సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 850 ఎకరాలు.. కారుచౌక ధరకు.. అదీ హైదరాబాద్‌లో అత్యంత విలువైన ప్రాంతం గచ్చిబౌలో.. ఒక్క రోజులో చకచకా అనుమతులిచ్చేశారు. కంపెనీ ఏర్పాటైన 5 రోజులకే రూ.వేల కోట్ల విలువైన భూమి అప్పగించేశారు. ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉంటూ ‘ఐఎంజీ అకాడెమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్)’కు 850 ఎకరాలు కేటాయించేలా చంద్రబాబు సర్కారు అవగాహన ఒప్పందం(ఎంవోయూ) చేసుకుంది.
వెంటనే 400 ఎకరాలను సేల్‌డీడ్ ద్వారా ధారాదత్తం చేసేసింది. క్రీడా మౌలిక వసతుల కల్పన కోసం అంటూ 2003లో నాటి చంద్రబాబు నాయుడి సర్కారు చేసిన నిర్వాకంలో... ప్రభుత్వ పెద్దల తీరును తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. ఏకపక్షంగా అంత భూమిని అప్పగించడంలో ప్రభుత్వంలోనూ దోషులున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2006లో సేల్‌డీడ్‌ను రద్దు చేయటాన్ని కోర్టు ప్రస్తావిస్తూ... భూములను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం దీనికి కారకులైన అధికారులు, నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది.
నాడు ప్రభుత్వం భూముల కేటాయింపును రద్దు చేయటాన్ని సవాలు చేస్తూ 2006లో బిల్లీరావు వేసిన పిటిషన్, ఇతర పిటిషన్లపై గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటితో కూడిన ధర్మాసనం విచారణ జరిపిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఏ.సుదర్శన్‌రెడ్డి సుదీర్ఘ వాదనలు వినిపించారు.
5 రోజులకే 850 ఎకరాలు...
ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘ఐఎంజీ అకాడెమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్‌తో రాష్ట్ర(చంద్రబాబు) ప్రభుత్వం 2003 ఆగస్టు 9న 850 ఎకరాలు కేటాయించేలా ఎంవోయూ కుదుర్చుకుంది. విచిత్రమేంటంటే.. అంతకు కేవలం 5 రోజుల ముందే 2003, ఆగస్టు 5న కంపెనీ ఏర్పాటైంది. అలాంటి కంపెనీకి ఎలాంటి టెండర్లు, బిడ్డింగ్ లేకుండా బంజారాహిల్స్ నుంచి శిల్పారామం మార్గంలోని మాదాపూర్ పరిధిలోకి వచ్చే రూ.వేల కోట్ల విలువైన ప్రజల భూమిని చంద్రబాబు ప్రభుత్వం స్వల్ప ధరకు అప్పగించింది.
యువజన, సాంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శితోపాటు నాటి ముఖ్యమంత్రి(చంద్రబాబు)తో కలిపి 6 దశల ఐఎంజీబీ ఒప్పందానికి ఆగమేఘాల మీద ఒక్కరోజులోనే అన్ని అనుమతులు జారీ చేశారు. 2003, నవంబర్ 14న అప్పటి ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు అసెంబ్లీని గవర్నర్ రద్దు చేయడం గమనార్హం (అంటే.. అసెంబ్లీ రద్దుకు 3 నెలల ముందు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు). 2004, ఫిబ్రవరి 10న 400 ఎకరాల భూమిని ఐఎంజీబీకి అప్పగిస్తూ సేల్ డీడ్ చేశారు. అయితే ఏ అంతర్జాతీయ సంస్థతో సంబంధం లేని ఐఎంజీ భారత్‌కు రూ.వేల కోట్ల భూముల అప్పగింతపై రాష్ట్ర ప్రభుత్వం 2006లో కమిటీ నియమించింది. ఆ కమిటీ నివేదిక మేరకు ఐఎంజీ భారత్‌తో ఎంవోయూను, సేల్‌డీడ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది’ అని వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం... తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment