brunda karath
-
మాటల యుద్ధం
న్యూఢిల్లీ/రాయ్‌పూర్/కోల్‌కతా/ముంబై/సిమ్లా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్) దేశవ్యాప్త అమలు ప్రతిపాదనపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. సీఏఏను జీవించి ఉండగా అమలు కానివ్వనంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతినబూనగా ఎన్పీఆర్, ఎన్నార్సీలను పేదల జేబులు గుల్లచేయడానికే ప్రభుత్వం తీసుకువచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ అనే మూడింటిని త్రిశూలంగా మార్చి బీజేపీ ప్రభుత్వం ప్రజలపై దాడికి పూనుకుందని సీపీఎం నేత బృందా కారత్ విమర్శించారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. కాగా, సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీల అమలును వ్యతిరేకంగాదేశంలోని పలు ప్రాంతాల్లో ర్యాలీలు కొనసాగాయి. ఇవి పన్ను భారం వంటివే ‘దేశ ప్రజల హక్కులను ఎవరూ లాగేసుకోలేరు. నేను బతికి ఉన్నంత కాలం రాష్ట్రంలో సీఏఏను అమలు కానివ్వను. బెంగాల్లో ఎలాంటి నిర్బంధ కేంద్రాలు లేవు’ అని నైహటిలో జరిగిన ర్యాలీలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎన్పీఆర్, ఎన్నార్సీలు ప్రజలపై పన్ను భారం వంటివేనన్నారు. ‘నోట్ల రద్దు సమయంలో ప్రజల వద్ద డబ్బును బ్యాంకులు లాగేసుకున్నాయి. అదంతా మోదీకి సన్నిహితులైన 15, 20 మంది పారిశ్రామిక వేత్తల జేబుల్లోకి వెళ్లింది. తాజాగా ఎన్పీఆర్, ఎన్నార్సీలు అమలైతే పేద ప్రజలు వివిధ పత్రాల కోసం అధికారులకు లంచాల రూపంలో మరోసారి డబ్బు ముట్టజెప్పే పరిస్థితి రానుంది’ అని వ్యాఖ్యానించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సామూహిక కృషి, ఐక్యతతోనే దేశం ముందుకు వెళ్తుందన్నారు. రాహుల్ అబద్ధాలు మానలేదు రాహుల్ ఆరోపణలపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. ‘ఎన్పీఆర్ ధ్రువీకరణల కోసం ప్రజలు ఎవరికీ డబ్బు చెల్లించాల్సిన పనిలేదు. సర్వేలో సేకరించిన సమాచారంతో నిజమైన పేదలను గుర్తించి సంక్షేమ పథకాలను వారికే అందేలా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి కార్యక్రమం కాంగ్రెస్ హయాంలో 2010లో జరిగింది’ అని చెప్పారు. ‘కాంగ్రెస్ చీఫ్‌గా ఉండగా రాహుల్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఆ పదవి లేకున్నా ఆయన అబద్ధాలు ఆపట్లేరు. ‘ఈ ఏడాది అబద్ధాల కోరు ఎవరైనా ఉన్నారూ అంటే.. అతడు రాహుల్ గాంధీయే’ అని ఢిల్లీలో మీడియాతో అన్నారు. సీఏఏ విషయంలో కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, పౌరసత్వం కోల్పోతారంటూ ముస్లింల్లో వదంతులు రేపుతున్నాయని సిమ్లాలో హోం మంత్రి అమిత్‌షాఆరోపించారు. ‘సీఏఏలో పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు సంబంధించి ఏవైనా నిబంధనలు ఉంటే చూపించాలని రాహుల్ బాబాకు సవాల్ చేస్తున్నా’ అని అన్నారు. ప్రతిపక్షాలవి ఓటు బ్యాంకు రాజకీయాలు ముంబై మహా నగరం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)లపై అనుకూల, వ్యతిరేక ప్రదర్శనలకు శుక్రవారం వేదికగా మారింది. బీజేపీకి చెందిన సంవిధాన్ సమ్మాన్ మంచ్ నేతృత్వంలో చారిత్రక క్రాంతి మైదాన్‌లో చేపట్టిన ర్యాలీలో బీజేపీ నేత, మాజీ సీఎం ఫడ్నవీస్ పాల్గొని ప్రసంగించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్షాలు ఎన్నార్సీ, సీఏఏలపై వదంతులు, దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. భీమ్ ఆర్మీ ర్యాలీ అడ్డగింత భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేతులను బంధించుకుని ప్రధాని మోదీ నివాసం వైపు ర్యాలీగా తరలివస్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. జోర్‌బాగ్‌లోని దర్గా షా–ఇ–మర్దన్ నుంచి శుక్రవారం ప్రార్థనల అనంతరం చేతులను బంధించుకుని కొందరు ప్రధాని నివాసం లోక్‌కల్యాణ్ మార్గ్ వైపుగా ర్యాలీగా కదలివచ్చారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. -
ఆచితూచి మాట్లాడండి కామ్రేడ్స్!
సీపీఎం నేత బృందా కారత్ ఏపీలో ఒక సభలో మాట్లాడుతూ మోదీని ఏమాత్రం విమర్శించలేదంటూ సీఎం జగన్‌పై ఆరోపించారు. కానీ హుజూర్‌నగర్‌లో ఉపఎన్నికలతో సహా పాలకవర్గ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంపై వామపక్షాలు ప్రతి సందర్భంలోనూ వేస్తున్న తప్పటడుగులను, వామపక్షాల అనైక్యతను సరిదిద్దడంలో బృందా కారత్ తన వంతు కృషి చేస్తే బాగుంటుంది. పైగా, ఎన్నడూ లేనివిధంగా ఏపీలో గిరిజనులు, దళితులు, మైనారిటీలు, బీసీలు తదితరుల అభ్యున్నతికి వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమ చర్యల గురించి బృందా తెలుసుకుని ఉంటే బాగుండేది. సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్న శక్తులతో శ్రామిక వర్గ పార్టీలు కలిసి పనిచేయడం ఇప్పటి అవసరం. ఇటీవల సీపీఎం నేత బృందా కారత్ విశాఖ పట్నంలో అనుకుంటాను.. ఒక సభలో మాట్లాడుతూ, ‘జగన్ ఏమన్నా ఫెవికాల్తో పెదాలు అంటించుకున్నారా? మోదీని ఏమీ విమర్శించలేదు’ అన్నారు. నాకు తెలిసినంతవరకు బృందాకారత్ నిబద్ధత గల నాయకురాలు. పైగా సీపీఎం పార్టీ తరపున ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతికై ఏర్పాటు చేసుకున్న ఒక కమిటీ నేత కూడా. గిరిజనుల అభివృద్ధి కోసం గత పాలకులు ఎన్నడూ చేయని విధంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వాన ఎలా కృషి చేస్తున్నదో ఆమెకు సరైన సమాచారం లభించినట్లు లేదు. ఒక గిరిజన మహిళను ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఘనత జగన్‌కే దక్కింది. తన మంత్రివర్గంలో 60 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ గిరిజన మైనారిటీ మహిళా ప్రతినిధులకు స్థానం కల్పించారు జగన్. ఇంతవరకు ఈ విధంగా సామాజిక న్యాయాన్ని ఆచరించిన రాజకీయపార్టీ గానీ, ముఖ్యమంత్రి గానీ మరెవరైనా ఉన్నారా? అలాగే ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లా వెళ్లినప్పుడు ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ప్రత్యేకించి ఆదివాసీ గిరిజనుల కోసం వైద్య కళాశాల, విద్యాసంస్థలు, వైద్య సదుపాయం అలాగే ఆ ప్రాంతంలో ఉన్న కిడ్నీ బాధితుల కోసం ప్రత్యేక డయాలసిస్ కేంద్రాలు, రక్తశుద్ధి అవసరమైన వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేల ఆర్థిక సదుపాయం ఇవన్నీ కల్పించే కృషి ప్రస్తుత రాష్ట్ర పాలనలో నిజాయితీగా జరుగుతున్నది కదా. ఆ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను నిలిపివేసింది జగన్ ప్రభుత్వమే కదా! అమలు క్రమంలో ఏవైనా లోపాలుంటే సహజంగా ప్రజానుకూల ప్రభుత్వానికి బాధ్యతగల ప్రతిపక్షం తగు సూచనలిచ్చి, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. పైగా ప్రతి 50 ఇళ్లకు వలంటీర్లను ఏర్పాటు చేసి, ప్రజల గడపవద్దకు ప్రభుత్వాన్ని తీసుకువెళ్లి, వాళ్లలో అర్హులకు ప్రభుత్వ రేషన్ అందించడం, ఇతరత్రా రేషన్ కార్డులు, పెన్షన్ సదుపాయాలు, కులధృవీకరణ పత్రాలు, మొదలగు సమస్యలు తీర్చే వలంటీర్ వ్యవస్థకు జగన్ ఏర్పాటు చేయడం అపూర్వం కాదా! దానిని కూడా గోనెసంచులు మోసినందుకు అయిదువేల జీతం అంటూ అపహాస్యం చేయడం, ఆ గ్రామ వాలంటీర్లను అవమానించడమే కదా! చంద్రబాబు కృష్ణా జిల్లాలో ఆ గ్రామ వలంటీర్ల నియామక పత్రాలనందించే సంఖ్యను చూసి ఉండరు. వారి స్పందన గమనించారా? ఆ సభలో జగన్ ప్రసంగం విన్నారా? ఆ వలంటీర్లలో అత్యధికులు యువతీయువకులు. ఇలా మా గ్రామంలో మా ప్రజలకు జగనన్న కుటుంబంలో పెద్దకొడుకు వలే ఏర్పాటు చేయడం, ఈ వలంటీర్ వ్యవస్థ, దాని ద్వారా మాకు, మా వారికి, మా ఊరికి ప్రజాసేవ చేసే అవకాశం రావడం మా అదృష్టం అని ఆ యువతీయువకులు స్పందించడం.. ఎంత హృద్యమైన దృశ్యమో అనిపించింది. బాబుగారు ప్రతి సభను ఒక ఈవెంటుగా మార్చి, తాను ఆ ఈవెంట్ మేనేజర్‌గా వ్యవహరించడం ఎంత అహంకార ఆడంబర ప్రదర్శనగా ఉండేదో కదా. తద్భిన్నంగా ఏదో పెద్దన్న, చెల్లెళ్లు, తమ్ముళ్లు కలిసి తమ కుటుంబం కోసం ఏం చెయ్యాలి అని చర్చించుకున్నట్లు సాగింది జగన్ సభ. అందుకే బాబు ఉక్రోషం పట్టలేకపోతున్నారు. ఈ వ్యాసం మొదట్లో బృందాకారత్ జగన్‌ను విమర్శించిన ప్రస్తావన తేవడం ఎందుకంటే, ప్రస్తుతం చంద్రబాబు వ్యవహార శైలి వంటిది కమ్యూనిస్టులకు తగనిదని, తెలియజేసేందుకే! ఇటీవల సీపీఐ నేత నారాయణ కూడా గత స్పీకర్ కోడెల శివప్రసాద్ భౌతిక కాయాన్ని చూడటానికి వెళ్లి జగన్ అక్రమ వేధింపుల వల్లనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు సమక్షంలోనే అన్నారు. ఆ ప్రకటన చూసిన మిత్రుడొకరు సీపీఐ వారు చంద్రబాబుకు దగ్గరవనున్నారా? అని అడిగాడు. 2009లో చంద్రబాబుతో మహాకూటమి కట్టిన తర్వాత, ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనుభవం తర్వాత, చంద్రబాబు గారితో కమ్యూనిస్టులు ఎవరూ చేతులు కలపరనే అనుకుంటున్నానని అన్నాను. కమ్యూనిస్టు పార్టీలకు ప్రజాభ్యుదయం, పురోగామి తత్వం, లౌకిక విధానాలు వంటి శాశ్వత విలువలు ఉంటాయి. బాబు లాంటి వారికి అధికారంలోకి రావడమే ముఖ్యం కాబట్టి వారు కమ్యూనిస్టులతోనైనా ఎన్నికల్లో జతకట్టగలరు. పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేక సంస్థ అయిన ఆరెస్సెస్, బీజేపీ వంటి వారితో సైతం పొత్తుకు వెనుకాడరు. కానీ కమ్యూనిస్టులకు మాత్రం బాబులాంటి వారితో పొత్తు ధృతరాష్ట్ర కౌగిలే. ఈ సందర్భంగా జగన్ ఆచరణను కమ్యూనిస్టులు మర్చిపోకూడదు. పైగా బీజేపీ హిందూ మతతత్వ ఎజెండాను కాదని, మన రాష్ట్రంలో జగన్ పాలన సర్వ మతసమానత్వాన్ని పాటిస్తూ నడుస్తున్న విషయం వాస్తవం కాదా? దాన్ని గుర్తించకుండా, ఇంతకు ముందు బాబు పాలనలో ప్రజలు స్వర్గధామంలో ఉన్నట్లు జగన్‌పై విమర్శలు గుప్పించడం కమ్యూనిస్టులకు కూడని పని.ప్రధాని మోదీ కార్పొరేట్ సంస్థలకు అత్యధిక లాభాలు లభించే విధంగా ఆర్థిక విధానాలు అవలంభించి, మన దేశ మౌలిక ఆర్థిక పరిస్థితిని క్షీణింప చేస్తున్నారు. కానీ వైఎస్ జగన్ మాత్రం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను పెంచి వారి కొనుగోలు శక్తిని పెంచి ఆర్థిక పరిపుష్టి సాధించే దిశగా దృఢనిశ్చ యంతో పయనిస్తున్నారు. అదే రైతు భరోసా, గ్రామ స్వరాజ్ వివిధ కార్పొరేషన్ల ప్రధాన ఉద్దేశం. ఈ పాలన అందిస్తున్న ప్రత్యామ్నాయ విధానాలను సరిగా బేరీజు చేసుకోకుండా, ప్రతిపక్షపాత్ర పోషిం చడం అంటే కాళ్లల్లో కట్టె పెట్టడమేనని కమ్యూనిస్టులు భావించడం సరికాదు. ఈ సందర్భంగానే తప్పులెన్నువారు తమతప్పులెరగరు అన్నట్లు త్వరితగతిని మన ప్రజాభిమాన గ్రాఫ్ పడిపోతున్నప్పుడు తీవ్ర ఆత్మవిమర్శను నిజాయితీగా చేసుకోవాలని కమ్యూనిస్టులతో నాకున్న పేగు సంబంధంతో కోరుతున్నాను. సీపీఎం జాతీయ కార్యదర్శి ఏచూరి, హైదరాబాద్‌లో నిర్వహించిన సీపీఎం తెలంగాణ కార్యదర్సి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర ముగింపు సభలో లాల్ నీల్ నినాదం ఇచ్చారు. దాని అర్థం. వర్గపోరాట శక్తులు అలాగే సామాజిక అణచివేతకు గురవుతున్న వర్ణ(కుల) వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలు, ఇతర వెనుక బడిన కులాలతో ఐక్యపోరాటం అవసరం అని భావించాము. దానికి ఆచరణ రూపం ఇస్తూ బహుజన, వామపక్ష సంఘటన (బీఎల్ఎఫ్)పై తెలం గాణ రాష్ట్రకమిటీ తత్సంబంధిత నేతలందరితో సంప్రదించి ఒక సృజనాత్మక మార్గాన్ని చేపట్టింది. అయితే వర్ణ (కుల) వ్యవస్థ నిర్మూలనా పోరాటం అనేది వర్గపోరాటాలకు, వర్గఐక్యతకు భంగం అని భయపడి, భయపెట్టే కామ్రేడ్లు ఆ పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీల్లో మెజారిటీగా ఉన్నారు. వారు ఈ బీఎల్ఎఫ్ ప్రయత్నాన్ని తిరస్కరిస్తూ మెజారిటీకి మైనారిటీ లోబడి ఉండాలనే పార్టీ నిబంధన ఆధారంగా దాన్ని వదిలిపెట్టాలని బలవంతం చేశారు. ఫలితంగా పార్లమెంటు ఎన్నికలో బీఎల్ఎఫ్ను విడిచి సీపీఐతో కలిసి ఎన్నికలలో తెలంగాణ సీపీఎం అయిష్టంగా జతకట్టింది. ఇప్పుడు హుజూర్‌నగర్‌లో శాసనసభకు ఉపఎన్నిక వచ్చింది. పై కమిటీ కామ్రేడ్లు తెలంగాణ సీపీఎం పార్టీకి ఒంటరిగానే పోరాడమని తాఖీదు పంపారు. అక్కడ సీపీఐ టీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తోంది. గతంలో సీపీఎం నిర్మించిన బీఎల్ఎఫ్లోనే బాధ్యతలు నిర్వహించిన, మరో కమ్యూనిస్టు పార్టీ ఎంసీపీఐ (యూ), కంచ ఐలయ్య, కాకి మాధవరావు, తదితర సామాజిక న్యాయపోరాట సంస్థల నేతలు కొందరు కలిసి బీఎల్ఎఫ్ పేరుతో ఒక అభ్యర్థిని పెట్టింది. ఈ స్థితిలో సీపీఎం అభ్యర్థి నామినేషన్ సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైంది. ఇప్పుడైనా తమ అభ్యర్థి రంగంలో లేడు గనుక తామే నిర్మిం చిన బీఎల్ఎఫ్ అభ్యర్థిని బలపరచడం సీపీఎం కర్తవ్యం. తెలంగాణ సీపీఎం విషయంలో కేంద్రీకృత ప్రజాస్వామ్యం పేరిట కేంద్రీకృత నియంతృత్వాన్ని అమలు జరిపి, ఆ పార్టీ పైకమిటీ ఏం ఆదేశిస్తుందో చూడాలి. ఒకవేళ సీపీఎం, తాను బీఎల్ఎఫ్ని బలపర్చడం లేదని ప్రకటిస్తే, తెలంగాణలో ప్రత్యేకించి, దేశవ్యాప్తంగాను సీపీఎం ప్రతిష్ట దిగజారుతుంది. విస్తృత ప్రజా సమీకరణ చేయాల్సిన మౌలిక లక్ష్యానికి సీపీఎం దూరమవుతుంది. కానీ ఆ తప్పు నిర్ణయాన్ని సీపీఎం చేయదని ఆశిద్దాం. అణగారిన ప్రజల, కష్టజీవుల విస్తృత ఐక్య పోరాటమే మార్క్సిజాన్ని మన దేశ ప్రత్యేకతకు అన్వయించడం! - డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
దోపిడీ పాలకులను తరిమికొట్టాలి
చర్ల నల్గొండ: రాష్ట్రంలో, దేశంలో ప్రజానీకాన్ని దోపిడీ చేస్తున్న పాలక ప్రభుత్వాలను తరిమికొట్టాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ పిలుపునిచ్చారు. భద్రాచలంలో బీఎల్ఎఫ్ బలపర్చిన సీపీఎం అభ్యర్థి మిడియం బాబూరావు విజయాన్ని కాంక్షిస్తూ గురువారం మండలంలోని ఆర్కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. భద్రాచలం నియోజకవర్గం పోరాటాల గడ్డ అని, ఇక్కడి ఓటర్లు నిరంతరాయంగా కొనసాగిస్తున్న సంప్రదాయాన్ని ఈసారి కూడా కొనసాగించి సీపీఎంను గెలిపించాలని ఆమె కోరారు. రాష్ట్రంలో, దేశంలో పాలన సాగిస్తున్న టీఆర్ఎస్, బీజేపీలకు దళితులు, గిరిజనుల గురించి మాట్లాడే అర్హత లేకుండా చేస్తున్నాయని ఆరోపించారు. హక్కుల కోసం ఆదివాసీలు ఆత్మ గౌరవ పోరాటాలు చేపట్టి దానిని ముందుకు తీసుకుపోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగేళ్లలో ప్రజలకు చేసింది శున్యమని అన్నారు. ప్రజలపై అప్రకటిత యుద్ధం చేస్తూ వారి హక్కులకు భంగం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రం ప్రజలపై దాడులు చేస్తుంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు నోళ్లు మూసుకున్నాయని విమర్శించారు. ఇప్పుడు ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్తారని, ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. అటవీ హక్కుల చట్టం ఏర్పాటు కోసం సీపీఎం అగ్రభాగాన నిలిచి పోరాటాలు సాగించిందని గుర్తుచేశారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగులో ఉన్న భూములన్నిటికీ హక్కు పత్రాలు ఇవ్వాల్సిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. భూములను బలవంతంగా లాక్కొందని ఆరోపించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. కేరళ రాష్ట్రంలో సీపీఎం ప్రభుత్వ హయాంలో ఒక్క రైతూ ఆత్మహత్యకు పాల్పడలేదన్నారు. డిసెంబర్ 7న జరరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్, ప్రజాకూటమి, బీజేపీ అభ్యర్థులను ఓడించి సీపీఎం అభ్యర్థిని గెలించాలని కోరారు. ఈ ఎన్నిల ప్రచార సభలో అభ్యర్థి మిడియం బాబూరావు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బ్రహ్మాచారి, తాజా మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, వెంకట్, జిల్లా కమిటీ సభ్యులు యలమంచి రవికుమార్, మండల కార్యదర్శి కారం నరేష్, మురళీకృష్ణ, రాంపండు, ముత్యాలరావు, వినోద్ పాల్గొన్నారు. -
మోదీ సర్కార్ అన్నిరంగాల్లో విఫలమయ్యింది
-
‘జనసేనతో పొత్తుపై త్వరలో క్లారిటీ’
సాక్షి, విజయవాడ: దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందుతూ నూతన రికార్డులు సృష్టిస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ ఎద్దేవా చేశారు. శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. నొట్ల రద్దు కారణంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 లక్షల మంది ఉపాధి కోల్పోయారని మండిపడ్డారు. జీఎస్టీ రూపంలో ప్రజలపై విపరీతమైన పన్నుల భారం మోపారని దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలలో నరేంద్ర మోదీ ప్రభుత్వం నూతన రికార్డులు సృష్టిస్తోందని చురకలు అంటించారు. మోదీ హయాంలో దేశంలో మతతత్వ దాడులు పెరిగాయని ఆరోపించారు. భవిష్యత్తులో మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా దేశంలో సీపీఎం నూతన ప్రత్యమ్నాయంగా బలోపేతం చేస్తామని బృందాకారత్ స్పష్టం చేశారు. మోదీ, బాబులు ఇద్దరూ ఒక్కటే.. ఏపీ సీఎం చంద్రబాబు నాయడు మోదీకి వ్యతిరేకంగా ఇప్పుడు పోరాడుతున్నారని, కానీ నాలుగేళ్లు వారితోనే కలిసి పనిచేశారని విమర్శించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన మోదీ ఆర్థిక విధానాలను టీడీపీ ప్రభుత్వం సమర్థించిందని గుర్తుచేశారు. ఏపీలో జనసేనతో కలిసి టీడీపీ, బీజేపీలకు వ్యతిరేకంగా కలిసి పనిచేస్తామని తెలిపారు. జనసేనతో ఎన్నికల పొత్తుపై అక్టోబర్‌లో స్పష్టత ఇస్తామని బృందాకారత్ పేర్కొన్నారు. -
బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తాం
హైదరాబాద్: దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు కృషి చేస్తున్నామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అన్నారు. మోడీ పాలనలో దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగాయని విమర్శించారు. పేదరికం, నిరుద్యోగాన్ని నిర్మూలించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. సీపీఎం 22వ అఖిల భారత మహాసభలను పురస్కరించుకుని సోమవారం నగరంలోని అణుపురం కమ్యూనిటీ హాల్లో ‘మతోన్మాద రాజకీయాలు–సవాళ్లు’అంశంపై జరిగిన సెమినార్‌కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. దేశ భవిష్యత్ బీజేపీ ఓటమి మీదే ఆధారపడి ఉందని అన్నారు. బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని, పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై చర్చకు రాకుండా సహకరించటమే ఇందుకు నిదర్శనమన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఆదివాసులు, దళితులపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. త్రిపురలో సీపీఎం కార్యాలయాలు, కార్యకర్తలపై బీజేపీ దాడులు చేస్తోందని ఆరోపించారు. మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని, విగ్రహాలు ధ్వంసం చేస్తున్నంత మాత్రాన ఎర్ర జెండా కనుమరుగుకాదన్నారు. ప్రజలకు కష్టాలున్నంత కాలం ఎర్రజెండా వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగోడుతూ ప్రజలను విడగొట్టే విధంగా బీజేపీ పాలన సాగిస్తోందని, దీనికి వ్యతిరేకంగా లౌకికవాదులు ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. దేశంలో ఒక శాతం ఉన్న సంపన్నుల చేతిలో 65 శాతం సంపద కేంద్రీకృతం కావటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ‘భారత కమ్యూనిస్టు ఉద్యమం–సవాళ్లు’అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. -
పేదల సంక్షేమమే మా ఎ‘జెండా’
తిరుపతి కల్చరల్: పేదల సంక్షేమమే మా అజెండాగా పోరాటాలు సాగిస్తామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్ స్పష్టం చేశారు. సీపీఎం 50వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం తిరుపతిలోని రామతులసి కల్యాణ మండపం లో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. విశాఖలో జరిగే 21వ సీపీఎం మహాసభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. తమ పార్టీ ప్రజా సంక్షేమమే లక్ష్యం గా పోరుబాటలో సాగుతోందన్నారు. దేశానికి సంపూర్ణస్వాతంత్య్రం కావాలని నినదించిన ఘనత సీపీఎందే అ న్నారు. దేశంలో ప్రజలు, కార్మికులు, కర్షకులను ఐక్యం చేసి నిర్ధిష్టమైన భారతదేశానికి అనుగుణంగా సీపీఎం ఉద్యమ బాట పట్టిందన్నారు. 50ఏళ్ల పార్టీ చరిత్రలో మూడు రాష్ట్రాల్లో ఐదుగురు సీఎంలు పని చేసినా వారిపై ఎలాంటి అవినీతి మచ్చ పడలేదన్నారు. దేశ ప్రధాని పదవిని చేపట్టాలని రాజకీయ పార్టీలు కోరినా ప్రజా సంక్షేమం ముందు పదవులు ముఖ్యం కాదని ఆ పదవిని తృణప్రాయంగా విస్మరించిన ఘనత సీపీఎందే అన్నారు. పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ దేశాభివృద్దితో పాటు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఉద్యమాలు సాగిస్తున్నామన్నారు. సీపీఎం అవలంభిస్తున్న విధి విధానాలు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. చాయ్ వాలాగా బతుకు సాగించిన తనకు సామాన్యుడి బతుకేంటో తెలుసునని, నిరుపేదల సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ నేడు చిన్న టీ దుకాణాలను సైతం తొలగించే చట్టాలను తీసుకొస్తున్నారని ఆరోపించారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు ఊడిగం చేస్తూ ప్రజా సంపదనంతా అంబాని వంటి బడా వ్యాపారులకు దోచి పెడుతున్నారని విమర్శించారు. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు తీసిపోని విధంగా మోదీ పాలన సాగుతోందని తెలిపారు. పాలకులు మాయమాటలతో మోస పోతున్న ప్రజానీకానికి సీపీఎం అండగా నిలిచి రాజీలేని పోరాటాలు సాగించాలని ఆమె దిశానిర్దేశం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కె.కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర నేత కృష్ణయ్య ప్రసంగించారు. దీనికి ముందు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి బహిరంగ సభ వేదిక వరకు సీపీఎం నాయకులు, కార్యకర్తలు, కార్మికులు వేలాది మంది భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన జానపద కళాకారుల భజనలు, ఉద్యమ గీతాలు అందరిని ఆకట్టుకున్నాయి. -
ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ గెలవదు..
ఎర్రుపాలెం, న్యూస్‌లైన్: ఈ సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితులు లేవని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన యూపీఏ- 1, యూపీఏ-2 ప్రభుత్వాలను ఓడిం చాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు బృందా కారత్ పిలుపునిచ్చారు. మండలంలోని బనిగండ్లపాడులో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. 2009లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిందని, ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు. మళ్లీ వైఎస్ పాలన ప్రజలకు అందాలంటే రాష్ట్రంలో జగన్ పాలన రావాలని అన్నారు. సీపీఎం మధిర అసెంబ్లీ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్, ఖమ్మం పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. మల్లు భట్టి విక్రమార్క తన పదవీ కాలంలో కేవలం మధిర నుంచి హైదరాబాద్‌కు తిరగడమే సరిపోయిందని, పేదల బాగోగులను పట్టించుకోలేదని విమర్శించారు. మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీని ఓడించాలని, బీజేపీ నాయకుడు నరేంద్రమోడీ కేవలం మీడియాకే పరిమితమని అన్నారు. గుజరాత్ కంటే చిన్న రాష్ట్రమైన కేరళలోనూ అభివృద్ది జరిగిందని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం మధిర అసెంబ్లీ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్, వైఎస్సార్‌సీపీనాయకులు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మండల కన్వీనర్ అంకసాల శ్రీనివాసరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు లక్కిరెడ్డి నర్సిరెడ్డి, సీపీఎం నాయకులు ఎం సాయిబాబు, అఫ్రోజ్ సమీ నా, హైమావతి, శీలంనర్సింహారావు పాల్గొన్నారు. నేలకొండపల్లి మండలంలో ప్రచారం... నేలకొండపల్లి:పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పోతి నేని సుదర్శన్‌ల విజయాన్ని కాంక్షిస్తూ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు బృందాకారత్ సోమవారం నేలకొండపల్లి మండలంలో ప్రచారం నిర్వహించారు. తొలుత మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సెంటర్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా ప్రచారం నిర్వహించారు. ప్రధాన ఓటర్లను కలిసి రెండు గుర్తులను చెబుతూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం సింగారెడ్డిపాలెంలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వైఎస్సార్సీపీ నాయకులు కోటి సైదారెడ్డి, మండల అధ్యక్షులు కొర్లకుంట్ల నాగేశ్వరరావు, సీపీఎం నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, సిరకొండ నాగేశ్వరరావు, వేగినాటి లక్ష్మీనర్సయ్య, కొమ్మూరి నరేష్, మహిళ విభాగం మండల అధ్యక్షురాలు పాకనాటి సంగీత, కొచ్చెర్ల భూలక్ష్మి, కొలికపొంగు తిరపమ్మ, ఐద్వా జిల్లా నాయకురాలు బుగ్గవీటి సరళ, సిరికొండ ఉమమాహేశ్వరీ, గోళ్ల రాజమ్మ పాల్గొన్నారు.