న్యూఢిల్లీ/రాయ్‌పూర్/కోల్‌కతా/ముంబై/సిమ్లా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్) దేశవ్యాప్త అమలు ప్రతిపాదనపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. సీఏఏను జీవించి ఉండగా అమలు కానివ్వనంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతినబూనగా ఎన్పీఆర్, ఎన్నార్సీలను పేదల జేబులు గుల్లచేయడానికే ప్రభుత్వం తీసుకువచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ అనే మూడింటిని త్రిశూలంగా మార్చి బీజేపీ ప్రభుత్వం ప్రజలపై దాడికి పూనుకుందని సీపీఎం నేత బృందా కారత్ విమర్శించారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. కాగా, సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీల అమలును వ్యతిరేకంగాదేశంలోని పలు ప్రాంతాల్లో ర్యాలీలు కొనసాగాయి.
ఇవి పన్ను భారం వంటివే
‘దేశ ప్రజల హక్కులను ఎవరూ లాగేసుకోలేరు. నేను బతికి ఉన్నంత కాలం రాష్ట్రంలో సీఏఏను అమలు కానివ్వను. బెంగాల్‌లో ఎలాంటి నిర్బంధ కేంద్రాలు లేవు’ అని నైహటిలో జరిగిన ర్యాలీలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎన్పీఆర్, ఎన్నార్సీలు ప్రజలపై పన్ను భారం వంటివేనన్నారు. ‘నోట్ల రద్దు సమయంలో ప్రజల వద్ద డబ్బును బ్యాంకులు లాగేసుకున్నాయి. అదంతా మోదీకి సన్నిహితులైన 15, 20 మంది పారిశ్రామిక వేత్తల జేబుల్లోకి వెళ్లింది. తాజాగా ఎన్పీఆర్, ఎన్నార్సీలు అమలైతే పేద ప్రజలు వివిధ పత్రాల కోసం అధికారులకు లంచాల రూపంలో మరోసారి డబ్బు ముట్టజెప్పే పరిస్థితి రానుంది’ అని వ్యాఖ్యానించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సామూహిక కృషి, ఐక్యతతోనే దేశం ముందుకు వెళ్తుందన్నారు.
రాహుల్ అబద్ధాలు మానలేదు
రాహుల్ ఆరోపణలపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. ‘ఎన్పీఆర్ ధ్రువీకరణల కోసం ప్రజలు ఎవరికీ డబ్బు చెల్లించాల్సిన పనిలేదు. సర్వేలో సేకరించిన సమాచారంతో నిజమైన పేదలను గుర్తించి సంక్షేమ పథకాలను వారికే అందేలా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి కార్యక్రమం కాంగ్రెస్ హయాంలో 2010లో జరిగింది’ అని చెప్పారు. ‘కాంగ్రెస్ చీఫ్‌గా ఉండగా రాహుల్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఆ పదవి లేకున్నా ఆయన అబద్ధాలు ఆపట్లేరు. ‘ఈ ఏడాది అబద్ధాల కోరు ఎవరైనా ఉన్నారూ అంటే.. అతడు రాహుల్ గాంధీయే’ అని ఢిల్లీలో మీడియాతో అన్నారు. సీఏఏ విషయంలో కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, పౌరసత్వం కోల్పోతారంటూ ముస్లింల్లో వదంతులు రేపుతున్నాయని సిమ్లాలో హోం మంత్రి అమిత్‌షాఆరోపించారు. ‘సీఏఏలో పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు సంబంధించి ఏవైనా నిబంధనలు ఉంటే చూపించాలని రాహుల్ బాబాకు సవాల్ చేస్తున్నా’ అని అన్నారు.
ప్రతిపక్షాలవి ఓటు బ్యాంకు రాజకీయాలు
ముంబై మహా నగరం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)లపై అనుకూల, వ్యతిరేక ప్రదర్శనలకు శుక్రవారం వేదికగా మారింది. బీజేపీకి చెందిన సంవిధాన్ సమ్మాన్ మంచ్ నేతృత్వంలో చారిత్రక క్రాంతి మైదాన్‌లో చేపట్టిన ర్యాలీలో బీజేపీ నేత, మాజీ సీఎం ఫడ్నవీస్ పాల్గొని ప్రసంగించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్షాలు ఎన్నార్సీ, సీఏఏలపై వదంతులు, దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
భీమ్ ఆర్మీ ర్యాలీ అడ్డగింత
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేతులను బంధించుకుని ప్రధాని మోదీ నివాసం వైపు ర్యాలీగా తరలివస్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. జోర్‌బాగ్‌లోని దర్గా షా–ఇ–మర్దన్ నుంచి శుక్రవారం ప్రార్థనల అనంతరం చేతులను బంధించుకుని కొందరు ప్రధాని నివాసం లోక్‌కల్యాణ్ మార్గ్ వైపుగా ర్యాలీగా కదలివచ్చారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.
మాటల యుద్ధం
Published Sat, Dec 28 2019 1:22 AM | Last Updated on Sat, Dec 28 2019 4:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment