బేర్‌ ‘విశ్వ’రూపం! | Sensex ends down 418 points on weak global cues, Kashmir uncertainty | Sakshi
Sakshi News home page

బేర్‌ ‘విశ్వ’రూపం!

Published Tue, Aug 6 2019 5:26 AM | Last Updated on Tue, Aug 6 2019 8:46 AM

Sensex ends down 418 points on weak global cues, Kashmir uncertainty - Sakshi

అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధభయాలు, కార్పొరేట్ల ఆదాయాలు బలహీనంగా ఉండటం, రూపాయి క్షీణత, జమ్మూకశ్మీర్‌ పరిణామాలు.. అన్నీ కలగలిసి సోమవారం మార్కెట్లను కూలదోశాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంటుపై ఇవన్నీ ప్రతికూల ప్రభావాలు చూపడంతో సెన్సెక్స్‌ 418 పాయింట్లు క్షీణించి కీలకమైన 36,700 పాయింట్ల దిగువకు పతనమైంది. అయిదు నెలల కనిష్ట స్థాయికి క్షీణించింది.

ఇక నిఫ్టీ సైతం 135 పాయింట్లు పతనమై 10,863 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ, సెన్సెక్స్‌ రోజంతా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 700 పాయింట్ల దాకా కూడా పతనమైంది. చివర్లో కొంత కోలుకుని 418 పాయింట్ల తగ్గుదలతో (1.13 శాతం) 36,699.84 వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్‌ 36,417 – 36,844 పాయింట్ల కనిష్ట, గరిష్టస్థాయిల మధ్య తిరుగాడింది.  

    ‘మార్కెట్‌ హెచ్చుతగ్గులకు అనేక ప్రతికూలాంశాలు కారణమయ్యాయి. జమ్మూకశ్మీర్‌ పరిణామాలతో రాజకీయ సంక్షోభం తలెత్తవచ్చన్న ఆందోళనలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) సర్‌చార్జీ నుంచి మినహాయింపునకు సంబంధించి కొత్తగా మరే సంకేతాలు లేకపోవడం వంటివి కూడా మార్కెట్‌ హెచ్చుతగ్గులకు కారణమయ్యాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆటో, బ్యాంకింగ్‌ రంగాల షేర్లు ఆఖర్లో కొంత రికవర్‌ కాగా.. బలహీన రూపాయి వల్ల ఐటీ రంగ షేర్లు ఆసాంతం లాభాల్లోనే కొనసాగాయి.

అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలకు సంబంధించిన చర్చలకు ప్రతికూలతలు ఉండటం, ఎఫ్‌పీఐలు రిస్కులకు దూరంగా ఉండాలని భావిస్తుండటం వంటి అంశాల వల్ల.. మార్కెట్ల కన్సాలిడేషన్‌ కొనసాగే అవకాశం ఉంది‘ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో రీసెర్చ్‌ విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. విపక్షాల ఆందోళనల మధ్య.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదానిచ్చే ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  

అన్ని రంగాల సూచీలు క్షీణతలోనే..
ఐటీ మినహా.. అన్ని రంగాల సూచీలు క్షీణించాయి. ఎనర్జీ 2.7 శాతం తగ్గగా.. మెటల్, బ్యాంక్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఇన్‌ఫ్రా, ఫార్మా తదితర సూచీలు తగ్గాయి. ఇక బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ సూచీ కూడా 1 శాతం పైగా తగ్గాయి.  

యస్‌ బ్యాంక్‌  8 శాతం డౌన్‌..
ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్న యస్‌ బ్యాంక్‌ షేర్లకు అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ రూపంలో మరో షాక్‌ తగిలింది. అసెట్‌ క్వాలిటీ దిగజారుతుండటం, ఎన్‌బీఎఫ్‌సీలకు భారీగా రుణాలిచ్చి ఉండటం వంటి ప్రతికూల అంశాల కారణంగా బ్యాంక్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసే అంశం ఇంకా పరిశీలనలోనే ఉందంటూ మూడీస్‌ వెల్లడించింది. రెండు నెలల్లో మూడీస్‌ ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం ఇది రెండోసారి కావడంతో బ్యాంక్‌ షేరు భారీగా తగ్గింది. సెన్సెక్స్‌ షేర్లలో యస్‌ బ్యాంక్‌ అత్యధికంగా 8.15 శాతం క్షీణించింది.

ఇక దిగ్గజ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లకు కూడా రేటింగ్‌ సెగ తప్పలేదు. రిలయన్స్‌ రేటింగ్‌ను న్యూట్రల్‌ నుంచి అండర్‌పెర్ఫార్ఫ్‌కి తగ్గించడంతో పాటు టార్గెట్‌ రేటును రూ. 1,350 నుంచి రూ. 995కి తగ్గిస్తున్నట్లు బ్రోకరేజి సంస్థ  క్రెడిట్‌ సూసీ ప్రకటించింది. దీంతో రిలయన్స్‌ షేరు 3.48 శాతం క్షీణించి రూ. 1,141 వద్ద క్లోజయ్యింది. టాటా మోటార్స్‌ 5.25 శాతం, పవర్‌గ్రిడ్‌ 4.42 శాతం, కోటక్‌ బ్యాంక్‌ (3.13 శాతం) తగ్గాయి. మరోవైపు భారతి ఎయిర్‌టెల్, టీసీఎస్, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఆటో అత్యధికంగా లాభపడిన వాటిల్లో ఉన్నాయి.  

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ 10 శాతం పతనం..
ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) షేరు మరింత పతనమైంది. ఆడిటర్‌ బాధ్యతల నుంచి డెలాయిట్‌ తప్పుకుందన్న వార్తలతో 10% క్షీణించింది. బీఎస్‌ఈలో 41.95 వద్ద క్లోజయ్యింది. ఒక దశలో 12.43% క్షీణించి 52 వారాల కనిష్టమైన రూ. 40.85 స్థాయికి కూడా తగ్గింది. ఎన్‌ఎస్‌ఈలో 10.07 శాతం క్షీణతతో రూ. 41.95 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 22.03 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 1.97 కోట్ల షేర్లు చేతులు మారాయి. డెలాయిట్‌ ఆడిటింగ్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. తమకు ఎలాంటి సమాచారం లేదంటూ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వివరణనిచ్చింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు  రూ. 90,000 కోట్ల రుణభారం ఉంది.

నెల రోజుల్లో రూ. 15 లక్షల కోట్ల సంపద ఆవిరి
లార్జ్‌ క్యాప్, మిడ్‌.. స్మాల్‌ క్యాప్‌ అనే తేడా లేకుండా మార్కెట్లో అమ్మకాల వెల్లువ కొనసాగుతుండటంతో గడిచిన నెల రోజుల్లో రూ. 15 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. జూలై 5న రూ. 153.58 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 10 శాతం తగ్గి సోమవారం నాటికి రూ. 138 లక్షల కోట్లకు పడిపోయింది. ఇదే వ్యవధిలో సెన్సెక్స్‌ 8 శాతం క్షీణించింది.

ఇక కరెన్సీ యుద్ధాలు..!
అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ఇక కరెన్సీ వార్‌కు దారితీయనుందన్న భయాలతో వివిధ దేశాల కరెన్సీ విలువలు కుప్పకూలాయి. ఈ ప్రభావం  రూపాయి మారకంపై కూడా ప్రభావం చూపింది. ఒకే రోజు 113 పైసలకు పైగా కుప్పకూలింది. కొత్తగా మరో 300 బిలియన్‌ డాలర్ల విలువ చేసే చైనా ఎగుమతులపై 10 శాతం సుంకాలు విధించాలన్న అమెరికా నిర్ణయం ప్రభావాలను ఎదుర్కొనే క్రమంలో ఎగుమతిదారులకు ఊతమిచ్చే ఉద్దేశంతో సొంత కరెన్సీ విలువను చైనా తగ్గించుకోనుందన్న(డీ వేల్యూ) వార్తలు వచ్చాయి. దీంతో డాలర్‌తో పోలిస్తే చైనా యువాన్‌ విలువ 7.03 స్థాయికి క్షీణించింది.


ప్రపంచ మార్కెట్లు అల్లకల్లోలం..
అమెరికా సుంకాల దాడిని ఎదుర్కొనేందుకు చైనా కరెన్సీ అస్త్రాన్ని ప్రయోగించడం ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేసింది.  ఆసియాలో కీలక సూచీలు భారీగా క్షీణించాయి. షాంఘై కాంపోజిట్‌ ఇండెక్స్‌ 1.6 శాతం, జపాన్‌ నికాయ్‌ 1.7 శాతం మేర తగ్గాయి. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూలవాదుల ఆందోళనలు కూడా తోడవడంతో హాంగ్‌సెంగ్‌ మూడు శాతం దాకా పడింది. ఈ ప్రభావాలతో అటు యూరప్‌ స్టాక్స్‌ కూడా రెండు శాతం దాకా క్షీణించాయి. అమెరికాలో కీలక సూచీలు డోజోన్స్‌ ఏకంగా 2.6 శాతం, నాస్‌డాక్‌ 3.3 శాతం మేర పడ్డాయి.   

రూపాయి విలవిల...
ఆరేళ్లలో అతిపెద్ద పతనం!
డాలర్‌ మారకంలో ఒకేరోజు 113 పైసలు డౌన్‌
70.73 వద్ద ముగింపు
నాలుగు నెలల కనిష్టస్థాయి


ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ సోమవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఒకేరోజు 113 పైసలు (1.62 శాతం) పతనం అయ్యింది. 70.73 వద్ద ముగిసింది. ఇది నాలుగు నెలల కనిష్టస్థాయి. గడచిన ఆరు సంవత్సరాల్లో (2013 ఆగస్టు తరువాత) రూపాయి ఒకేసారి ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో గడచిన మూడు రోజుల ట్రేడింగ్‌లో రూపాయి భారీగా 194 పైసలు నష్టపోయింది.  

మూడు ప్రధాన కారణాలు...
► అమెరికా–చైనా వాణిజ్య భయాలతో విదేశీ ఇన్వెస్టర్ల ఈక్విటీ మార్కెట్‌ అమ్మకాలు

► అమెరికా డాలర్‌ మారకంలో చైనా విదేశీ మారకద్రవ్యం– యువాన్‌ భారీ పతనం. 2008 తరువాత మొట్టమొదటిసారి డాలర్‌ మారకంలో చైనా యువాన్‌ 7% పతనమైంది. ఇది అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం కొత్త దశకు సంకేతమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ వ్యూహకర్త వీకే శర్మ పేర్కొన్నారు. ఎంకే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌  కరెన్సీ రీసెర్చ్‌ హెడ్‌ రాహుల్‌ గుప్తా కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  

► కశ్మీర్‌ అంశంపై అనిశ్చితి. ఈ మూడు ప్రతికూలతలతో నిజానికి రూపాయి మరింత పతనం కావాల్సి ఉంది. అయితే అంతర్జాతీయంగా  తక్కువ ధర వద్ద ట్రేడవుతున్న క్రూడ్‌ ధరలు రూపాయి పతనాన్ని కొంత నిలువరించాయి.  


ఒడిదుడుకుల ట్రేడింగ్‌
ట్రేడింగ్‌ మొదట్లో రూపాయి 70.20 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 70.74 కనిష్టాన్ని చూసింది. 70.18 గరిష్టస్థాయిని తాకినా.... అంతకుమించి బలపడలేకపోయింది.  అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే క్రూడ్‌ ధరల భారీ పతనం, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సంకేతాలతో రూపాయి కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. రూపాయి మరింత బలోపేతం కావడానికి ఈ నిరోధం కీలకం.  ఇక్కడ నుంచి రూపాయి మరింత బలపడలేకపోయింది.

బంగారం భగభగ
► కరెన్సీల పతనం, వాణిజ్య యుద్ధం నేపథ్యం
► ఔన్స్‌కు 1,482 డాలర్లకు దూకుడు
► దేశీయంగానూ కొత్త రికార్డులు
► ఢిల్లీలో రూ. 37 వేలకు చేరువ


న్యూఢిల్లీ/న్యూయార్క్‌: అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం తీవ్రత నేపథ్యంలో అంతర్జాతీయంగా పలు దేశాల కరెన్సీలు డాలర్‌ మారకంలో పతనం కావడం పసిడికి వరమైంది. అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్చంజ్‌లో ఔన్స్‌ (31.1గ్రా) ధర సోమవారం భారీగా పెరిగింది. ఒకదశలో 1,481.75 డాలర్ల గరిష్టాన్ని తాకింది. గడచిన ఆరేళ్లలో పసిడి ఈ స్థాయిని చూడ్డం ఇదే తొలిసారి. ఈ వార్త రాసే రాత్రి 10.30 గంటలకు పసిడి ధర గత శుక్రవారం ధరతో పోల్చితే, 20 డాలర్ల లాభంతో 1,477 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో పసిడిని పెట్టుబడులకు సురక్షితమైనదిగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా పలు దేశాల ఈక్విటీ మార్కెట్లు తీవ్ర నష్టాలతో ట్రేడవుతుంటే, చైనా కరెన్సీ యువాన్‌ ఏకంగా 7 శాతం పతనమైంది.  

దేశీయంగా రూపాయి ఎఫెక్ట్‌ తోడు...
అంతర్జాతీయంగా పరుగుకు తోడు, డాలర్‌ మారకంలో రూపాయి విలువ 1.6 శాతంపైగా పతనం చెందడంతో దేశంలో బంగారం ధర ఒక్కసారిగా మెరిసింది. ఢిల్లీలో సోమవారం ధర 10 గ్రాములుకు (99.9 ప్యూరిటీ) రూ.800 పెరిగి రూ.36,970కి చేరింది. 99.5 ప్యూరిఈ ధర కూడా రూ.800 ఎగసి రూ.36,800కి చేరింది.  బంగారంతోపాటు వెండి ధర కూడా ఢిల్లీలో భారీగా కేజీకి రూ.1,000 పెరిగింది. రూ.43,100కి చేరింది. ఈ వార్త రాసే రాత్రి 10.30 గంటల సమయానికి దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో 10 గ్రాముల పసిడి ధర క్రితం శుక్రవారం ధరతో పోల్చి రూ.988 లాభంతో రూ.37,259 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ.37,347ను కూడా తాకింది. కాగా వెండి ధర రూ.991 లాభంలో రూ.42,355 వద్ద ట్రేడవుతోంది. ఇదే రీతిన ట్రేడింగ్‌ ముగిస్తే, మంగళవారం దేశంలో పసిడి ధరలు మరింత పరుగు పెట్టే అవకాశం ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement