ఐటీలోని చిన్న కంపెనీలను ఆదుకోండి  | KTR Letter To Ravi Shankar Prasad Over MSME | Sakshi
Sakshi News home page

ఐటీలోని చిన్న కంపెనీలను ఆదుకోండి 

Published Fri, May 1 2020 1:03 AM | Last Updated on Fri, May 1 2020 8:01 AM

KTR Letter To Ravi Shankar Prasad Over MSME - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఈ) ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. హైదరాబాద్‌లో సుమారు 6 లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారని, కరోనా ప్రభావం వీరిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా పడిందన్నారు. ఐటీ, అనుబంధ పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు మంత్రి కేటీఆర్‌ గురువారం లేఖ రాశారు. రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులతో ఇటీవల రవిశంకర్‌ ప్రసాద్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణను భాగస్వామి చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ పలు అంశాలను కేటీఆర్‌ తన లేఖలో ప్రస్తావించారు. 

మినహాయింపులివ్వాలి.. 
ప్రస్తుత కరోనా సంక్షోభ ప్రభావం చిన్న తరహా ఐటీ కంపెనీలపై ఎక్కువగా పడే అవకాశమున్నందున పలు మినహాయింపులివ్వాలని కేటీఆర్‌ కోరారు. కేంద్రం నుంచి రావాల్సిన ఐటీ, జీఎస్టీ పన్ను రిఫండ్‌ను పరిష్కరించడం, రూ.25 లక్షల కంటే తక్కువున్న ఆదాయ పన్ను బకాయిల్లో కనీసం 50 శాతం విడుదల చేయడం వంటి అంశాలను లేఖలో ప్రస్తావించారు. జీఎస్టీ చెల్లింపు విషయంలో కంపెనీలకు సహకరించచేందుకు ఐటీ విభాగంలో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసి వివిధ శాఖలతో సమన్వయం చేయాలని కోరారు. ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు కనీసం 50 శాతం మేర వడ్డీ లేకుండా రుణ సదుపాయం కల్పించడం ద్వారా మూడు నాలుగు నెలల పాటు ఆయా సంస్థల ఉద్యోగులకు వేతనాలు చెల్లించే అవకాశం కలుగుతుందన్నారు. రుణాల చెల్లింపునకు కనీసం ఏడాది పాటు గడువు ఇవ్వాలని లేఖలో సూచించారు. 

ఆ గడువు ఏడాది పాటు పెంచాలి.. 
ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు) ప్రత్యక్ష ప్రయోజనాలు పొందేందుకు ఈ ఏడాది మార్చి 31 వరకు విధించిన గడువును ఏడాది పాటు పొడిగించాలని కేటీఆర్‌ కోరారు. ప్రస్తుతం చాలా ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్యతో పోలిస్తే కార్యాలయ విస్తీర్ణం తక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో ఒక్కో ఉద్యోగికి వంద నుంచి 125 చదరపు అడుగులు లెక్కన కార్యాలయాలు ఉండేలా కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేయాలన్నారు. ఐటీ పార్కులు, సెజ్‌లలో స్టాండర్డ్‌ హెల్త్‌ కోడ్‌ను తప్పనిసరి చేయాలని తన లేఖలో కేటీఆర్‌ సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement