
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ విధానంలో మార్పులు తెచ్చే బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టే రోజు కూడా ఓ ట్రిపుల్ తలాక్ కేసు వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ ముస్లిం వ్యక్తి తన భార్య ఆలస్యంగా నిద్ర లేస్తుందనే కారణంతో ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తలాక్ అని చెప్పేశాడు. దాంతో ఇప్పుడు ఆమె తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ జరుగుతుండగా ప్రస్తావించారు. ఆలస్యంగా నిద్ర లేచినందుకు కూడా విడాకులు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఈ విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాజా ట్రిపుల్ తలాక్ కేసుపై ఆయన చెప్పిన వివరాలు ఏమిటంటే..
ఖాసీం అనే వ్యక్తి ఓ ట్రక్కు డ్రైవర్. అతడు గుల్ అఫ్షాన్ అనే యువతి నాలుగేళ్ల కిందట ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. కానీ, రెండో రోజు నుంచే ఆమెను ప్రతి రోజు కొట్టడం ప్రారంభించాడు. పైగా ఆలస్యంగా నిద్ర లేస్తుందనే ఒకే కారణాన్ని చూపి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తమ నాలుగేళ్ల బంధానికి ట్రిపుల్ తలాక్‌తో స్వస్తి చెప్పాడు. దీంతో గుల్ తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేదు. పైగా ఖాసీం ఎక్కడికి వెళ్లాడో తెలియదు. తాజాగా ట్రిపుల్ తలాక్ బిల్లుపై పార్లమెంటులో చర్చ జరుగుతున్న విషయం తెలసిందే. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే తలాక్ చెప్పడం నేరం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment