దేశమంతటా నేటి నుంచి రాజ్యాంగ వజ్రోత్సవాలు | Dr BR Ambedkar, history of the Indian Constitution | Sakshi
Sakshi News home page

దేశమంతటా నేటి నుంచి రాజ్యాంగ వజ్రోత్సవాలు

Published Tue, Nov 26 2024 4:18 AM | Last Updated on Tue, Nov 26 2024 7:14 AM

Dr BR Ambedkar, history of the Indian Constitution
  • 1949 నవంబర్‌ 26న రాజ్యాంగానికి ఆమోదం 
  • ఆ చరిత్రాత్మక సందర్భానికి నేటితో 75 ఏళ్లు 
  • ఏడాది పొడవునా రాజ్యాంగ దినోత్సవాలు 
  • రాజ్యాంగ ప్రాశస్త్యంపై పౌరులకు అవగాహన 
  • నేడు పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక భేటీ 

స్వాతంత్య్ర దినోత్సవం అందరికీ తెలుసు. మరి రాజ్యాంగ దినోత్సవం అంటే ఏమిటి? గణతంత్ర దినం మనందరికీ తెలుసు కదా. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నాటినుంచీ భారత్‌ గణతంత్ర దేశంగా మారింది. అందుకే ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటున్నాం. ఆ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ సారథ్యంలోని రచనా (డ్రాఫ్టింగ్‌) కమిటీ దాదాపు మూడేళ్ల పాటు అవిశ్రాంతంగా శ్రమించి రూపొందించింది. 

భారత రాజ్యాంగ పరిషత్‌ దాన్ని కూలంకషంగా పరిశీలించి 1949 నవంబర్‌ 26న ఆమోదించింది. అదే రాజ్యాంగ దినోత్సవం. గతంలో దీన్ని నేషనల్‌ లా డే గా జరుపుకునేవాళ్లం. నవంబర్‌ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం 2015లో నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా ఆ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

అప్పటినుంచీ ఏటా నవంబర్‌ 26ను రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్‌ దివస్‌)గా జరుపుకుంటున్నాం. పౌరుల్లో రాజ్యాంగ విలువల పట్ల అవగాహనను పెంచడంతో పాటు రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించేలా ఆ రోజున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. రాజ్యాంగాన్ని ఆమోదించిన చరిత్రాత్మక సందర్భానికి బుధవారంతో 75 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. 

ఇదీ నేపథ్యం... 
భారత్‌కు స్వాతంత్య్రం రావడం ఖాయమని 1945 కల్లా తేలిపోయింది. దాంతో స్వతంత్ర భారతావనికి పాలనతో పాటు అన్ని అంశాల్లోనూ చుక్కానిలా దిశానిర్దేశం చేసే రాజ్యాంగం అవసరమైంది. దాని నిర్మాణం కోసం కేబినెట్‌ మిషన్‌ ప్లాన్‌లో భాగంగా 1946 డిసెంబర్‌లో 389 మంది ఉద్ధండులతో రాజ్యాంగ పరిషత్‌ (అసెంబ్లీ) ఏర్పాటైంది. 

దీనిలో సభ్యులుగా ఎవరుండాలో నిర్ణయించేందుకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. అలా రాజ్యాంగ రచనకు ఉద్దేశించిన సంస్థ పుట్టుకలోనే ప్రజాస్వామిక విలువలు దాగుండటం విశేషం! అంబేడ్కర్, జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ తదితర ప్రముఖులు ఇందులో సభ్యులు. దేశ విభజన అనంతరం రాజ్యాంగ పరిషత్‌ సభ్యుల సంఖ్యను 299కి కుదించారు. 

1946 డిసెంబర్‌ 9న బాబూ రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్‌ తొలిసారిగా సమావేశమైంది. రాజ్యాంగ రచనకు డ్రాఫ్టింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి అంబేడ్కర్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలనూ కూలంకషంగా పరిశీలించిన మీదట మన రాజ్యాంగానికి డ్రాఫ్టింగ్‌ కమిటీ రూపమిచ్చింది. 

ఇందుకు రెండేళ్ల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. ఆ వ్యవధిలో డ్రాఫ్టింగ్‌ కమిటీ 11సార్లు సమావేశమై ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ 395 ఆర్టికళ్లు, 8 షెడ్యూళ్లతో ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగానికి తుది రూపునిచ్చింది. డ్రాఫ్టింగ్‌ కమిటీ సమర్పించిన రాజ్యాంగ ప్రతిని అతి కొద్ది మార్పుచేర్పులతో రాజ్యాంగ పరిషత్‌ 1949 నవంబర్‌ 26న ఆమోదించింది.

రాజ్యాంగమంటే కేవలం రాత ప్రతి కాదు. ఒక జాతి జీవన విధానం. దేశమంతటికీ నిరంతర చైతన్యస్ఫూర్తి
– బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement