పేదల సంక్షేమమే మా ఎ‘జెండా’
తిరుపతి కల్చరల్: పేదల సంక్షేమమే మా అజెండాగా పోరాటాలు సాగిస్తామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్ స్పష్టం చేశారు. సీపీఎం 50వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం తిరుపతిలోని రామతులసి కల్యాణ మండపం లో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. విశాఖలో జరిగే 21వ సీపీఎం మహాసభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. తమ పార్టీ ప్రజా సంక్షేమమే లక్ష్యం గా పోరుబాటలో సాగుతోందన్నారు.
దేశానికి సంపూర్ణస్వాతంత్య్రం కావాలని నినదించిన ఘనత సీపీఎందే అ న్నారు. దేశంలో ప్రజలు, కార్మికులు, కర్షకులను ఐక్యం చేసి నిర్ధిష్టమైన భారతదేశానికి అనుగుణంగా సీపీఎం ఉద్యమ బాట పట్టిందన్నారు. 50ఏళ్ల పార్టీ చరిత్రలో మూడు రాష్ట్రాల్లో ఐదుగురు సీఎంలు పని చేసినా వారిపై ఎలాంటి అవినీతి మచ్చ పడలేదన్నారు. దేశ ప్రధాని పదవిని చేపట్టాలని రాజకీయ పార్టీలు కోరినా ప్రజా సంక్షేమం ముందు పదవులు ముఖ్యం కాదని ఆ పదవిని తృణప్రాయంగా విస్మరించిన ఘనత సీపీఎందే అన్నారు. పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ దేశాభివృద్దితో పాటు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఉద్యమాలు సాగిస్తున్నామన్నారు.
సీపీఎం అవలంభిస్తున్న విధి విధానాలు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. చాయ్ వాలాగా బతుకు సాగించిన తనకు సామాన్యుడి బతుకేంటో తెలుసునని, నిరుపేదల సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ నేడు చిన్న టీ దుకాణాలను సైతం తొలగించే చట్టాలను తీసుకొస్తున్నారని ఆరోపించారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు ఊడిగం చేస్తూ ప్రజా సంపదనంతా అంబాని వంటి బడా వ్యాపారులకు దోచి పెడుతున్నారని విమర్శించారు. నాటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌కు తీసిపోని విధంగా మోదీ పాలన సాగుతోందని తెలిపారు.
పాలకులు మాయమాటలతో మోస పోతున్న ప్రజానీకానికి సీపీఎం అండగా నిలిచి రాజీలేని పోరాటాలు సాగించాలని ఆమె దిశానిర్దేశం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కె.కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర నేత కృష్ణయ్య ప్రసంగించారు. దీనికి ముందు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి బహిరంగ సభ వేదిక వరకు సీపీఎం నాయకులు, కార్యకర్తలు, కార్మికులు వేలాది మంది భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన జానపద కళాకారుల భజనలు, ఉద్యమ గీతాలు అందరిని ఆకట్టుకున్నాయి.