‘నియమ’గిరి మాట్లాడుతోంది!
సంజయ్‌కాక్ నిర్మించే డాక్యుమెంటరీలు ప్రత్యేకమైనవి. లోగడ నర్మదా వ్యాలీలో ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రజల గురించి ‘వర్డ్స్ ఆన్ వాటర్’ (2002), కాశ్మీర్ పోరాటాల నేపథ్యంతో ‘జష్న్-ఎ-ఆజాదీ’(2007) రూపొందించారు. తాజాగా ‘రెడ్ యాంట్ డ్రీమ్’ అనే డాక్యుమెంటరీని రూపొందించిన సంజయ్‌కాక్ ఇటీవల హైదరాబాద్‌లో వేర్వేరు ప్రాంతాలలో తన చిత్రాన్ని ప్రదర్శించారు. విద్యార్థులు, అధ్యాపకులు, ఫైన్‌ఆర్ట్ లవర్స్‌కు తన చిత్రాన్ని చూపారు. వారి స్పందనలను గ్రహించారు. మధ్యభారత్‌లో మావోయిస్టులు, తూర్పున ఒడిషాలో నియమగిరి పరిరక్షణ కోరుతున్న గిరిజనులు, పశ్చిమాన పంజాబ్ శ్రామికులు చేస్తూన్న ఉద్యమాల నేపథ్యంలో ఎవ్వరూ వెళ్లేందుకు సాహసించని ఆ అజ్ఞాత ప్రదేశాలకు వెళ్లి తమతమ ప్రపంచాలకోసం పోరాడుతున్న వారిని కలుసుకున్నారు. వారి వారి దృష్టి కోణాలతో సాధారణ ప్రజలు అంచనా వేసుకునేందుకు వీలుగా చిత్రాన్ని కళ్లకు కట్టారు. ‘రెడ్ యాంట్ డ్రీమ్’ ప్రదర్శనానంతరం ప్రేక్షకులతో సంభాషించారు. ఆ సారాంశం...
ఈ డాక్యుమెంటరీ మావోయిస్టులకు మద్దతుగా తీశారా?
ఈ డాక్యుమెంటరీ రూపొందించడంలో మావోయిస్టుల సహకారం ఉంది. లేకపోతే అక్కడకు వెళ్లలేను కదా. వెళ్లాక నా పని నేను చేసుకున్నాను. మావోయిస్టులు తాము రికార్డు చేసుకున్న వీడియోలనూ ఇచ్చారు. సందర్భాన్ని బట్టి కొన్ని క్లిప్పింగులు వాడాను. ఇది మావోయిస్టులను సమర్థిస్తుందా? అంటే చిత్రాన్ని చూసే ప్రేక్షకుడిని బట్టి ఉంటుంది.
ఉదాహరణకు ‘జష్న్-ఎ-ఆజాదీ’ చిత్రాన్ని కాశ్మీర్ వేర్పాటువాది గిలానీ చూశారు. ‘సినిమా ఎలా ఉంది?’ అని ఒక జర్నలిస్టు ప్రశ్నించారు. ‘చాలా బాగా తీశాడు’ అని మెచ్చుకున్న గిలానీ ‘నీకెలాగుంది?’ అని అడిగారు. ‘ఒకవిధంగా చెప్పాలంటే అది మీకు చెంపపెట్టు వంటిది’ అని ఆ జర్నలిస్టు అన్నాడు! సో... డాక్యుమెంటరీ అనేది ఒక వర్క్ ఆఫ్ ఆర్ట్. చూపించినవన్నీ వాస్తవాలే. చూసినవారికి వారి వారి అవగాహనమేరకు వారున్న స్థానంలో, సమయంలో, తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఒక అభిప్రాయం ఏర్పడుతుంది.
‘రెడ్ యాంట్ డ్రీమ్’ లో రెడ్ యాంట్ ఎవరు?
డాక్యుమెంటరీలో ఒక సన్నివేశాన్ని గమనించి ఉంటారు. ఒక ఉద్యమకారుడు చెట్టుపైన ఉన్న ఎర్ర చీమలతుట్టెను కిందికి దించుతాడు. అత్యవసర పరిస్థితుల్లో అవి ఆహారం కూడా. ఈ ఎర్రచీమలు అతడిని చికాకు పెట్టడాన్ని గమనించి ఉంటారు. ప్రస్తుతం భారత సాయుధ ఉద్యమ వాతావరణంలో ‘చికాకు పెట్టడం’ అనే పీడకల ముగ్గురిని వెంటాడుతోంది. గిరిజనులు, వారిని వారి ప్రాంతాల నుంచి ఖాళీ చేయించేందుకు వచ్చిన ‘‘క్యాపిటల్’ను సమర్థిస్తూన్న ప్రభుత్వ బలగాలు, వీరిని ఎదుర్కొనే మావోయిస్టులు... ఈ ముగ్గురికీ మూడు కలలున్నాయి. ఒకరి కలలు మరొకరికి పీడకలలుగా పరిణమిస్తున్నాయి. ఇంతకు మించి చెపితే డాక్యుమెంటరీ రూపకర్తగా నేను విఫలం అయినట్లే. మార్మికత లేని ప్రక్రియ కళ అవుతుందా?
గతంలో మీరు తీసిన డాక్యుమెంటరీలకు తాజాగా తీసిన ‘రెడ్ యాంట్ డ్రీమ్’కు తేడా ఏమైనా ఉందా? నేరేషన్, ఎడిటింగ్‌లలో మీరు ఎదుర్కొన్న సవాళ్లు?
గతంలో తీసినవి ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి చెందినవి. ఆ ప్రాంతాలకు సంబంధించిన సమస్య కూడా తేలికగా అర్థమయ్యేదే. ‘రెడ్ యాంట్ డ్రీమ్’ మాత్రం బస్తర్, ఒడిషా, పంజాబ్...మూడు ప్రాంతాలకు సంబంధించినది. షూటింగ్ చేయడానికి ఎనిమిది వారాల సమయం తీసుకుంది. షూటింగ్ సంగతి ఎలా ఉన్నా...ఎడిటింగ్ టేబుల్ దగ్గర మాత్రం చాలా సమయం తీసుకుంది. (డాక్యుమెంటరీకి ఎడిటర్, సహ రచయిత తరుణ్) ఎడిటింగ్ ప్రక్రియ ఒక కొలిక్కి రావడానికి సంవత్సరం పట్టింది. దీంట్లో నెరెషన్ అనేది నేరుగా ఉండదు. ‘ఇది వీరికి సంబంధించిన కథ’ అని ప్రత్యేకంగా కొందరిని ఉద్దేశించినట్టు మాత్రమే అనిపించదు. అంతర్లీనంగా వీరి సమస్య ఒక్కటే అనే భావన ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఒక భావనను ఆవిష్కరించడానికి కొన్ని సంక్లిష్టమైన ప్రతీకలను కూడా వాడుకోవడం జరిగింది. గత డాక్యుమెంటరీలతో పోల్చితే నిజానికి ఇది కష్టమైన పనే.
ఈ డాక్యుమెంటరీ నిర్మాణాత్మకమైన చర్చలకు దారి తీస్తుందని ఆశిస్తున్నాను. గోరఖ్‌పూర్, బెనారస్, ఢిల్లీ, చండీఘడ్, అమృత్‌సర్‌లలో జరిగిన చిత్రోత్సవాలలో ‘రెడ్ యాంట్ డ్రీమ్’కు మంచి స్పందన వచ్చింది. డాక్యుమెంటరీ చూస్తున్నంత సేపు నాకు, ప్రేక్షకులకు మధ్య ఒక మౌన సంభాషణ జరుగుతూనే ఉంటుంది.
- పున్నా కృష్ణమూర్తి
*********
ఒరిస్సాలోని నియమగిరి కొండలను స్థానిక గిరిజనులు దైవంగా భావిస్తారు. బాక్సయిట్ తవ్వకాలు కొనసాగితే కొండ కరిగిపోతుంది. మా మానాన మమ్మల్ని బతకనివ్వండి అంటున్నారు. వారు సాయుధులు కాకపోయినా విప్లవకారులే. అయితే స్థానికత ఆధారంగానే అంతర్జాతీయత ఉండాలి.
- సంజయ్‌కాక్