జూబ్లీహిల్స్‌లో చదరపు గజం రూ.1.75కి కేటాయించారా?
సాక్షి, హైదరాబాద్: ఆనంద్ సినీ సర్వీసెస్‌కు 2001లో జూబ్లీహిల్స్‌లో చదరపు గజం రూ.1.75 పైసలకు కేటాయించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆస్తులకు ట్రస్టీగా ఉండాల్సిన ప్రభుత్వం కారు చౌకగా, పప్పుబెల్లాల మాదిరిగా భూములను కేటాయించిందని అసహనం వ్యక్తం చేసింది. అయితే ఆ భూమిని ఎప్పటిలోగా వినియోగించుకోవాలన్న షరతులు విధించకపోవడాన్ని తప్పుబట్టింది. నిర్ణీత గడువులోగా వినియోగించుకోకపోతే స్వాధీనం చేసుకుంటామని షరతు విధించాల్సి ఉన్నా ఎందుకు విధించలేదని ప్రశ్నించింది.
ఇప్పుడు ఆ భూమిని వినియోగించుకోలేదనే కారణంతో స్వాధీనం చేసుకుంటామంటూ కొత్తగా షరతులు ఎలా పెడతారని నిలదీసింది. భూకేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా పాలసీ తెచ్చిందని, ఈ మేరకు పద్మాలయ, రామానాయుడు స్టూడియోలకు షరతులతో కేటాయింపులు చేశామని, ఇదే పాలసీని ఆనంద్ సినీ సర్వీసెస్‌కు వర్తింపజేస్తామన్న ప్రభుత్వ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కొత్త పాలసీని పాత భూ కేటాయింపులకు ఎలా వర్తింపజేస్తారంటూ ప్రశ్నించింది. ఈ మేరకు ఈ భూ కేటాయింపులకు సంబంధించి విధించిన షరతులను, పూర్తి వివరాలను సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది.
ఖాళీగా మూడెకరాల స్థలం..
ఆనంద్ సినీ సర్వీసెస్ సంస్థకు 2001లో జూబ్లీహిల్స్‌లో 5 ఎకరాల స్థలాన్ని చదరపు గజం రూ.1.75 పైసలకు కేటాయించింది. అయితే ఈ భూమిలో 1.7 ఎకరాలు మాత్రమే ఆనంద్ సినీ సర్వీసెస్ వినియోగించుకుందని, ఖాళీగా ఉన్న 3.31 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటూ 2014లో భూపరిపాలన ప్రధాన కమిషనర్ జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆనంద్ సినీ సర్వీసెస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి.. 3.31 ఎకరాలను ఆనంద్ సినీ సర్వీసెస్‌కు రిజిస్ట్రేషన్ చేసివ్వాలంటూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం విచారించింది.