![War of words between the Union minister Ravi Shankar And Kerala CM Vijayan - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/2/KOCHI-1.jpg.webp?itok=TO-bg8zQ)
కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొచ్చిలో ర్యాలీలో పాల్గొన్న ముస్లిం సంస్థల సభ్యులు
తిరువనంతపురం: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు సంబంధించి కేరళ ప్రభుత్వానికి, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది. కేరళలో సీఏఏ అమలుచేయబోమన్న రాష్ట్ర అసెంబ్లీ తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం విరుచుకుపడింది. పౌరసత్వంపై చట్టాలను రూపొందించే అధికారం కేవలం పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుందని.. కేరళసహా మరే ఇతర రాష్ట్రానికి ఉండబోదన్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ఆరోపించారు. రవిశంకర్ వ్యాఖ్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం మండిపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీలకు కూడా సొంత హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు.
ఆ హక్కులకు ప్రత్యేక రక్షణ ఉంటుందని.. వాటిని ఎవరూ ఉల్లంఘించరాదని తేల్చిచెప్పారు. రాజ్యాంగ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే తీరుగా ఉన్న పౌరసత్వ చట్టాన్ని అమలు చేసేది లేదని తీర్మానించిన తొలి రాష్ట్రం కేరళ అని అన్నారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిందేనని రవిశంకర్ అన్నారు. పార్లమెంట్ చట్టాలను అమలుచేయబోమని చెప్పే అధికారం రాష్ట్రాలకు లేదని తేల్చిచెప్పారు. కాగా.. సీఏఏ అమలు చేయబోమని కేరళ ప్రభుత్వం తీర్మానించడం పార్లమెంటరీ అధికారాల ఉల్లంఘన కిందకు వస్తుందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యకు లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment