సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ప్రస్తుతం కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నిస్తున్నారు.
బీజేపీ నేత సంబిత్ పాత్రా ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ‘‘నెహ్రూ నుంచి చిదంబరం దాకా కాంగ్రెస్ నేతలదంతా గజిబిజి వ్యవహారరమే. వాళ్ల హయాంలోనే రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. మనం ఇప్పుడు కశ్మీర్ గురించి ఇలా మాట్లాడుకోవటానికి కూడా కారణం వాళ్లే. అలాంటిది కశ్మీర్ స్వేచ్ఛ కోసం మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఆ అంశంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది’’ అని పాత్రా పేర్కొన్నారు.
ఇక చిదంబరం ఓ దేశద్రోహిలా మాట్లాడాడని.. ఆయన్ని జైలుకు పంపాల్సిందేనని సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి మండిపడ్డారు. మరోనేత కమల నేత షానవాజ్ హుస్సేన్ కూడా మాజీ ఆర్థిక మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కశ్మీర్ తోపాటు యావత్ దేశ ప్రజలు కశ్మీర్ పరిస్థితులకు కారణం పాకిస్థాన్ అని బలంగా నమ్ముతున్నారు. కానీ, చిదంబరంకు ఆ మాత్రం తెలీకపోవటం శోచనీయం. అయినా ఆజాదీ(స్వేచ్ఛ) అంటే స్వయంప్రతిపత్తి మాత్రమే కాదన్న విషయం చిదంబరం గుర్తించాలని హుస్సేన్ సూచించారు.
కాగా, కశ్మీర్ ప్రజలకు ఆజాదీ అంటే స్వయం ప్రతిపత్తి అని చిదంబరం శనివారం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అక్కడి ప్రజలతో తాను చర్చలు జరిపినప్పుడు తనకు ఈ విషయం అర్థమైందని, స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిన అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఈ వ్యాఖ్యలతో మాజీ చర్చల ప్రతినిధి ఎంఎం అన్సారీ ఏకీభవించటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment