ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ గెలవదు..
ఎర్రుపాలెం, న్యూస్‌లైన్: ఈ సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితులు లేవని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన యూపీఏ- 1, యూపీఏ-2 ప్రభుత్వాలను ఓడిం చాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు బృందా కారత్ పిలుపునిచ్చారు. మండలంలోని బనిగండ్లపాడులో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. 2009లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిందని, ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు. మళ్లీ వైఎస్ పాలన ప్రజలకు అందాలంటే రాష్ట్రంలో జగన్ పాలన రావాలని అన్నారు.
సీపీఎం మధిర అసెంబ్లీ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్, ఖమ్మం పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. మల్లు భట్టి విక్రమార్క తన పదవీ కాలంలో కేవలం మధిర నుంచి హైదరాబాద్‌కు తిరగడమే సరిపోయిందని, పేదల బాగోగులను పట్టించుకోలేదని విమర్శించారు. మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీని ఓడించాలని, బీజేపీ నాయకుడు నరేంద్రమోడీ కేవలం మీడియాకే పరిమితమని అన్నారు. గుజరాత్ కంటే చిన్న రాష్ట్రమైన కేరళలోనూ అభివృద్ది జరిగిందని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం మధిర అసెంబ్లీ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్, వైఎస్సార్‌సీపీనాయకులు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మండల కన్వీనర్ అంకసాల శ్రీనివాసరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు లక్కిరెడ్డి నర్సిరెడ్డి, సీపీఎం నాయకులు ఎం సాయిబాబు, అఫ్రోజ్ సమీ నా, హైమావతి, శీలంనర్సింహారావు పాల్గొన్నారు.
నేలకొండపల్లి మండలంలో ప్రచారం...
నేలకొండపల్లి:పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పోతి నేని సుదర్శన్‌ల విజయాన్ని కాంక్షిస్తూ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు బృందాకారత్ సోమవారం నేలకొండపల్లి మండలంలో ప్రచారం నిర్వహించారు. తొలుత మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సెంటర్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా ప్రచారం నిర్వహించారు. ప్రధాన ఓటర్లను కలిసి రెండు గుర్తులను చెబుతూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం సింగారెడ్డిపాలెంలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కోటి సైదారెడ్డి, మండల అధ్యక్షులు కొర్లకుంట్ల నాగేశ్వరరావు, సీపీఎం నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, సిరకొండ నాగేశ్వరరావు, వేగినాటి లక్ష్మీనర్సయ్య, కొమ్మూరి నరేష్, మహిళ విభాగం మండల అధ్యక్షురాలు పాకనాటి సంగీత, కొచ్చెర్ల భూలక్ష్మి, కొలికపొంగు తిరపమ్మ, ఐద్వా జిల్లా నాయకురాలు బుగ్గవీటి సరళ, సిరికొండ ఉమమాహేశ్వరీ, గోళ్ల రాజమ్మ పాల్గొన్నారు.