సాక్షి, న్యూఢిల్లీ: వికేంద్రీకరణలో భాగంగా కర్నూలుకు హైకోర్టును తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర న్యాయ, ఐటీ, కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు విజ్ఞప్తి చేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు 55 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. న్యాయ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి నివేదించిన అంశాలు ఇవీ..
అభివృద్ధి వికేంద్రీకరణకు వీలుగా..
‘రాజధాని కార్యకలాపాలను మూడు ప్రాంతాలకు వికేంద్రీకరించాం. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడిషియల్ కేపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ కేపిటల్‌గా అమరావతి ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం–2020కి అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగా హైకోర్టును కర్నూలుకు తరలించడానికి కేంద్ర న్యాయ శాఖ తగిన చర్యలను తీసుకోవాలి. రాయలసీమలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ 2019 మేనిఫెస్టోలో పేర్కొంది. ఈ దృష్ట్యా ఆ మేరకు వెంటనే తరలింపునకు చర్యలు తీసుకోవాలి’ అని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
‘మండలి’ రద్దును ఆమోదించాలి
శాసన మండలి రద్దు అంశాన్ని కూడా కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్చించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను ‘మండలి’ అడ్డుకునే ప్రయత్నం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని వివరించారు. ఈ నేపథ్యంలో.. మూడింట రెండు వంతుల మెజారిటీతో శాసనసభ.. మండలిని రద్దు చేస్తూ సిఫారసు చేసిందని, కేంద్ర న్యాయ శాఖ తదుపరి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహిళలు, చిన్నారులపై నేరాలను నియంత్రించేందుకు రూపొందించిన దిశ చట్టం వెంటనే అమలులోకి వచ్చేలా కేంద్రం నుంచి తీసుకోవాల్సిన చర్యలు వేగవంతం చేయాలని కోరారు.
కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌కు వినతి పత్రం ఇస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
వీలైనంత త్వరగా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చేలా న్యాయ శాఖ తరఫున ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఈ చట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూలంకషంగా వివరించారు. అంతకు ముందు ఉదయం పార్టీ ఎంపీలు పలువురు వైఎస్ జగన్‌తో ఆయన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, పార్టీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, వైఎస్ అవినాష్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నందిగం సురేష్ ఉన్నారు. కాగా, శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఢిల్లీ పర్యటన ముగించుకుని తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు.
ప్రధాని, హోంమంత్రితో భేటీలో పలు అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి, శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, తాజా పరిస్థితుల గురించి ప్రధానికి కూలంకషంగా వివరించారు. ఆ రోజు దాదాపు గంటా నలభై నిమిషాల పాటు సాగిన సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి గురించి సమగ్రంగా చర్చించారు.
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేయాలని ప్రధానిని ఆహ్వానించారు. సవరించిన పోలవరం అంచనాలను, దిశ చట్టాన్ని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా కేంద్రం పరిధిలోనిదేనన్న ఆర్థిక సంఘం సిఫారసులను ప్రస్తావిస్తూ రాష్ట్రానికి హోదా ఇవ్వాలని కోరారు. అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళిక, శాసన మండలి రద్దు గురించి కూడా వివరించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీలో ప్రధానంగా దిశ చట్టం త్వరితగతిన అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 40 నిమిషాలపాటు సాగిన సమావేశంలో రాష్ట్రంలో పోలీస్ అకాడమి ఏర్పాటు, పోలీస్ సంస్థాగత సామర్థ్యం పెంపునకు సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment