Words on Water
-
ఓన్లీ రాహుల్, ఓన్లీ ప్రియాంక
షిమ్లా: వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ)పై నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ‘ఓన్లీ రాహుల్ ఓన్లీ ప్రియాంక ’అని వ్యంగ్యంగా అర్థం చెప్పగా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ‘దేశం ప్రస్తుతం ఓడొమోస్ (ఓవర్ డోస్ ఆఫ్ ఓన్లీ మోదీ ఓన్లీ షా)తో ఇక్కట్లు పడుతోంది’అని అన్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ)కి కాంగ్రెస్ అర్థం మార్చేసిందని, ఓఆర్ఓపీ అంటే వారి దృష్టిలో ’ఓన్లీ రాహుల్, ఓన్లీ ప్రియాంక’ అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యంగ్యంగా అన్నారు. 70 ఏళ్లుగా ఏ ప్రభుత్వం కూడా సైనికులను పట్టించుకోలేదని, మోదీ ప్రభుత్వం వచ్చాకనే మాజీ సైనికులకు నిజాయితీగా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ అమలు చేసిందని ఆయన తెలిపారు. ‘ దశాబ్దాలుగా అధికారంలో ఉండి మీరప్పుడు పేదరికం గురించి ఎందుకు పట్టించుకోలేదు. బీజేపీ తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలు, పథకాల ద్వారానే దేశంలో పేదరికం తగ్గుతోంది’అని షా వ్యాఖ్యానించారు. రాహుల్ జోకరేగా: ప్రియాంక గాంధీని ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ట్రంప్ కార్డుగా వ్యవహరిస్తున్నారని, మరి ఇన్నిరోజులు జోకర్‌గా రాహుల్ వ్యవహరించారా అని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సరోజ్ పాండే అన్నారు. తూర్పు ఉత్తరప్రదేశ్ కు ప్రియాంకా గాంధీని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై కాంగ్రెస్ నేత ఆజాద్ ప్రియాంకను కాంగ్రెస్ ట్రంప్ కార్డుగా వ్యవహరించిన విషయం విదితమే. -
ఆ మూడింటిది ఒకే కుటుంబం
న్యూఢిల్లీ: న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకే కుటుంబానికి చెందినవనీ, అవి మూడు ఒకదానినొకటి బలోపేతం చేసుకునేలా పనిచేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ మూడు వ్యవస్థల మధ్య ఉండే సమన్వయమే రాజ్యాంగానికి వెన్నెముకని ఆయన పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఈ మూడు వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏ ఆధికారానికైనా ఓ హద్దు ఉంటుందంటూ నాడు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ చెప్పిన మాటలను మోదీ గుర్తుచేశారు. పాలనలో న్యాయవ్యవస్థ పాత్రపై న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరగడంతో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మారిన కాలానికి అనుగుణంగా ఎలా ముందుకెళ్లాలనేదానిపై మూడు వ్యవస్థలూ లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మూడు వ్యవస్థలూ మీది తప్పంటే మీది తప్పంటూ పరస్పరం విమర్శించుకోవాల్సిన అవసరం లేదనీ, ఏదేనీ ఒక వ్యవస్థలోని లోపాలు, బలాబలాలు...మిగతా రెండు వ్యవస్థల్లోని వారికీ తెలుసని అన్నారు. జాతీయ న్యాయదినోత్సవం సందర్భంగా రెండు రోజులపాటు సుప్రీంకోర్టు, నీతి ఆయోగ్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో మోదీ ముగింపు ప్రసంగం చేశారు. పౌరులు హక్కుల కోసం పోరాడటంతోపాటు బాధ్యతలను కూడా విస్మరించరాదని హితవు పలికారు. మోదీ కన్నా ముందు కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అధికారాల విభజనపై న్యాయవ్యవస్థను ఉద్దేశించి మాట్లాడారు. ‘అధికార విభజన సిద్ధాంతానికి కార్యనిర్వాహక వ్యవస్థ ఎలా కట్టుబడి ఉంటుందో, న్యాయవ్యవస్థ కూడా అలానే ఉండాలి. చట్టాల రూపకల్పన అంశాన్ని ఎన్నికైన ప్రభుత్వాలకే వదిలేయాలి. పరిపాలన అనేది ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వమే చేయాలనీ, వారే ప్రజలకు జవాబుదారీగా ఉండాలని జాతి నిర్మాతలు స్పష్టంగా పేర్కొన్నారు. న్యాయవ్యవస్థకు స్వతంత్రత ఎంతో ముఖ్యమైనదే. కానీ న్యాయవ్యవస్థలో జవాబుదారీ తనం, నిజాయితీ కూడా ముఖ్యమైనవే. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని ప్రభుత్వం ఆమోదిస్తుంది. అయితే న్యాయమూర్తుల నియామకాలను పరిశీలించాలన్న సలహా కూడా అభినందించదగ్గదే’ అని రవిశంకర్ అన్నారు. న్యాయ గడియారాల ఏర్పాటు: మోదీ కోర్టులు కేసులను పరిష్కరిస్తున్న వేగాన్ని బట్టి వాటికి ర్యాంకులిచ్చేలా దేశంలోని వివిధ కోర్టుల పరిసరాల్లో ‘న్యాయ గడియారాల’ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని మోదీ సూచించారు. దీనివల్ల కేసులను త్వరితగతిన పరిష్కరించడంలో న్యాయమూర్తుల మధ్య పోటీ కూడా ఏర్పడుతుందనీ, తద్వారా కేసుల సంఖ్య తగ్గుతుందని మోదీ పేర్కొన్నారు. మరొకరు తలదూర్చకూడదు... రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు నిర్వహించిన మరో కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు వాటి స్వేచ్ఛ పరిధి గురించి అప్రమత్తతతో ఉండాలనీ, ఆయా వ్యవస్థల స్వతంత్రతను కాపాడుకోవడానికి అవి పాటుపడాలని అన్నారు. ఈ మూడు వ్యవస్థల మధ్య అధికారాల విభజనను గుర్తెరిగి నడచుకోవాలనీ, ఒకరి విధుల్లో మరొకరు తలదూర్చకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. రాజ్యాంగం అంటే కాగితాలు కాదనీ, ప్రాణమున్న పత్రమని కోవింద్ పేర్కొన్నారు. విధానాలను తనిఖీ చేసే అధికారం మాకుంది: సీజేఐ రవి శంకర్ ప్రసాద్ వ్యాఖ్యలపై సీజేఐ జస్టిస్ మిశ్రా స్పందిస్తూ ‘మూడు వ్యవస్థల మధ్య పరస్పర గౌరవం ఉండాలి. ఈ మూడింటిలో మాకున్న అధికారాలే గొప్పవంటూ ఏ వ్యవస్థా చెప్పుకోవడానికి లేదు. మేం ఏ విధానాలనూ తీసుకురావడం లేదు. కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను తనిఖీ చేసే, అవి అమలయ్యేలా చూసే అధికారం మాకు ఉంది. రాజ్యాంగమే పరిపాలనాధిపతి అని సుప్రీంకోర్టులో మేం విశ్వసిస్తాం. పాటిస్తాం. చట్టాలకు లోబడి ప్రభుత్వాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని సరిచూసేందుకు అవసరమైన అధికారాలిస్తూ, రాజ్యాంగానికి తుది రక్షణదారుగా న్యాయవ్యవస్థను రాజ్యాంగమే నిలిపింది’ అని మిశ్రా పేర్కొన్నారు. పాలనాపరమైన విధానాలు తీసుకురావడానికి ప్రజాహిత వ్యాజ్యాలను దుర్వినియోగం చేస్తున్నారన్న వ్యాఖ్యలను జస్టిస్ మిశ్రా తిరస్కరించారు. పౌరుల ప్రాథమిక హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. -
‘నియమ’గిరి మాట్లాడుతోంది!
సంజయ్‌కాక్ నిర్మించే డాక్యుమెంటరీలు ప్రత్యేకమైనవి. లోగడ నర్మదా వ్యాలీలో ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రజల గురించి ‘వర్డ్స్ ఆన్ వాటర్’ (2002), కాశ్మీర్ పోరాటాల నేపథ్యంతో ‘జష్న్-ఎ-ఆజాదీ’(2007) రూపొందించారు. తాజాగా ‘రెడ్ యాంట్ డ్రీమ్’ అనే డాక్యుమెంటరీని రూపొందించిన సంజయ్‌కాక్ ఇటీవల హైదరాబాద్‌లో వేర్వేరు ప్రాంతాలలో తన చిత్రాన్ని ప్రదర్శించారు. విద్యార్థులు, అధ్యాపకులు, ఫైన్ఆర్ట్ లవర్స్‌కు తన చిత్రాన్ని చూపారు. వారి స్పందనలను గ్రహించారు. మధ్యభారత్‌లో మావోయిస్టులు, తూర్పున ఒడిషాలో నియమగిరి పరిరక్షణ కోరుతున్న గిరిజనులు, పశ్చిమాన పంజాబ్ శ్రామికులు చేస్తూన్న ఉద్యమాల నేపథ్యంలో ఎవ్వరూ వెళ్లేందుకు సాహసించని ఆ అజ్ఞాత ప్రదేశాలకు వెళ్లి తమతమ ప్రపంచాలకోసం పోరాడుతున్న వారిని కలుసుకున్నారు. వారి వారి దృష్టి కోణాలతో సాధారణ ప్రజలు అంచనా వేసుకునేందుకు వీలుగా చిత్రాన్ని కళ్లకు కట్టారు. ‘రెడ్ యాంట్ డ్రీమ్’ ప్రదర్శనానంతరం ప్రేక్షకులతో సంభాషించారు. ఆ సారాంశం... ఈ డాక్యుమెంటరీ మావోయిస్టులకు మద్దతుగా తీశారా? ఈ డాక్యుమెంటరీ రూపొందించడంలో మావోయిస్టుల సహకారం ఉంది. లేకపోతే అక్కడకు వెళ్లలేను కదా. వెళ్లాక నా పని నేను చేసుకున్నాను. మావోయిస్టులు తాము రికార్డు చేసుకున్న వీడియోలనూ ఇచ్చారు. సందర్భాన్ని బట్టి కొన్ని క్లిప్పింగులు వాడాను. ఇది మావోయిస్టులను సమర్థిస్తుందా? అంటే చిత్రాన్ని చూసే ప్రేక్షకుడిని బట్టి ఉంటుంది. ఉదాహరణకు ‘జష్న్-ఎ-ఆజాదీ’ చిత్రాన్ని కాశ్మీర్ వేర్పాటువాది గిలానీ చూశారు. ‘సినిమా ఎలా ఉంది?’ అని ఒక జర్నలిస్టు ప్రశ్నించారు. ‘చాలా బాగా తీశాడు’ అని మెచ్చుకున్న గిలానీ ‘నీకెలాగుంది?’ అని అడిగారు. ‘ఒకవిధంగా చెప్పాలంటే అది మీకు చెంపపెట్టు వంటిది’ అని ఆ జర్నలిస్టు అన్నాడు! సో... డాక్యుమెంటరీ అనేది ఒక వర్క్ ఆఫ్ ఆర్ట్. చూపించినవన్నీ వాస్తవాలే. చూసినవారికి వారి వారి అవగాహనమేరకు వారున్న స్థానంలో, సమయంలో, తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ‘రెడ్ యాంట్ డ్రీమ్’ లో రెడ్ యాంట్ ఎవరు? డాక్యుమెంటరీలో ఒక సన్నివేశాన్ని గమనించి ఉంటారు. ఒక ఉద్యమకారుడు చెట్టుపైన ఉన్న ఎర్ర చీమలతుట్టెను కిందికి దించుతాడు. అత్యవసర పరిస్థితుల్లో అవి ఆహారం కూడా. ఈ ఎర్రచీమలు అతడిని చికాకు పెట్టడాన్ని గమనించి ఉంటారు. ప్రస్తుతం భారత సాయుధ ఉద్యమ వాతావరణంలో ‘చికాకు పెట్టడం’ అనే పీడకల ముగ్గురిని వెంటాడుతోంది. గిరిజనులు, వారిని వారి ప్రాంతాల నుంచి ఖాళీ చేయించేందుకు వచ్చిన ‘‘క్యాపిటల్’ను సమర్థిస్తూన్న ప్రభుత్వ బలగాలు, వీరిని ఎదుర్కొనే మావోయిస్టులు... ఈ ముగ్గురికీ మూడు కలలున్నాయి. ఒకరి కలలు మరొకరికి పీడకలలుగా పరిణమిస్తున్నాయి. ఇంతకు మించి చెపితే డాక్యుమెంటరీ రూపకర్తగా నేను విఫలం అయినట్లే. మార్మికత లేని ప్రక్రియ కళ అవుతుందా? గతంలో మీరు తీసిన డాక్యుమెంటరీలకు తాజాగా తీసిన ‘రెడ్ యాంట్ డ్రీమ్’కు తేడా ఏమైనా ఉందా? నేరేషన్, ఎడిటింగ్‌లలో మీరు ఎదుర్కొన్న సవాళ్లు? గతంలో తీసినవి ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి చెందినవి. ఆ ప్రాంతాలకు సంబంధించిన సమస్య కూడా తేలికగా అర్థమయ్యేదే. ‘రెడ్ యాంట్ డ్రీమ్’ మాత్రం బస్తర్, ఒడిషా, పంజాబ్...మూడు ప్రాంతాలకు సంబంధించినది. షూటింగ్ చేయడానికి ఎనిమిది వారాల సమయం తీసుకుంది. షూటింగ్ సంగతి ఎలా ఉన్నా...ఎడిటింగ్ టేబుల్ దగ్గర మాత్రం చాలా సమయం తీసుకుంది. (డాక్యుమెంటరీకి ఎడిటర్, సహ రచయిత తరుణ్) ఎడిటింగ్ ప్రక్రియ ఒక కొలిక్కి రావడానికి సంవత్సరం పట్టింది. దీంట్లో నెరెషన్ అనేది నేరుగా ఉండదు. ‘ఇది వీరికి సంబంధించిన కథ’ అని ప్రత్యేకంగా కొందరిని ఉద్దేశించినట్టు మాత్రమే అనిపించదు. అంతర్లీనంగా వీరి సమస్య ఒక్కటే అనే భావన ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఒక భావనను ఆవిష్కరించడానికి కొన్ని సంక్లిష్టమైన ప్రతీకలను కూడా వాడుకోవడం జరిగింది. గత డాక్యుమెంటరీలతో పోల్చితే నిజానికి ఇది కష్టమైన పనే. ఈ డాక్యుమెంటరీ నిర్మాణాత్మకమైన చర్చలకు దారి తీస్తుందని ఆశిస్తున్నాను. గోరఖ్‌పూర్, బెనారస్, ఢిల్లీ, చండీఘడ్, అమృత్సర్లలో జరిగిన చిత్రోత్సవాలలో ‘రెడ్ యాంట్ డ్రీమ్’కు మంచి స్పందన వచ్చింది. డాక్యుమెంటరీ చూస్తున్నంత సేపు నాకు, ప్రేక్షకులకు మధ్య ఒక మౌన సంభాషణ జరుగుతూనే ఉంటుంది. - పున్నా కృష్ణమూర్తి ********* ఒరిస్సాలోని నియమగిరి కొండలను స్థానిక గిరిజనులు దైవంగా భావిస్తారు. బాక్సయిట్ తవ్వకాలు కొనసాగితే కొండ కరిగిపోతుంది. మా మానాన మమ్మల్ని బతకనివ్వండి అంటున్నారు. వారు సాయుధులు కాకపోయినా విప్లవకారులే. అయితే స్థానికత ఆధారంగానే అంతర్జాతీయత ఉండాలి. - సంజయ్‌కాక్