హైదరాబాద్: దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు కృషి చేస్తున్నామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అన్నారు. మోడీ పాలనలో దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగాయని విమర్శించారు. పేదరికం, నిరుద్యోగాన్ని నిర్మూలించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. సీపీఎం 22వ అఖిల భారత మహాసభలను పురస్కరించుకుని సోమవారం నగరంలోని అణుపురం కమ్యూనిటీ హాల్‌లో ‘మతోన్మాద రాజకీయాలు–సవాళ్లు’అంశంపై జరిగిన సెమినార్‌కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఆమె మాట్లాడుతూ.. దేశ భవిష్యత్ బీజేపీ ఓటమి మీదే ఆధారపడి ఉందని అన్నారు. బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని, పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై చర్చకు రాకుండా సహకరించటమే ఇందుకు నిదర్శనమన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఆదివాసులు, దళితులపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. త్రిపురలో సీపీఎం కార్యాలయాలు, కార్యకర్తలపై బీజేపీ దాడులు చేస్తోందని ఆరోపించారు.
మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని, విగ్రహాలు ధ్వంసం చేస్తున్నంత మాత్రాన ఎర్ర జెండా కనుమరుగుకాదన్నారు. ప్రజలకు కష్టాలున్నంత కాలం ఎర్రజెండా వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగోడుతూ ప్రజలను విడగొట్టే విధంగా బీజేపీ పాలన సాగిస్తోందని, దీనికి వ్యతిరేకంగా లౌకికవాదులు ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. దేశంలో ఒక శాతం ఉన్న సంపన్నుల చేతిలో 65 శాతం సంపద కేంద్రీకృతం కావటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ‘భారత కమ్యూనిస్టు ఉద్యమం–సవాళ్లు’అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment