ఐఎంజీ భూములపై సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ | telangana hc dismisses img illegal land allotment cbi enquiry petition | Sakshi
Sakshi News home page

ఐఎంజీ భూములపై సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ

Published Wed, Sep 11 2024 5:25 PM | Last Updated on Wed, Sep 11 2024 6:31 PM

telangana hc dismisses img illegal land allotment cbi enquiry petition

హైదరాబాద్‌, సాక్షి: ఐఎంజీ అకాడెమీస్‌ భారత ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఐఎంజీబీపీఎల్‌)కు భూముల అక్రమ కేటాయింపుపై విచారణకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఐఎంజీకి కేటాయించిన భూములపై సీబీఐ విచారణ జరిపించాలన్న పిటిషన్లను బుధవారం హైకోర్టు కొట్టివేసింది. అక్రమాలు జరిగినట్లు సరైన అధారాలు లేవని హైకోర్టు తేల్చింది. 2004కు ముందే ఐఎంజీకి 850 ఎకరాలు భూమి కేటాయించినట్లు తెలిపింది.

సెప్టెంబర్‌ 5వ తేదీన జరిగిన విచారణలో..  ఐఎంజీ భూముల ఆక్రమ  కేటాయింపుపై  రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సిద్ధంగా ఉన్నప్పుడు అనధికారిక ప్రతివాదులు (బిల్లీరావు, మాజీ మంత్రి పి.రాములు)కు అభ్యంతరమెందుకని హైకోర్టులో పిటిషనర్లు ప్రశ్నించారు. భూముల కేటాయింపు అక్రమమని ఇదే హైకోర్టు తేల్చిందని, అయితే ఆ అక్రమాలకు, అవినీతికి పాల్పడిన వారెవరో నిగ్గు తేల్చాల్సిన అవసరం కూడా ఉందని నొక్కి చెప్పారు. 

సీబీఐ విచారణ చేపడితే నిందితులుగా మారబోయే వారికి విచారణ వద్దు అని వాదించే హక్కు లేదని తేల్చిచెప్పారు. 12 ఏళ్ల క్రితం దాఖలైన ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో వాదనలు పూర్తి కావడంతో సీజే ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. తాజాగా  తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్లను కొట్టివేసిట్లు రిజర్వు చేసిన తీర్పును వెల్లడించింది.

‘హైదరాబాద్‌ పరిధిలో రూ.వేల కోట్ల విలువైన (ప్రస్తుత విలువ రూ.లక్ష కోట్లు) 850 ఎకరాల ప్రభుత్వ భూములను ఓ బోగస్‌ కంపెనీకి నాటి చంద్రబాబు ప్రభుత్వం కారుచౌకగా కేటాయించింది. ఆ కంపెనీకి రూ.వందల కోట్ల రాయితీలు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్‌లోని క్రీడా స్టేడియంలు కూడా అప్పగించింది. దీని వెనుక చంద్రబాబు సర్కార్‌ పెద్దలు ఉన్నారు. బోగస్‌ కంపెనీకి ఇన్ని వందల ఎకరాలు, రూ.వందల కోట్లు ఎందుకు కేటాయించారు.. దీని వెనకున్న వారెవరో తేలాలంటే సీబీఐ విచారణకు ఆదేశించాలి..’అని కోరుతూ సీనియర్‌ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్, న్యాయవాది శ్రీరంగారావు తదితరుల తరఫు న్యాయవాదులు రఘునాథ్‌రావు, గాడిపల్లి మల్లారెడ్డి 2012లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement