జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి 370, 35(ఎ) అధికరణల ద్వారా దశాబ్దాల క్రితం దఖలు పడిన ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించడం ద్వారా ఏడు దశాబ్దాలుగా రగులుతున్న కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే సువర్ణావకాశం ఏర్పడటం దేశ చరిత్రలో ఓ అపురూప ఘట్టం. ఎంతో సాహసోపేతంతో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సహా మరికొన్ని ప్రాంతీయ పార్టీలు బేషరతుగా తమ సంపూర్ణ మద్దతును ప్రకటించి, దేశ ప్రయోజనాలు అన్నింటికంటే అత్యంత ప్రధానమైనవని చాటి చెప్పాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం లేకపోవడం ఆ పార్టీ డొల్లతనాన్ని ఎత్తి చూపింది. ఆ పార్టీలో కొంతమంది సీనియర్ నేతలతో పాటు యువ నేతలు కూడా ఎన్డీఏ చర్యను సమర్థించడం గమనార్హం. కాంగ్రెస్ బలహీనతను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంది. భారత్‌ను ఇరుకున పెట్టడానికి అంతర్జాతీయ సమాజం మద్దతును కూడగట్టాలని ప్రయత్నించి పాకిస్తాన్ భంగపాటుకు గురయ్యింది.
కశ్మీర్ రాష్ట్రాన్ని ఏలిన ప్రభుత్వాలు అక్కడి ప్రజలకు తగిన నమ్మకాన్ని కల్పించలేకపోయాయి. పాకిస్తాన్ తయారు చేసిన ఉగ్రవాద మూకలు రాష్ట్రంలోకి చొరబడకుండా నిలువరించలేకపోయాయి. ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని మతవాద రాజకీయాలకు పరోక్షంగా సహకరించాయి. కశ్మీర్ అంశంలో స్పష్టమైన వైఖరి అవలంబించింది ఒక్క బీజేపీయే అన్నది నిర్వివాదాంశం. కేంద్రంలో కనుక తాము అధికారం చేపడితే 370 ఆర్టికల్‌ను రద్దుచేసి కశ్మీర్‌ను జాతీయ స్రవంతిలోకి తీసుకువస్తామని బీజేపీ మొదట్నుంచీ చెబుతూ వస్తోంది. కశ్మీర్‌పై ఉదారవాద వైఖరి ప్రదర్శిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ‘దీనికి రాజకీయ పరిష్కారం’ అనివార్యం అనే విధానాన్ని అవలంబించింది. కానీ, రాజకీయ పరిష్కారం అంటే ఏమిటో ఏనాడూ స్పష్టం చేయలేకపోయింది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉండగా పాకిస్తాన్‌తో కుదుర్చుకున్న ‘సిమ్లా ఒప్పందం’ ఎటువంటి పరిష్కారాన్ని చూపించలేకపోయింది. ఇక, జమ్మూ కశ్మీర్‌లోని ప్రధాన ప్రాంతీయ పార్టీల్లో ఒకటైన నేషనల్ కాన్ఫరెన్స్ ఎప్పటికప్పుడు కప్పదాట్ల వైఖరితో వ్యవహరిస్తూ స్థానిక ప్రజల ఆదరణ సంపాదించలేకపోయింది. ఆ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కశ్మీర్ సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలనేవారు. ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లాదీ అదే పాట. అధికారం పోయాక నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు మాట మార్చారు. హురియత్ కాన్ఫరెన్స్‌ను చర్చల్లో భాగస్వామ్యం చేయాలన్నారు.
జమ్మూ కశ్మీర్‌లో మరో ప్రధాన ప్రాంతీయ పార్టీ అయిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ విధానం మొదట్నుంచీ వేర్పాటువాదులకు అనుకూలమే. 2015లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించని నేపథ్యంలో పీడీపీతో బీజేపీ జత కలిసింది. మహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వం కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడంలో పూర్తిగా విఫలం చెందడమే కాకుండా.. స్థానిక పోలీస్ యంత్రాంగానికి, సైన్యానికి మధ్య సమన్వయం లోపించిన పరిస్థితి ఉత్పన్నమైంది. భద్రతా బలగాలపై రాళ్లు విసిరినందుకు స్థానిక యువతపై నమోదైన క్రిమినల్ కేసులను ముఫ్తీ ప్రభుత్వం ఎత్తివేసింది. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపారు.
వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ చావు దెబ్బ తిన్నప్పటికీ..ఆ సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి తగిన చొరవ చూపలేకపోయింది. 2014లో ఆ దిశగా అడుగులు వేయడానికి బీజేపీకి కొన్ని పరిమితులు ఎదురయ్యాయి. లోక్‌సభ ఎన్నికలలో సంపూర్ణ మెజార్టీ సాధించిన తర్వాత కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కశ్మీర్ అంశాన్ని పరిష్కరించడానికి వేగంగా అడుగులు ముందుకు వేసింది. పాకిస్తాన్‌తో నియంత్రణ రేఖ మీదుగా కొనసాగుతున్న వాణిజ్యాన్ని నిలిపేశారు. జమ్మూ లోయలో ర్యాలీలు నిర్వహించడాన్ని నిషేధించారు. కశ్మీర్, రాజస్తాన్, గుజరాత్, పంజాబ్‌ల్లో సరిహద్దులన్నింటినీ కలుపుతూ ఏర్పర్చిన చొరబాటు నిరోధక గ్రిడ్‌కు ‘ఆపరేషన్ సుదర్శన్’ అనే పేరు పెట్టి చొరబాటుదారులను నిర్దాక్షిణ్యంగా ఏరివేయడం మొదలు పెట్టారు. సరిహద్దులను దుర్భేద్యం చేసేందుకు దాదాపు 15,000 బంకర్లను నిర్మించడానికి అవసరమైన నిధులను విడుదల చేశారు.
ఉగ్రవాదుల బెడద అధికంగా ఉన్న దోడ, కిష్వ, రాంబా, రాజౌరి, కఠువా, పూంచ్ వంటి తదితర జిల్లాల్లో గ్రామ రక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీలకు ఆయుధాలు సమకూర్చాలని నిర్ణయించారు. మరోవైపు, రాష్ట్రంలో సర్వాధికారిగా ఉన్న గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని కేంద్రం అనేక కీలక నిర్ణయాలను తీసుకుంది. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను పటిçష్టపరుస్తున్నారు. ప్రాంతాల వారీగా రిజర్వేషన్లలో ఉన్న అసమానతలను తొలగించడానికి నియోజకవర్గాల సరిహద్దులను మార్చాలన్న ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నారు. ఇక, 1989 తర్వాత జమ్మూ లోయ నుండి పెద్దఎత్తున తరలిపోయిన పండిట్లను స్వస్థలాలకు తిరిగి రప్పించి అవసరమైతే వారికోసం ప్రత్యేక కాలనీల నిర్మాణం చేపట్టి వాటి చుట్టూ కంచెలు నిర్మించి పటిష్ట భద్రత కల్పించాలని కూడా కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ చర్యలకు తోడుగా అంతిమంగా జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370, 35(ఎ) అధికరణలను రద్దు చేసే బిల్లును తొలుత రాజ్యసభలో, తదుపరి లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేయడంలో చోటుచేసుకున్న ఉత్కంఠ, బీజేపీ అగ్రనాయకత్వం వ్యవహరించిన తీరు వ్యూహాత్మకమైనది.
మోదీ ప్రారంభించిన ‘మిషన్ కశ్మీర్’లో ప్రథమ అధ్యాయం సజావుగా సాగింది. మిగిలిందల్లా ద్వితీయ అధ్యాయం. ఇది విజయవంతం కావాలంటే జమ్మూకశ్మీర్ ప్రజల సహకారం, తోడ్పాటు, భాగస్వామ్యం అవసరం. ఆ దిశగా కేంద్రం కృషి చేయాలి. అందరి సహకారాన్ని స్వీకరించాలి. ప్రజలకు త్వరితగతిన సత్ఫలితాలు అందగలిగితే ఏ లక్ష్యం కోసమైతే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలు ‘మిషన్ కశ్మీర్’ ను ప్రారంభించారో అది దిగ్విజయం అవుతుంది.
డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment