సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో మళ్లీ లాక్‌డౌన్ విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈసారి మరింత కఠినంగా లాక్‌డౌన్ అమలుచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. గ్రేటర్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజువారీ వెయ్యికి సమీపిస్తుండడం, టెస్టుల పాజిటివ్ రేటు 30 శాతానికి ఎగబాకడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండుమూడు రోజుల్లో రాష్ట్ర మంత్రివర్గాన్ని సమావేశపరిచి జీహెచ్‌ఎంసీ పరిధిలో మళ్లీ 15 రోజులపాటు లాక్‌డౌన్ విధించాలనే ప్రతిపాదనలతో పాటు ఇతర ప్రత్యామ్నాయాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో నిర్ణయించారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళన చెందాల్సిన పనిలేదని, అందరికీ సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తిపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
అన్నీ క్షుణ్ణంగా పరిశీలించాకే నిర్ణయం: సీఎం కేసీఆర్
‘హైదరాబాద్ కోటి మంది నివసిస్తున్న చాలా పెద్ద నగరం. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువున్న క్రమంలో హైదరాబాద్‌లోనూ అదే పరిస్థితి ఉండటం సహజం. లాక్‌డౌన్ ఎత్తేశాక జనసంచారం పెరిగింది. దీంతో వైరస్ వ్యాప్తి జరుగుతున్నది. తమిళనాడు రాజధాని చెన్నైలో వైరస్ వ్యాప్తి నివారణకు మళ్లీ లాక్‌డౌన్ విధించారు. దేశంలో ఇతర నగరాలూ ఇదే దిశగా ఆలోచన చేస్తున్నాయి. హైదరాబాద్‌లో కూడా 15 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడం మంచిదనే ప్రతిపాదనలు వైద్యశాఖ నుంచి వస్తున్నాయి. అయితే జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్ విధించడం చాలా పెద్ద నిర్ణయం అవుతుంది. అదే జరిగితే అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. లాక్‌డౌన్ విధించాలని నిర్ణయిస్తే దాన్ని కట్టుదిట్టంగా, సంపూర్ణంగా అమలు చేయాలి.
నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు వీలుగా ఒకటి రెండు గంటలు మాత్రమే సడలింపునిచ్చి రోజంతా కర్ఫ్యూ విధించాల్సి ఉంటుంది. విమానాలు, రైళ్ల రాకపోకలను ఆపాల్సి ఉంటుంది. అందుకు వీలుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను సన్నద్ధం చేయాలి. ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి. కేబినెట్‌ను సమావేశపరచాలి. అందరి అభిప్రాయాలు తీసుకుని, అన్ని విషయాలను లోతుగా పరిశీలించి అవసరమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది. రెండు మూడు రోజుల పాటు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. అవసరమనుకుంటే మూడు నాలుగు రోజుల్లో కేబినెట్‌ను సమావేశపరిచి, జీహెచ్‌ఎంసీ పరిధిలో మళ్లీ లాక్‌డౌన్ విధించాలనే ప్రతిపాదనలతో పాటు అన్ని విషయాలను, ప్రత్యామ్నాయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటాం’అని సీఎం కేసీఆర్ చెప్పారు.
15 రోజుల లాక్‌డౌన్ విధించాలి: ఈటల
జీహెచ్‌ఎంసీ పరిధిలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి మరోసారి 15 రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలని వైద్యాధికారులు, వైద్య నిపుణులు కోరుతున్నారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ సమావేశంలో ప్రతిపాదించారు. ‘దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్నది. అదే క్రమంలో తెలంగాణలోనూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. జాతీయ సగటులో పోలిస్తే తెలంగాణలో మరణాల సంఖ్య కూడా తక్కువే. పెద్దగా భయపడాల్సిందేమీ లేదు. పాజిటివ్‌గా తేలిన వారికి అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కూడా వేలాది బెడ్లు సిద్ధం చేశాం. సీరియస్ పేషంట్లకు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. వ్యాధి లక్షణాలు లేని వారిని ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నాం’అని ఈటల వివరించారు.
ఈసారి మరింత కఠినంగా
హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిందని, దేశంలో మరెక్కడా లేనివిధంగా గత శుక్రవారం రోజువారీ టెస్టుల పాజిటివ్ రేటు (టీపీఆర్) 33 శాతానికి ఎగబాకిందని తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తూ కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ శనివారం ఓ నివేదిక సమర్పించినట్టు ఓ ఆంగ్ల పత్రికలో ఓ కథనం వచ్చింది. రోజువారీ టెస్టులు చేయించుకుంటున్న వారిలో మూడు నుంచి నాలుగో వంతు ప్రజలకు కరోనా సోకినట్టు ఫలితాలొస్తున్నాయి. కొన్ని ప్రైవేటు ల్యాబ్‌ల్లో నిర్వహించిన టెస్టుల్లోనైతే ఏకంగా 70 శాతం మందికి వైరస్ సోకినట్టు ఫలితాలొచ్చాయి. ప్రభుత్వ నిపుణులు తనిఖీలుచేసి.. ఇవి లోపభూయిష్టమని తేల్చి ఆ ఫలితాలను తోసిపుచ్చారు.
ఈ పరిణామాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభమైందని కొంతమంది వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదముందని, తక్షణమే జీహెచ్‌ఎంసీ పరిధిలో మళ్లీ లాక్‌డౌన్ విధించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదించింది. పరిస్థితుల తీవ్రత దష్ట్యా ఈసారి కఠినమైన లాక్‌డౌన్‌ను విధించాలని, 15 రోజుల పాటు ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేయాలని ప్రభుత్వం సైతం ఓ నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యసేవలు, మందుల దుకాణాలకు మాత్రమే లాక్‌డౌన్ నుంచి మినహాయింపునివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
నిత్యావసర వస్తువులు కొనుగోలుకు గత లాక్‌డౌన్ కాలంలో పగటి పూట కల్పించిన సడలింపులు ఈసారి ఉండకపోవచ్చని తెలుస్తోంది. 15 రోజులకు సరిపడా కిరాణం, ఇతర నిత్యావసరాలను కొని పెట్టుకోవాలని, కేవలం పాలు, బ్రెడ్డు, కూరగాయల కొనుగోలుకు మాత్రమే పగటి పూట కొన్ని గంటల పాటు సడలింపులివ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. వైద్యం, ఔషధాలు మినహా నగరంలోని ఇతర అన్నిరకాల పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించే అవకాశాలున్నాయి. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు లాక్‌డౌన్ విధివిధానాలను అధికారులు రూపొందించి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుంచనున్నారు. మంత్రివర్గంలో తీసుకునే తుది నిర్ణయాల మేరకు లాక్‌డౌన్ అమలు కానుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment