
ఆనంద్ రీజెన్సీ అధినేత మృతిపై సీబీఐ విచారణ!
యానాం : ఆనంద్ రీజెన్సీ గ్రూప్ సంస్థలు, ఆనంద్ సినీ సర్వీసెస్ అధినేత ఎం.రవిశంకర్ ప్రసాద్ మరణంపై చెన్నైకు చెందిన సీబీఐ అధికారుల బృందం విచారణ చేపట్టినట్లు సమాచారం. సీబీఐ అధికారులు విచారణ నిమిత్తం యానాం వచ్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది జూలై 7వ తేదీన రవిశంకర్ ప్రసాద్ స్థానిక బైపాస్ రోడ్లో ఉన్న ఆనంద్ రీజెన్సీ హోటల్కు వచ్చి, రాత్రి అక్కడ బస చేశారు.
మరుసటి రోజు వేకువజామున యానాం-ఎదుర్లంక వారధిపై గొడుగును పట్టుకుని మార్నింగ్ వాక్కు వెళ్లినట్లు టోల్గేట్లోని సీసీ కెమెరా పుటేజిలో ఉంది. అప్పుడు అదృశ్యమైన రవిశంకర్ ప్రసాద్ జూలై 13న ఐ.పోలవరం మండలం గుత్తినదీవి శివారు గోగుల్లంక సమీపంలోని రేవులో విగతజీవిగా కనిపించారు. దీనిపై ఐ.పోలవరం పోలీసు స్టేషన్లో అనుమానాస్పద మృతి కేసు నమోదు అయ్యింది. పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ఆదేశాల మేరకు చెన్నైకు చెందిన సీబీఐ అధికారులు ఈ కేసు విచారణ చేపట్టినట్లు సమాచారం. రవిశంకర్ ప్రసాద్ మరణానికి కారణాలపై విచారణ జరుపుతున్నారు.