న్యాయ, పరిపాలనా విభాగాల అధికారాల పరిధులకు సంబంధించిన వివాదం కొత్తదేం కాదు. కాకపోతే జాతీయ న్యాయ దినోత్సవ కార్యక్రమం అందుకు వేదిక కావడం, న్యాయవ్యవస్థ క్రియాశీలత (జ్యుడిషియల్ యాక్టివిజం) పేరిట దాని పరిధులను అతిక్రమిస్తున్నదని కేంద్ర మంత్రులే ఆరోపించడం విశేషం. ప్రజాస్వామ్య సౌధానికి మూడు మూలస్తంభాలుగా శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలను మన రాజ్యాంగకర్తలు నిర్వచించారు. వాటి అధికారాల పరిధులను స్థూలంగానే నిర్వచించి, అవి మూడూ ఒకే వ్యవస్థలోని సజీవ అంగాలుగా పనిచేయాలని భావించారు. అవి ఒకే కుటుంబంలోని భాగాలని, ఒకదానినొకటి బలోపేతం చేయ డానికి కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్న మాటలు ఆ స్ఫూర్తినే ప్రతి ధ్వనించాయి.
అయితే, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ.. క్రియాశీలత పేరిట న్యాయవ్యవస్థ తన అధికారాల పరిధులను అతిక్రమిస్తోందని, ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పిల్) సహాయంతో విధాన రూపకల్పనా విధులను చేపట్టాలనే తాపత్ర యాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు మధ్య ఉన్న విభేదాలు అనుకోని విధంగా ఇలా రచ్చకెక్కాయి. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా స్వయంగా తమ వాదాన్ని వినిపించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్య వ్యవస్థలోని మూడు అంగాల మధ్య అధికారాల విభజన సుస్పష్టంగా గిరి గీసినట్టు ఉండాలనే కోరిక మంచిదే గానీ ఆచరణ సాధ్యమైనది కాదు. రాజ్యాంగం పౌరులందరికీ హామీనిచ్చిన ప్రాథమిక హక్కులను పరిరక్షించే బాధ్యత న్యాయవ్యవస్థదే. ఆ క్రమంలో అది ప్రభుత్వానికి, చట్టసభలకు పలు నిర్దేశాలను చేయాల్సి వస్తుంది. అవసరమైతే కొత్త విధానాలను, చట్టాలను తేవాలని కోరాల్సి ఉంటుంది. ‘‘శాసన, పరిపాలనా విభాగాలు తాకకుండా వదిలేసిన వివిధ అంశాలు ప్రజాప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నప్పుడు న్యాయవ్యవస్థ వాటిని పట్టించు కుంటుంది’’ అంటూ 2008లోనే కేంద్రానికి వ్యతిరేకంగా దాఖలైన ఒక వ్యాజ్యంలో జస్టిస్ హెచ్‌కే సేన్ స్పష్టం చేశారు. పిల్‌లకు, న్యాయవ్యవస్థ క్రియాశీలతకు వ్యతి రేకంగా వాదించే వారు అసలు వాటి పుట్టుకకు కారణమే శాసన, పరిపాలనా విభా గాల వైఫల్యాలనే విషయాన్ని విస్మరిస్తున్నారు. కాలుష్యం వంటి సమస్యల్లో కోర్టుల జోక్యాన్ని ఈ విమర్శకులు తరచుగా ప్రస్తావిస్తుంటారు. నిబంధనలను గాలికి వదలి పారిశ్రామిక వేత్తలు, సంస్థలు, వ్యక్తులు జీవనదులను, గాలిని, వాతావర ణాన్ని కాలుష్య కాసారాలుగా మారుస్తుంటే పట్టించుకోని ప్రభుత్వాల, చట్టసభల క్రియారాహిత్యమే కోర్టుల జోక్యాన్ని అవసరం చేస్తోంది. పోలీస్ స్టేషన్లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలన్నా కోర్టులను ఆశ్రయించాల్సిన దుస్థితి రోజూ కళ్లకు కడుతూనే ఉంది. పార్టీలకు అతీతంగా వివిధ స్థాయిల్లోని ప్రభుత్వాలు, చట్ట సంస్థలు ప్రజలకు గౌరవప్రదంగా జీవించే హక్కును కల్పించలేని పరిస్థితుల్లోనే పిల్ అనే భావన పుట్టింది. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఉపయోగపడే ముఖ్య సాధనం అయింది.
స్వాతంత్య్రానంతరపు తొలినాళ్లలో చట్టసభలు, ప్రభుత్వాలు తమ ఆకాంక్ష లను నెరవేర్చగలవనే దృఢ విశ్వాసం ఉండేది. గత ఏడు దశాబ్దాలుగా అది సడ లుతూ వస్తోంది. కారణం మన చట్టసభల, ప్రభుత్వాల పనితీరు నానాటికీ తీసి కట్టుగా దిగజారుతుండటమే. 2–జీ స్పెక్ట్రమ్ వ్యవహారంలో సుప్రీం కోర్టు 122 లైసెన్స్‌లను రద్దు చేసింది. అంతేకాదు, ఆ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు వివరా లను ప్రధానికే వెల్లడించరాదని ఆదేశించింది. ఈ జోక్యాన్ని, క్రియాశీలతను నాడు యావద్భారతం ప్రశంసించింది. దాన్ని అధికారాల పరిధి అతిక్రమణగా నాటి ప్రతిపక్షాలు విమర్శించలేదు. అవసరమైనప్పుడు ఇతర రెండు వ్యవస్థలను సరిదిద్దే పనిని న్యాయవ్యవస్థకు అప్పగించిన రాజ్యాంగమే.. న్యాయ వ్యవస్థలోని తప్పు లను సరిదిద్దే హక్కును పార్లమెంటుకు ఇచ్చింది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏవైనా న్యాయ క్రియాశీలతను అతిక్రమణగా విమర్శించడం పరిపాటిగా మారింది. ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ అంగాలేవీ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడానికి వీల్లేదు, అలాంటి సందర్భాల్లో వాటిని పరిర క్షించే బాధ్యత న్యాయవ్యవస్థదే. ‘‘ప్రాథమిక హక్కులు స్థిరాంకాలేమీ కావు. వాటిలో చాలా వరకు ఖాళీ పాత్రల వంటివి. ప్రతి తరమూ తమ అనుభవాల వెలుగులో వాటిలో సారాన్ని నింపాల్సి ఉంటుంది’’ అని కేశవానంద భారతి కేసులో జస్టిస్ కేకే మాథ్యూ చేసిన వ్యాఖ్య రాజ్యాంగం నిజస్ఫూర్తికి అద్దం పడుతుంది. ప్రజల ప్రాథమిక హక్కుల పరిధిని విస్తరింపజేస్తూ, వాటికి జవసత్వాలను సమకూర్చడం అనే లక్ష్యంతో మూడు వ్యవ స్థలూ కలసి పరస్పర విశ్వాసంతో పనిచేయడం అవసరం.
అయితే న్యాయవ్యవస్థ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేసే కీలక అంశాలూ ఉన్నాయి. అన్ని వ్యవస్థల నుంచి జవాబుదారీతనాన్ని కోరే న్యాయవ్యవస్థకు జవాబు దారీతనం అక్కర్లేదా? న్యాయవ్యవస్థ స్వతంత్రత అంటే అది పారదర్శకతకు అతీ తమైనదని అర్థమా? ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేని స్థితి తరచుగా న్యాయవ్యవస్థను ఇరకాటంలో పెడుతోంది. న్యాయ నియామకాలలో సహేతుకతను, పారదర్శకతను తేవడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టం చేస్తే సుప్రీంకోర్టు కొట్టివేసింది. చట్టంతో న్యాయవ్యవస్థపై ఆధిపత్యం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్న మాట నిజమే అనుకున్నా.. తన స్వతంత్రతకు భంగకరంకాని మరో ప్రత్యామ్నాయాన్ని çసూచిం చకపోగా కొలీజియం వ్యవస్థనే అది కొనసాగించడం ఎవరికీ మింగుడుపడేది కాదు. న్యాయవ్యవస్థ ప్రజల అన్ని సమస్యలను పరిష్కరించలేదు, ప్రభుత్వాల నిష్క్రియా పరత్వాన్ని లేదా బాధ్యతారాహిత్యాన్ని అదే వదిలించలేదు. నిజానికి పిల్‌ల ఉచితా నుచితాలు, న్యాయవ్యవస్థ క్రియాశీలత చుట్టూ తిరుగుతున్న చర్చంతా.. పై నుంచి కింది వరకు చట్టసభలు, ప్రభుత్వాలు విశాల ప్రజానీకం ఆకాంక్షను నెరవేర్చే దిశగా, గౌరవప్రదంగా, ఆరోగ్యకరంగా జీవించే హక్కు సహా అన్ని హక్కులను పరి రక్షిస్తూ సాగేలా చేసేదెలా? అనే అతి పెద్ద సమçస్య నుంచి పుట్టుకొచ్చినవే. అ దిశగా అంతా దృష్టిని కేంద్రీకరించడం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment