందుకు వేసింది. పాకిస్తాన్‌తో నియంత్రణ రేఖ మీదుగా కొనసాగుతున్న వాణిజ్యాన్ని నిలిపేశారు. జమ్మూ లోయలో ర్యాలీలు నిర్వహించడాన్ని నిషేధించారు. కశ్మీర్, రాజస్తాన్, గుజరాత్, పంజాబ్‌ల్లో సరిహద్దులన్నింటినీ కలుపుతూ ఏర్పర్చిన చొరబాటు నిరోధక గ్రిడ్‌కు ‘ఆపరేషన్ సుదర్శన్’ అనే పేరు పెట్టి చొరబాటుదారులను నిర్దాక్షిణ్యంగా ఏరివేయడం మొదలు పెట్టారు. సరిహద్దులను దుర్భేద్యం చేసేందుకు దాదాపు 15,000 బంకర్లను నిర్మించడానికి అవసరమైన నిధులను విడుదల చేశారు. ఉగ్రవాదుల బెడద అధికంగా ఉన్న దోడ, కిష్వ, రాంబా, రాజౌరి, కఠువా, పూంచ్ వంటి తదితర జిల్లాల్లో గ్రామ రక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీలకు ఆయుధాలు సమకూర్చాలని నిర్ణయించారు. మరోవైపు, రాష్ట్రంలో సర్వాధికారిగా ఉన్న గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని కేంద్రం అనేక కీలక నిర్ణయాలను తీసుకుంది. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను పటిçష్టపరుస్తున్నారు. ప్రాంతాల వారీగా రిజర్వేషన్లలో ఉన్న అసమానతలను తొలగించడానికి నియోజకవర్గాల సరిహద్దులను మార్చాలన్న ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నారు. ఇక, 1989 తర్వాత జమ్మూ లోయ నుండి పెద్దఎత్తున తరలిపోయిన పండిట్లను స్వస్థలాలకు తిరిగి రప్పించి అవసరమైతే వారికోసం ప్రత్యేక కాలనీల నిర్మాణం చేపట్టి వాటి చుట్టూ కంచెలు నిర్మించి పటిష్ట భద్రత కల్పించాలని కూడా కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ చర్యలకు తోడుగా అంతిమంగా జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370, 35(ఎ) అధికరణలను రద్దు చేసే బిల్లును తొలుత రాజ్యసభలో, తదుపరి లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేయడంలో చోటుచేసుకున్న ఉత్కంఠ, బీజేపీ అగ్రనాయకత్వం వ్యవహరించిన తీరు వ్యూహాత్మకమైనది. మోదీ ప్రారంభించిన ‘మిషన్ కశ్మీర్’లో ప్రథమ అధ్యాయం సజావుగా సాగింది. మిగిలిందల్లా ద్వితీయ అధ్యాయం. ఇది విజయవంతం కావాలంటే జమ్మూకశ్మీర్ ప్రజల సహకారం, తోడ్పాటు, భాగస్వామ్యం అవసరం. ఆ దిశగా కేంద్రం కృషి చేయాలి. అందరి సహకారాన్ని స్వీకరించాలి. ప్రజలకు త్వరితగతిన సత్ఫలితాలు అందగలిగితే ఏ లక్ష్యం కోసమైతే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలు ‘మిషన్ కశ్మీర్’ ను ప్రారంభించారో అది దిగ్విజయం అవుతుంది. డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రి -
బేర్ ‘విశ్వ’రూపం!
అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధభయాలు, కార్పొరేట్ల ఆదాయాలు బలహీనంగా ఉండటం, రూపాయి క్షీణత, జమ్మూకశ్మీర్ పరిణామాలు.. అన్నీ కలగలిసి సోమవారం మార్కెట్లను కూలదోశాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంటుపై ఇవన్నీ ప్రతికూల ప్రభావాలు చూపడంతో సెన్సెక్స్ 418 పాయింట్లు క్షీణించి కీలకమైన 36,700 పాయింట్ల దిగువకు పతనమైంది. అయిదు నెలల కనిష్ట స్థాయికి క్షీణించింది. ఇక నిఫ్టీ సైతం 135 పాయింట్లు పతనమై 10,863 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ, సెన్సెక్స్ రోజంతా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. సెన్సెక్స్ ఒక దశలో 700 పాయింట్ల దాకా కూడా పతనమైంది. చివర్లో కొంత కోలుకుని 418 పాయింట్ల తగ్గుదలతో (1.13 శాతం) 36,699.84 వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్ 36,417 – 36,844 పాయింట్ల కనిష్ట, గరిష్టస్థాయిల మధ్య తిరుగాడింది. ‘మార్కెట్ హెచ్చుతగ్గులకు అనేక ప్రతికూలాంశాలు కారణమయ్యాయి. జమ్మూకశ్మీర్ పరిణామాలతో రాజకీయ సంక్షోభం తలెత్తవచ్చన్న ఆందోళనలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) సర్‌చార్జీ నుంచి మినహాయింపునకు సంబంధించి కొత్తగా మరే సంకేతాలు లేకపోవడం వంటివి కూడా మార్కెట్ హెచ్చుతగ్గులకు కారణమయ్యాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్లు ఆఖర్లో కొంత రికవర్ కాగా.. బలహీన రూపాయి వల్ల ఐటీ రంగ షేర్లు ఆసాంతం లాభాల్లోనే కొనసాగాయి. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలకు సంబంధించిన చర్చలకు ప్రతికూలతలు ఉండటం, ఎఫ్‌పీఐలు రిస్కులకు దూరంగా ఉండాలని భావిస్తుండటం వంటి అంశాల వల్ల.. మార్కెట్ల కన్సాలిడేషన్ కొనసాగే అవకాశం ఉంది‘ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో రీసెర్చ్ విభాగం హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. విపక్షాల ఆందోళనల మధ్య.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదానిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అన్ని రంగాల సూచీలు క్షీణతలోనే.. ఐటీ మినహా.. అన్ని రంగాల సూచీలు క్షీణించాయి. ఎనర్జీ 2.7 శాతం తగ్గగా.. మెటల్, బ్యాంక్, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా, ఫార్మా తదితర సూచీలు తగ్గాయి. ఇక బీఎస్ఈ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సూచీ కూడా 1 శాతం పైగా తగ్గాయి. యస్ బ్యాంక్ 8 శాతం డౌన్.. ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్న యస్ బ్యాంక్ షేర్లకు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ రూపంలో మరో షాక్ తగిలింది. అసెట్ క్వాలిటీ దిగజారుతుండటం, ఎన్‌బీఎఫ్‌సీలకు భారీగా రుణాలిచ్చి ఉండటం వంటి ప్రతికూల అంశాల కారణంగా బ్యాంక్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసే అంశం ఇంకా పరిశీలనలోనే ఉందంటూ మూడీస్ వెల్లడించింది. రెండు నెలల్లో మూడీస్ ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం ఇది రెండోసారి కావడంతో బ్యాంక్ షేరు భారీగా తగ్గింది. సెన్సెక్స్ షేర్లలో యస్ బ్యాంక్ అత్యధికంగా 8.15 శాతం క్షీణించింది. ఇక దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు కూడా రేటింగ్ సెగ తప్పలేదు. రిలయన్స్ రేటింగ్‌ను న్యూట్రల్ నుంచి అండర్పెర్ఫార్ఫ్కి తగ్గించడంతో పాటు టార్గెట్ రేటును రూ. 1,350 నుంచి రూ. 995కి తగ్గిస్తున్నట్లు బ్రోకరేజి సంస్థ క్రెడిట్ సూసీ ప్రకటించింది. దీంతో రిలయన్స్ షేరు 3.48 శాతం క్షీణించి రూ. 1,141 వద్ద క్లోజయ్యింది. టాటా మోటార్స్ 5.25 శాతం, పవర్‌గ్రిడ్ 4.42 శాతం, కోటక్ బ్యాంక్ (3.13 శాతం) తగ్గాయి. మరోవైపు భారతి ఎయిర్టెల్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఆటో అత్యధికంగా లాభపడిన వాటిల్లో ఉన్నాయి. డీహెచ్ఎఫ్ఎల్ 10 శాతం పతనం.. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) షేరు మరింత పతనమైంది. ఆడిటర్ బాధ్యతల నుంచి డెలాయిట్ తప్పుకుందన్న వార్తలతో 10% క్షీణించింది. బీఎస్ఈలో 41.95 వద్ద క్లోజయ్యింది. ఒక దశలో 12.43% క్షీణించి 52 వారాల కనిష్టమైన రూ. 40.85 స్థాయికి కూడా తగ్గింది. ఎన్ఎస్ఈలో 10.07 శాతం క్షీణతతో రూ. 41.95 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 22.03 లక్షలు, ఎన్ఎస్ఈలో 1.97 కోట్ల షేర్లు చేతులు మారాయి. డెలాయిట్ ఆడిటింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. తమకు ఎలాంటి సమాచారం లేదంటూ డీహెచ్ఎఫ్ఎల్ వివరణనిచ్చింది. డీహెచ్ఎఫ్ఎల్కు రూ. 90,000 కోట్ల రుణభారం ఉంది. నెల రోజుల్లో రూ. 15 లక్షల కోట్ల సంపద ఆవిరి లార్జ్ క్యాప్, మిడ్.. స్మాల్ క్యాప్ అనే తేడా లేకుండా మార్కెట్లో అమ్మకాల వెల్లువ కొనసాగుతుండటంతో గడిచిన నెల రోజుల్లో రూ. 15 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. జూలై 5న రూ. 153.58 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ 10 శాతం తగ్గి సోమవారం నాటికి రూ. 138 లక్షల కోట్లకు పడిపోయింది. ఇదే వ్యవధిలో సెన్సెక్స్ 8 శాతం క్షీణించింది. ఇక కరెన్సీ యుద్ధాలు..! అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ఇక కరెన్సీ వార్‌కు దారితీయనుందన్న భయాలతో వివిధ దేశాల కరెన్సీ విలువలు కుప్పకూలాయి. ఈ ప్రభావం రూపాయి మారకంపై కూడా ప్రభావం చూపింది. ఒకే రోజు 113 పైసలకు పైగా కుప్పకూలింది. కొత్తగా మరో 300 బిలియన్ డాలర్ల విలువ చేసే చైనా ఎగుమతులపై 10 శాతం సుంకాలు విధించాలన్న అమెరికా నిర్ణయం ప్రభావాలను ఎదుర్కొనే క్రమంలో ఎగుమతిదారులకు ఊతమిచ్చే ఉద్దేశంతో సొంత కరెన్సీ విలువను చైనా తగ్గించుకోనుందన్న(డీ వేల్యూ) వార్తలు వచ్చాయి. దీంతో డాలర్‌తో పోలిస్తే చైనా యువాన్ విలువ 7.03 స్థాయికి క్షీణించింది. ప్రపంచ మార్కెట్లు అల్లకల్లోలం.. అమెరికా సుంకాల దాడిని ఎదుర్కొనేందుకు చైనా కరెన్సీ అస్త్రాన్ని ప్రయోగించడం ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేసింది. ఆసియాలో కీలక సూచీలు భారీగా క్షీణించాయి. షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 1.6 శాతం, జపాన్ నికాయ్ 1.7 శాతం మేర తగ్గాయి. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూలవాదుల ఆందోళనలు కూడా తోడవడంతో హాంగ్‌సెంగ్ మూడు శాతం దాకా పడింది. ఈ ప్రభావాలతో అటు యూరప్ స్టాక్స్ కూడా రెండు శాతం దాకా క్షీణించాయి. అమెరికాలో కీలక సూచీలు డోజోన్స్ ఏకంగా 2.6 శాతం, నాస్డాక్ 3.3 శాతం మేర పడ్డాయి. రూపాయి విలవిల... ఆరేళ్లలో అతిపెద్ద పతనం! డాలర్ మారకంలో ఒకేరోజు 113 పైసలు డౌన్ 70.73 వద్ద ముగింపు నాలుగు నెలల కనిష్టస్థాయి ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఒకేరోజు 113 పైసలు (1.62 శాతం) పతనం అయ్యింది. 70.73 వద్ద ముగిసింది. ఇది నాలుగు నెలల కనిష్టస్థాయి. గడచిన ఆరు సంవత్సరాల్లో (2013 ఆగస్టు తరువాత) రూపాయి ఒకేసారి ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గడచిన మూడు రోజుల ట్రేడింగ్‌లో రూపాయి భారీగా 194 పైసలు నష్టపోయింది. మూడు ప్రధాన కారణాలు... ► అమెరికా–చైనా వాణిజ్య భయాలతో విదేశీ ఇన్వెస్టర్ల ఈక్విటీ మార్కెట్ అమ్మకాలు ► అమెరికా డాలర్ మారకంలో చైనా విదేశీ మారకద్రవ్యం– యువాన్ భారీ పతనం. 2008 తరువాత మొట్టమొదటిసారి డాలర్ మారకంలో చైనా యువాన్ 7% పతనమైంది. ఇది అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం కొత్త దశకు సంకేతమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ క్యాపిటల్ మార్కెట్స్ వ్యూహకర్త వీకే శర్మ పేర్కొన్నారు. ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ కరెన్సీ రీసెర్చ్ హెడ్ రాహుల్ గుప్తా కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ► కశ్మీర్ అంశంపై అనిశ్చితి. ఈ మూడు ప్రతికూలతలతో నిజానికి రూపాయి మరింత పతనం కావాల్సి ఉంది. అయితే అంతర్జాతీయంగా తక్కువ ధర వద్ద ట్రేడవుతున్న క్రూడ్ ధరలు రూపాయి పతనాన్ని కొంత నిలువరించాయి. ఒడిదుడుకుల ట్రేడింగ్ ట్రేడింగ్ మొదట్లో రూపాయి 70.20 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 70.74 కనిష్టాన్ని చూసింది. 70.18 గరిష్టస్థాయిని తాకినా.... అంతకుమించి బలపడలేకపోయింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే క్రూడ్ ధరల భారీ పతనం, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సంకేతాలతో రూపాయి కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. రూపాయి మరింత బలోపేతం కావడానికి ఈ నిరోధం కీలకం. ఇక్కడ నుంచి రూపాయి మరింత బలపడలేకపోయింది. బంగారం భగభగ ► కరెన్సీల పతనం, వాణిజ్య యుద్ధం నేపథ్యం ► ఔన్స్‌కు 1,482 డాలర్లకు దూకుడు ► దేశీయంగానూ కొత్త రికార్డులు ► ఢిల్లీలో రూ. 37 వేలకు చేరువ న్యూఢిల్లీ/న్యూయార్క్: అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం తీవ్రత నేపథ్యంలో అంతర్జాతీయంగా పలు దేశాల కరెన్సీలు డాలర్ మారకంలో పతనం కావడం పసిడికి వరమైంది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర సోమవారం భారీగా పెరిగింది. ఒకదశలో 1,481.75 డాలర్ల గరిష్టాన్ని తాకింది. గడచిన ఆరేళ్లలో పసిడి ఈ స్థాయిని చూడ్డం ఇదే తొలిసారి. ఈ వార్త రాసే రాత్రి 10.30 గంటలకు పసిడి ధర గత శుక్రవారం ధరతో పోల్చితే, 20 డాలర్ల లాభంతో 1,477 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో పసిడిని పెట్టుబడులకు సురక్షితమైనదిగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా పలు దేశాల ఈక్విటీ మార్కెట్లు తీవ్ర నష్టాలతో ట్రేడవుతుంటే, చైనా కరెన్సీ యువాన్ ఏకంగా 7 శాతం పతనమైంది. దేశీయంగా రూపాయి ఎఫెక్ట్ తోడు... అంతర్జాతీయంగా పరుగుకు తోడు, డాలర్ మారకంలో రూపాయి విలువ 1.6 శాతంపైగా పతనం చెందడంతో దేశంలో బంగారం ధర ఒక్కసారిగా మెరిసింది. ఢిల్లీలో సోమవారం ధర 10 గ్రాములుకు (99.9 ప్యూరిటీ) రూ.800 పెరిగి రూ.36,970కి చేరింది. 99.5 ప్యూరిఈ ధర కూడా రూ.800 ఎగసి రూ.36,800కి చేరింది. బంగారంతోపాటు వెండి ధర కూడా ఢిల్లీలో భారీగా కేజీకి రూ.1,000 పెరిగింది. రూ.43,100కి చేరింది. ఈ వార్త రాసే రాత్రి 10.30 గంటల సమయానికి దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో 10 గ్రాముల పసిడి ధర క్రితం శుక్రవారం ధరతో పోల్చి రూ.988 లాభంతో రూ.37,259 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ.37,347ను కూడా తాకింది. కాగా వెండి ధర రూ.991 లాభంలో రూ.42,355 వద్ద ట్రేడవుతోంది. ఇదే రీతిన ట్రేడింగ్ ముగిస్తే, మంగళవారం దేశంలో పసిడి ధరలు మరింత పరుగు పెట్టే అవకాశం ఉంది. -
‘అందుకోసం ఏ పార్టీతో అయినా చేతులు కలుపుతాం’
శ్రీనగర్ : పాకిస్తాన్‌తో మాట్లాడానికి ఇదే సరైన సమయం అంటున్నారు జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ. ‘ప్రస్తుతం పాకిస్తాన్ నూతన ప్రధాన మంత్రిగా ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్ తనను తాను తన దేశ ఆర్మి ప్రతినిధిగా చెప్పుకుంటున్నారు. చర్యలకు సిద్ధం అంటున్నారు. కాబట్టి పాక్‌తో చర్చలు జరపడానికి ఇదే మంచి సమయం. ఇప్పుడు చర్చలు జరిపితే మంచి ఫలితం ఉంటుంద’ని చెప్పుకొచ్చారు. కశ్మీర్ అంశం గురించి మాట్లాడటానికి కూడా ఇదే మంచి సమయం అన్నారు. అంతేకాక కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఏ రాజకీయ పార్టీతోనైనా చేతులు కలపడానికి తమ పార్టీ సిద్ధంగా ఉంటుందన్నారు ముఫ్తీ. అది బీజేపీ పార్టీ అయినా సరే.. కశ్మీర్ సమస్య పరిష్కారం కావడమే ముఖ్యం అన్నారు. అందుకోసమే గతంలో పీడీపీ, బీజేపీతో చేతులు కలిపిందని గుర్తు చేశారు. కానీ ఈ ప్రయోగం సక్సెస్ అవ్వలేదని చెప్పుకొచ్చారు. కశ్మీర్ ప్రజలు కూడా దీన్ని ఆమోదించలేదన్నారు. అంతేకాక మాజీ భారత ప్రధాని వాజ్‌పేయికి.. నేటి ప్రధాని నరేంద్రమోదీకి మధ్య చాలా తేడా ఉందన్నారు. అటల్జీ ఒక రాజనీతిజ్ఞుడు.. చాలా గొప్పవారు.. వెనకడుగు వేయని ధీశాలి. కానీ నేటీ ఎన్డీఏ నాయకులకు ఎన్నికల్లో విజయం సాధించడం గురించి తప్ప మరో ఆలోచన లేదంటూ విమర్శించారు. ఆవుల సంరక్షణ పేరుతో దేశంలో జరుగుతున్న మూక దాడులను ఉద్దేశిస్తూ.. ఇంకా నయం ఆవులకు ఓటు హక్కు ఇవ్వలేదంటూ ఎద్దేవా చేశారు. -
మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డ సీనియర్
సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీ మరోసారి విరుచుకుపడ్డారు. సోమవారం కాంగ్రెస్ నేత సైఫుద్ధీన్ సోజ్ రాసిన కశ్మీర్: గ్లింప్సెస్ ఆఫ్ హిస్టరీ- స్టోరీ ఆఫ్ స్ట్రగుల్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న శౌరీ... కశ్మీర్ అంశంపై మోదీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలను తప్పుబట్టారు. ‘కశ్మీర్, పాకిస్థాన్‌ల విషయంలో ఇప్పుడున్న మన ప్రభుత్వం ఓ పద్ధతి, వ్యవహారాలను అవలంభించట్లేదు. కేవలం హిందూ-ముస్లింల మధ్య ఎలా చిచ్చు పెట్టాలన్న ఒకే ఒకే ఎజెండాతో ముందుకు పోతున్నాయి’ అని మండిపడ్డారు. కశ్మీర్ అల్లకల్లోల పరిస్థితులపై స్పందిస్తూ.. ఆ ప్రభావం ఒక్క కశ్మీర్ ప్రజల జీవితంపై మాత్రమే ప్రభావం చూపట్లేదని, యావత్ దేశ ప్రజలు మనోభావాలు దెబ్బతింటున్నాయని అభిప్రాయపడ్డారు. కశ్మీర్లో కేంద్రం తీసుకున్న బలగాల మోహరింపును(ఆలౌట్ యాక్షన్) నిర్ణయాన్ని మూర్ఖపు చర్యగా ఆయన అభివర్ణించారు. ‘ఆవుల పేరిట ముస్లింలను చంపటం హేయనీయం. ఆ చర్యలు తమ వర్గం హిందువులచే పీడించబడుతుందన్న భావాన్ని ముస్లింలలో పెంచుతుందని’ శౌరి తెలిపారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను నకిలీ స్ట్రైక్స్‌గా పేర్కొన్న ఆయన.. మోదీ ప్రభుత్వం ఎన్నికల, ఈవెంట్ల సర్కార్‌గా ఆయన ఎద్దేవా చేశారు. కొసమెరుపు.. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంరబరానికి ప్రత్యేక ఆహ్వానాలను సైఫుద్దీన్ సోజ్ అందించారు. అయినప్పటికీ వారిద్దరూ గైర్హాజరు కావటం విశేషం. కశ్మీర్ ప్రజల తొలి ప్రాధాన్యం స్వాతంత్ర్యానికేనంటూ సైఫుద్దీన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపటం, సోజ్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ ప్రకటించటం విదితమే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఈ ఈవెంట్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
కాంగ్రెస్, ఉగ్రవాదుల ఆలోచన ఒక్కటే!
జమ్మూ: కాంగ్రెస్ నేతలు, ఉగ్రవాదులు ఒకే రకంగా ఆలోచిస్తున్నారని బీజేపీ చీఫ్ అమిత్ షా విమర్శించారు. బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ జమ్మూ, కశ్మీర్లు విడిపోయేందుకు అంగీకరించదని స్పష్టం చేశారు. భద్రతా బలగాలను విమర్శిస్తూ.. ఇటీవల కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, సైఫుద్దీన్ సోజ్‌లు చేసిన వ్యాఖ్యలపై షా తీవ్రంగా మండిపడ్డారు. జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకుని జమ్మూలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘సోజ్, మీరు వంద జన్మలెత్తినా.. కశ్మీర్‌ను భారత్ నుంచి విడదీయడాన్ని బీజేపీ ఒప్పుకోదు. జమ్మూ కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. శ్యామా ప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని పణంగా పెట్టి ఈ రెండు ప్రాంతాలను కలిపారు. ఆయన ఆశయ సాధనే మా లక్ష్యం’ అని పేర్కొన్నారు. రాహుల్ వీరిని సమర్థిస్తారా? భద్రతా బలగాలు కశ్మీర్లో.. ఉగ్రవాదుల కంటే సామాన్యులను ఎక్కువగా చంపేస్తున్నాయని ఆజాద్ ఆజాద్ వ్యాఖ్యలను సమర్థిస్తూ లష్కరే తోయిబా ప్రకటన చేయడంతో.. షా మండిపడ్డారు. ‘లష్కరే ఉగ్రవాదులు, కాంగ్రెస్ నేతల ఫ్రీక్వెన్సీ (ఆలోచన ధోరణి) సరిగ్గా సరిపోతోంది. ఆజాద్‌తోపాటు లష్కరే.. వ్యాఖ్యలను రాహుల్ ఖండిస్తారా?’ అని షా ప్రశ్నించారు. ఆజాద్, సోజ్‌లు దేశానికి క్షమాపణలు చెప్పాలని రాహుల్ ఆదేశించాలని డిమాండ్ చేశారు. -
కశ్మీర్ కల్లోలానికి కారణం ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ప్రస్తుతం కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేత సంబిత్ పాత్రా ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ‘‘నెహ్రూ నుంచి చిదంబరం దాకా కాంగ్రెస్ నేతలదంతా గజిబిజి వ్యవహారరమే. వాళ్ల హయాంలోనే రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. మనం ఇప్పుడు కశ్మీర్ గురించి ఇలా మాట్లాడుకోవటానికి కూడా కారణం వాళ్లే. అలాంటిది కశ్మీర్ స్వేచ్ఛ కోసం మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఆ అంశంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది’’ అని పాత్రా పేర్కొన్నారు. ఇక చిదంబరం ఓ దేశద్రోహిలా మాట్లాడాడని.. ఆయన్ని జైలుకు పంపాల్సిందేనని సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి మండిపడ్డారు. మరోనేత కమల నేత షానవాజ్ హుస్సేన్ కూడా మాజీ ఆర్థిక మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కశ్మీర్ తోపాటు యావత్ దేశ ప్రజలు కశ్మీర్ పరిస్థితులకు కారణం పాకిస్థాన్ అని బలంగా నమ్ముతున్నారు. కానీ, చిదంబరంకు ఆ మాత్రం తెలీకపోవటం శోచనీయం. అయినా ఆజాదీ(స్వేచ్ఛ) అంటే స్వయంప్రతిపత్తి మాత్రమే కాదన్న విషయం చిదంబరం గుర్తించాలని హుస్సేన్ సూచించారు. కాగా, కశ్మీర్ ప్రజలకు ఆజాదీ అంటే స్వయం ప్రతిపత్తి అని చిదంబరం శనివారం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అక్కడి ప్రజలతో తాను చర్చలు జరిపినప్పుడు తనకు ఈ విషయం అర్థమైందని, స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిన అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఈ వ్యాఖ్యలతో మాజీ చర్చల ప్రతినిధి ఎంఎం అన్సారీ ఏకీభవించటం గమనార్హం. -
ఐరాసలో కశ్మీర్ అంశాన్ని ఎలాగైనా ప్రస్తావిస్తాం: పాక్
జమ్ము కశ్మీర్లో భారత్ సాగిస్తున్న 'రాజ్య ఉగ్రవాదం' అంశాన్ని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో 'ఎలాగైనా' తాము ప్రస్తావిస్తామని పాకిస్థాన్ అంటోంది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ కార్యాలయం తెలిపింది. ఐక్యరాజ్య సమితిలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ అంశాన్ని చాలా బలంగా ప్రస్తావిస్తారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా తెలిపారు. పాకిస్థాన్ ఎప్పుడూ జమ్ము కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ వార్షిక సమావేశంలో ప్రస్తావిస్తూనే ఉందని, గత సంవత్సరం కూడా నవాజ్ షరీఫ్ తన ప్రసంగంలో ఈ అంశం గురించి గట్టిగా మాట్లాడారని ఆయన అన్నారు. కశ్మీర్ లోయలో కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను ఇప్పటికే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యదేశాలలో చాలా వరకు గుర్తించాయని చెప్పారు.