సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే.. ఆ దాడిని టీడీపీ ప్రభుత్తం చిన్నగా చేసి చూపించే ప్రయత్నం చేసిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్షనేతపై కక్ష సాధింపు వైఖరికి ఇది నిదర్శనమన్నారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు అంశాలపై ఆయన చర్చించారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తుకు టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటంలేదన్నారు. వాస్తవాలు బయటకు వస్తే జాతకాలు తారుమారవుతాయని చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవ చేశారు. ఎన్‌ఐఏ చట్టం ప్రకారం కేసులు తమంతట తాము తీసుకునే అధికారం ఉందని తెలిపారు. టీడీపీ డ్రామా పూర్తిగా బయట పడుతుందని అందుకే రాష్ట్రాల సంబంధాలు అంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని జీవీఎల్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ఓటమి అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులో అసహనం పెరిగిందని ఎద్దేవ చేశారు. ఏపీలో కూడా టీడీపీకి రెండు సీట్లే రావడం ఖాయమని జీవిఎల్ జోస్యం చెప్పారు. మహిళా బీజేపీ నాయకురాలు పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారన్నారు.
శబరిమలలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కేరళ ప్రభుత్వం వ్యవహరిస్తోందని జీవిఎల్ నరసింహారావు మండిపడ్దారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న భక్తులపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే సీపీఎం ప్రభుత్వం భక్తులపై దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. కేరళ సీఎం పినరయి విజయన్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం భక్తులను భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శబరిమల తీర్పుపై వేసిన రివ్యూ పిటిషన్ విచారణకు రాబోతోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment