National Law Day
-
దేశమంతటా నేటి నుంచి రాజ్యాంగ వజ్రోత్సవాలు
స్వాతంత్య్ర దినోత్సవం అందరికీ తెలుసు. మరి రాజ్యాంగ దినోత్సవం అంటే ఏమిటి? గణతంత్ర దినం మనందరికీ తెలుసు కదా. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నాటినుంచీ భారత్ గణతంత్ర దేశంగా మారింది. అందుకే ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటున్నాం. ఆ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేడ్కర్ సారథ్యంలోని రచనా (డ్రాఫ్టింగ్) కమిటీ దాదాపు మూడేళ్ల పాటు అవిశ్రాంతంగా శ్రమించి రూపొందించింది. భారత రాజ్యాంగ పరిషత్ దాన్ని కూలంకషంగా పరిశీలించి 1949 నవంబర్ 26న ఆమోదించింది. అదే రాజ్యాంగ దినోత్సవం. గతంలో దీన్ని నేషనల్ లా డే గా జరుపుకునేవాళ్లం. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం 2015లో నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఆ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటినుంచీ ఏటా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్)గా జరుపుకుంటున్నాం. పౌరుల్లో రాజ్యాంగ విలువల పట్ల అవగాహనను పెంచడంతో పాటు రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించేలా ఆ రోజున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. రాజ్యాంగాన్ని ఆమోదించిన చరిత్రాత్మక సందర్భానికి బుధవారంతో 75 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇదీ నేపథ్యం... భారత్‌కు స్వాతంత్య్రం రావడం ఖాయమని 1945 కల్లా తేలిపోయింది. దాంతో స్వతంత్ర భారతావనికి పాలనతో పాటు అన్ని అంశాల్లోనూ చుక్కానిలా దిశానిర్దేశం చేసే రాజ్యాంగం అవసరమైంది. దాని నిర్మాణం కోసం కేబినెట్ మిషన్ ప్లాన్‌లో భాగంగా 1946 డిసెంబర్లో 389 మంది ఉద్ధండులతో రాజ్యాంగ పరిషత్ (అసెంబ్లీ) ఏర్పాటైంది. దీనిలో సభ్యులుగా ఎవరుండాలో నిర్ణయించేందుకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. అలా రాజ్యాంగ రచనకు ఉద్దేశించిన సంస్థ పుట్టుకలోనే ప్రజాస్వామిక విలువలు దాగుండటం విశేషం! అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర ప్రముఖులు ఇందులో సభ్యులు. దేశ విభజన అనంతరం రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్యను 299కి కుదించారు. 1946 డిసెంబర్ 9న బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ తొలిసారిగా సమావేశమైంది. రాజ్యాంగ రచనకు డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి అంబేడ్కర్ చైర్మన్‌గా వ్యవహరించారు. ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలనూ కూలంకషంగా పరిశీలించిన మీదట మన రాజ్యాంగానికి డ్రాఫ్టింగ్ కమిటీ రూపమిచ్చింది. ఇందుకు రెండేళ్ల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. ఆ వ్యవధిలో డ్రాఫ్టింగ్ కమిటీ 11సార్లు సమావేశమై ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ 395 ఆర్టికళ్లు, 8 షెడ్యూళ్లతో ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగానికి తుది రూపునిచ్చింది. డ్రాఫ్టింగ్ కమిటీ సమర్పించిన రాజ్యాంగ ప్రతిని అతి కొద్ది మార్పుచేర్పులతో రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26న ఆమోదించింది.రాజ్యాంగమంటే కేవలం రాత ప్రతి కాదు. ఒక జాతి జీవన విధానం. దేశమంతటికీ నిరంతర చైతన్యస్ఫూర్తి– బాబాసాహెబ్ అంబేడ్కర్– సాక్షి, నేషనల్ డెస్క్ -
‘న్యాయ గడియారాలు’...!
న్యాయపరమైన వ్యవహారాలు, ప్రక్రియల్లో మరింత సమర్థతను పెంచడంలో భాగంగా దేశంలోని మొత్తం 24 హైకోర్టులలో ‘న్యాయ గడియారాలు’ ఏర్పాటు చేయనున్నారు. ఈ చర్య ద్వారా ప్రజల్లో చైతన్యం పెరిగి న్యాయవ్యవస్థలో సమర్థత పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మనదేశంలో కేసుల పరిష్కారానికి సంబంధించిన న్యాయప్రక్రియ సుదీర్ఘకాలం కొనసాగుతూ కక్షిదారులకు విసుగు చెందేంత స్థాయి వరకు వెళ్లడం మనకు తెలిసిందే. న్యాయ విభాగం జవాబుదారీతనం, సమర్థతపై దేశవ్యాప్త చర్చ సాగుతున్న నేపథ్యంలో... ఈ విషయంలో కోర్టుల మధ్య పరస్పరం కేసుల పరిష్కారంలో ఆరోగ్యకరమైన పోటీ నెలకొనడంతో పాటు పౌరుల పట్ల న్యాయస్థానాలు మరింత స్నేహపూర్వకంగా వ్యవహరించేలా చేయొచ్చునని ప్రభుత్వం అంచనావేస్తోంది. గతేడాది నవంబర్ 26న ‘నేషనల్ లా డే’ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ వివిధ న్యాయస్థానాల ఆవరణలో న్యాయ గడియారాలుంచాలని చేసిన సూచనకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ గడియారాల్లో (ఎల్ఈడీ మెసేజ్ డిస్ప్లే బోర్డుల్లో) పెండింగ్ కేసుల సంఖ్య ప్రదర్శిస్తారు. ప్రతీరోజు కోర్టులు పరిష్కరించిన కేసులు, ఇలాంటి కేసుల సంఖ్య ఆధారంగా ఒక్కో న్యాయస్థానం సాధించిన ర్యాంక్ ఎంతో అందులో చూపుతారు. కొత్తఢిల్లీలోని న్యాయశాఖ కార్యాలయంలో ఇప్పటికే ఇలాంటి గడియారాన్ని ఏర్పాటుచేశారు. దేశంలోని న్యాయస్థానాల్లో అధికసంఖ్యలో కేసులు పరిష్కరించిన వాటిని గురించి ఇందుల్లో ప్రదర్శిస్తారు. దీనికి కొనసాగింపుగా దేశంలోని అన్ని హైకోర్టుల్లో వీటిని అమర్చుతారు. ఆ తర్వాత కింది కోర్టుల్లోనూ వీటిని నెలకొల్పనున్నారు. పరిష్కరించే కేసుల విషయంలో న్యాయస్థానాల మధ్య పోటీ తత్వాన్ని పెంచేందుకు, పనితీరు ఆధారంగా హైకోర్టులకు ర్యాంక్‌లిచ్చేందుకు ఈ గడియారాలు ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి చెబుతున్నారు. భవిష్యత్‌లో అన్ని సబార్డినేట్ కోర్టులలో సైతం వీటిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మళ్లీ అదే చర్చ
న్యాయ, పరిపాలనా విభాగాల అధికారాల పరిధులకు సంబంధించిన వివాదం కొత్తదేం కాదు. కాకపోతే జాతీయ న్యాయ దినోత్సవ కార్యక్రమం అందుకు వేదిక కావడం, న్యాయవ్యవస్థ క్రియాశీలత (జ్యుడిషియల్ యాక్టివిజం) పేరిట దాని పరిధులను అతిక్రమిస్తున్నదని కేంద్ర మంత్రులే ఆరోపించడం విశేషం. ప్రజాస్వామ్య సౌధానికి మూడు మూలస్తంభాలుగా శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలను మన రాజ్యాంగకర్తలు నిర్వచించారు. వాటి అధికారాల పరిధులను స్థూలంగానే నిర్వచించి, అవి మూడూ ఒకే వ్యవస్థలోని సజీవ అంగాలుగా పనిచేయాలని భావించారు. అవి ఒకే కుటుంబంలోని భాగాలని, ఒకదానినొకటి బలోపేతం చేయ డానికి కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్న మాటలు ఆ స్ఫూర్తినే ప్రతి ధ్వనించాయి. అయితే, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ.. క్రియాశీలత పేరిట న్యాయవ్యవస్థ తన అధికారాల పరిధులను అతిక్రమిస్తోందని, ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పిల్) సహాయంతో విధాన రూపకల్పనా విధులను చేపట్టాలనే తాపత్ర యాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు మధ్య ఉన్న విభేదాలు అనుకోని విధంగా ఇలా రచ్చకెక్కాయి. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా స్వయంగా తమ వాదాన్ని వినిపించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్య వ్యవస్థలోని మూడు అంగాల మధ్య అధికారాల విభజన సుస్పష్టంగా గిరి గీసినట్టు ఉండాలనే కోరిక మంచిదే గానీ ఆచరణ సాధ్యమైనది కాదు. రాజ్యాంగం పౌరులందరికీ హామీనిచ్చిన ప్రాథమిక హక్కులను పరిరక్షించే బాధ్యత న్యాయవ్యవస్థదే. ఆ క్రమంలో అది ప్రభుత్వానికి, చట్టసభలకు పలు నిర్దేశాలను చేయాల్సి వస్తుంది. అవసరమైతే కొత్త విధానాలను, చట్టాలను తేవాలని కోరాల్సి ఉంటుంది. ‘‘శాసన, పరిపాలనా విభాగాలు తాకకుండా వదిలేసిన వివిధ అంశాలు ప్రజాప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నప్పుడు న్యాయవ్యవస్థ వాటిని పట్టించు కుంటుంది’’ అంటూ 2008లోనే కేంద్రానికి వ్యతిరేకంగా దాఖలైన ఒక వ్యాజ్యంలో జస్టిస్ హెచ్‌కే సేన్ స్పష్టం చేశారు. పిల్లకు, న్యాయవ్యవస్థ క్రియాశీలతకు వ్యతి రేకంగా వాదించే వారు అసలు వాటి పుట్టుకకు కారణమే శాసన, పరిపాలనా విభా గాల వైఫల్యాలనే విషయాన్ని విస్మరిస్తున్నారు. కాలుష్యం వంటి సమస్యల్లో కోర్టుల జోక్యాన్ని ఈ విమర్శకులు తరచుగా ప్రస్తావిస్తుంటారు. నిబంధనలను గాలికి వదలి పారిశ్రామిక వేత్తలు, సంస్థలు, వ్యక్తులు జీవనదులను, గాలిని, వాతావర ణాన్ని కాలుష్య కాసారాలుగా మారుస్తుంటే పట్టించుకోని ప్రభుత్వాల, చట్టసభల క్రియారాహిత్యమే కోర్టుల జోక్యాన్ని అవసరం చేస్తోంది. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలన్నా కోర్టులను ఆశ్రయించాల్సిన దుస్థితి రోజూ కళ్లకు కడుతూనే ఉంది. పార్టీలకు అతీతంగా వివిధ స్థాయిల్లోని ప్రభుత్వాలు, చట్ట సంస్థలు ప్రజలకు గౌరవప్రదంగా జీవించే హక్కును కల్పించలేని పరిస్థితుల్లోనే పిల్ అనే భావన పుట్టింది. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఉపయోగపడే ముఖ్య సాధనం అయింది. స్వాతంత్య్రానంతరపు తొలినాళ్లలో చట్టసభలు, ప్రభుత్వాలు తమ ఆకాంక్ష లను నెరవేర్చగలవనే దృఢ విశ్వాసం ఉండేది. గత ఏడు దశాబ్దాలుగా అది సడ లుతూ వస్తోంది. కారణం మన చట్టసభల, ప్రభుత్వాల పనితీరు నానాటికీ తీసి కట్టుగా దిగజారుతుండటమే. 2–జీ స్పెక్ట్రమ్ వ్యవహారంలో సుప్రీం కోర్టు 122 లైసెన్స్‌లను రద్దు చేసింది. అంతేకాదు, ఆ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు వివరా లను ప్రధానికే వెల్లడించరాదని ఆదేశించింది. ఈ జోక్యాన్ని, క్రియాశీలతను నాడు యావద్భారతం ప్రశంసించింది. దాన్ని అధికారాల పరిధి అతిక్రమణగా నాటి ప్రతిపక్షాలు విమర్శించలేదు. అవసరమైనప్పుడు ఇతర రెండు వ్యవస్థలను సరిదిద్దే పనిని న్యాయవ్యవస్థకు అప్పగించిన రాజ్యాంగమే.. న్యాయ వ్యవస్థలోని తప్పు లను సరిదిద్దే హక్కును పార్లమెంటుకు ఇచ్చింది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏవైనా న్యాయ క్రియాశీలతను అతిక్రమణగా విమర్శించడం పరిపాటిగా మారింది. ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ అంగాలేవీ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడానికి వీల్లేదు, అలాంటి సందర్భాల్లో వాటిని పరిర క్షించే బాధ్యత న్యాయవ్యవస్థదే. ‘‘ప్రాథమిక హక్కులు స్థిరాంకాలేమీ కావు. వాటిలో చాలా వరకు ఖాళీ పాత్రల వంటివి. ప్రతి తరమూ తమ అనుభవాల వెలుగులో వాటిలో సారాన్ని నింపాల్సి ఉంటుంది’’ అని కేశవానంద భారతి కేసులో జస్టిస్ కేకే మాథ్యూ చేసిన వ్యాఖ్య రాజ్యాంగం నిజస్ఫూర్తికి అద్దం పడుతుంది. ప్రజల ప్రాథమిక హక్కుల పరిధిని విస్తరింపజేస్తూ, వాటికి జవసత్వాలను సమకూర్చడం అనే లక్ష్యంతో మూడు వ్యవ స్థలూ కలసి పరస్పర విశ్వాసంతో పనిచేయడం అవసరం. అయితే న్యాయవ్యవస్థ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేసే కీలక అంశాలూ ఉన్నాయి. అన్ని వ్యవస్థల నుంచి జవాబుదారీతనాన్ని కోరే న్యాయవ్యవస్థకు జవాబు దారీతనం అక్కర్లేదా? న్యాయవ్యవస్థ స్వతంత్రత అంటే అది పారదర్శకతకు అతీ తమైనదని అర్థమా? ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేని స్థితి తరచుగా న్యాయవ్యవస్థను ఇరకాటంలో పెడుతోంది. న్యాయ నియామకాలలో సహేతుకతను, పారదర్శకతను తేవడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టం చేస్తే సుప్రీంకోర్టు కొట్టివేసింది. చట్టంతో న్యాయవ్యవస్థపై ఆధిపత్యం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్న మాట నిజమే అనుకున్నా.. తన స్వతంత్రతకు భంగకరంకాని మరో ప్రత్యామ్నాయాన్ని çసూచిం చకపోగా కొలీజియం వ్యవస్థనే అది కొనసాగించడం ఎవరికీ మింగుడుపడేది కాదు. న్యాయవ్యవస్థ ప్రజల అన్ని సమస్యలను పరిష్కరించలేదు, ప్రభుత్వాల నిష్క్రియా పరత్వాన్ని లేదా బాధ్యతారాహిత్యాన్ని అదే వదిలించలేదు. నిజానికి పిల్ల ఉచితా నుచితాలు, న్యాయవ్యవస్థ క్రియాశీలత చుట్టూ తిరుగుతున్న చర్చంతా.. పై నుంచి కింది వరకు చట్టసభలు, ప్రభుత్వాలు విశాల ప్రజానీకం ఆకాంక్షను నెరవేర్చే దిశగా, గౌరవప్రదంగా, ఆరోగ్యకరంగా జీవించే హక్కు సహా అన్ని హక్కులను పరి రక్షిస్తూ సాగేలా చేసేదెలా? అనే అతి పెద్ద సమçస్య నుంచి పుట్టుకొచ్చినవే. అ దిశగా అంతా దృష్టిని కేంద్రీకరించడం ఉత్తమం. -
ఆ మూడింటిది ఒకే కుటుంబం
న్యూఢిల్లీ: న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకే కుటుంబానికి చెందినవనీ, అవి మూడు ఒకదానినొకటి బలోపేతం చేసుకునేలా పనిచేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ మూడు వ్యవస్థల మధ్య ఉండే సమన్వయమే రాజ్యాంగానికి వెన్నెముకని ఆయన పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఈ మూడు వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏ ఆధికారానికైనా ఓ హద్దు ఉంటుందంటూ నాడు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ చెప్పిన మాటలను మోదీ గుర్తుచేశారు. పాలనలో న్యాయవ్యవస్థ పాత్రపై న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరగడంతో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మారిన కాలానికి అనుగుణంగా ఎలా ముందుకెళ్లాలనేదానిపై మూడు వ్యవస్థలూ లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మూడు వ్యవస్థలూ మీది తప్పంటే మీది తప్పంటూ పరస్పరం విమర్శించుకోవాల్సిన అవసరం లేదనీ, ఏదేనీ ఒక వ్యవస్థలోని లోపాలు, బలాబలాలు...మిగతా రెండు వ్యవస్థల్లోని వారికీ తెలుసని అన్నారు. జాతీయ న్యాయదినోత్సవం సందర్భంగా రెండు రోజులపాటు సుప్రీంకోర్టు, నీతి ఆయోగ్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో మోదీ ముగింపు ప్రసంగం చేశారు. పౌరులు హక్కుల కోసం పోరాడటంతోపాటు బాధ్యతలను కూడా విస్మరించరాదని హితవు పలికారు. మోదీ కన్నా ముందు కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అధికారాల విభజనపై న్యాయవ్యవస్థను ఉద్దేశించి మాట్లాడారు. ‘అధికార విభజన సిద్ధాంతానికి కార్యనిర్వాహక వ్యవస్థ ఎలా కట్టుబడి ఉంటుందో, న్యాయవ్యవస్థ కూడా అలానే ఉండాలి. చట్టాల రూపకల్పన అంశాన్ని ఎన్నికైన ప్రభుత్వాలకే వదిలేయాలి. పరిపాలన అనేది ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వమే చేయాలనీ, వారే ప్రజలకు జవాబుదారీగా ఉండాలని జాతి నిర్మాతలు స్పష్టంగా పేర్కొన్నారు. న్యాయవ్యవస్థకు స్వతంత్రత ఎంతో ముఖ్యమైనదే. కానీ న్యాయవ్యవస్థలో జవాబుదారీ తనం, నిజాయితీ కూడా ముఖ్యమైనవే. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని ప్రభుత్వం ఆమోదిస్తుంది. అయితే న్యాయమూర్తుల నియామకాలను పరిశీలించాలన్న సలహా కూడా అభినందించదగ్గదే’ అని రవిశంకర్ అన్నారు. న్యాయ గడియారాల ఏర్పాటు: మోదీ కోర్టులు కేసులను పరిష్కరిస్తున్న వేగాన్ని బట్టి వాటికి ర్యాంకులిచ్చేలా దేశంలోని వివిధ కోర్టుల పరిసరాల్లో ‘న్యాయ గడియారాల’ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని మోదీ సూచించారు. దీనివల్ల కేసులను త్వరితగతిన పరిష్కరించడంలో న్యాయమూర్తుల మధ్య పోటీ కూడా ఏర్పడుతుందనీ, తద్వారా కేసుల సంఖ్య తగ్గుతుందని మోదీ పేర్కొన్నారు. మరొకరు తలదూర్చకూడదు... రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు నిర్వహించిన మరో కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు వాటి స్వేచ్ఛ పరిధి గురించి అప్రమత్తతతో ఉండాలనీ, ఆయా వ్యవస్థల స్వతంత్రతను కాపాడుకోవడానికి అవి పాటుపడాలని అన్నారు. ఈ మూడు వ్యవస్థల మధ్య అధికారాల విభజనను గుర్తెరిగి నడచుకోవాలనీ, ఒకరి విధుల్లో మరొకరు తలదూర్చకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. రాజ్యాంగం అంటే కాగితాలు కాదనీ, ప్రాణమున్న పత్రమని కోవింద్ పేర్కొన్నారు. విధానాలను తనిఖీ చేసే అధికారం మాకుంది: సీజేఐ రవి శంకర్ ప్రసాద్ వ్యాఖ్యలపై సీజేఐ జస్టిస్ మిశ్రా స్పందిస్తూ ‘మూడు వ్యవస్థల మధ్య పరస్పర గౌరవం ఉండాలి. ఈ మూడింటిలో మాకున్న అధికారాలే గొప్పవంటూ ఏ వ్యవస్థా చెప్పుకోవడానికి లేదు. మేం ఏ విధానాలనూ తీసుకురావడం లేదు. కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను తనిఖీ చేసే, అవి అమలయ్యేలా చూసే అధికారం మాకు ఉంది. రాజ్యాంగమే పరిపాలనాధిపతి అని సుప్రీంకోర్టులో మేం విశ్వసిస్తాం. పాటిస్తాం. చట్టాలకు లోబడి ప్రభుత్వాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని సరిచూసేందుకు అవసరమైన అధికారాలిస్తూ, రాజ్యాంగానికి తుది రక్షణదారుగా న్యాయవ్యవస్థను రాజ్యాంగమే నిలిపింది’ అని మిశ్రా పేర్కొన్నారు. పాలనాపరమైన విధానాలు తీసుకురావడానికి ప్రజాహిత వ్యాజ్యాలను దుర్వినియోగం చేస్తున్నారన్న వ్యాఖ్యలను జస్టిస్ మిశ్రా తిరస్కరించారు. పౌరుల ప్రాథమిక హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. -
అప్పుడే న్యాయ వ్యవస్థ స్వతంత్రత సాధ్యం
లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య సాక్షి, హైదరాబాద్: న్యాయ పాలన సక్రమంగా సాగినప్పుడే న్యాయవ్యవస్థ తన స్వతంత్రతను నిలబెట్టుకోగలుగుతందని హైకోర్టు న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ గుండా చంద్రయ్య అన్నారు. జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశం కూడా ఇదేనన్నారు. జాతీ య న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైకోర్టులో ‘మహిళల సాధికారిత’ అంశంపై జరిగిన కార్యక్రమంలో జస్టిస్ చంద్రయ్య మాట్లాడారు.