కోల్‌కతా/బశీర్‌హట్/న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో రాజకీయం వేడెక్కింది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. రాష్ట్రంలో హింసను ప్రేరేపించేందుకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేది, వ్యతిరేక గళం విన్పించేది ఒక్క తానేనని, ఈ నేపథ్యంలో తన గొంతు నొక్కాలని ఆ పార్టీ భావిస్తోందని అన్నారు. తన ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర విజయవంతం కాదని చెప్పారు.
సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బెంగాల్లో హింసను ప్రేరేపించేందుకు కేంద్రం, అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వివిధ సామాజిక మాధ్యమ వెబ్‌సైట్ల ద్వారా తప్పుడు వార్తలు వ్యాపింపజేసేందుకు కోట్లకు కోట్ల డబ్బును వ్యయం చేస్తున్నారని చెప్పారు. ఏ రాష్ట్రంలో హింస ప్రజ్వరిల్లినా, దాడులు జరిగినా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత బాధ్యత ఉంటుందో కేంద్రానికి కూడా అంతే సమాన బాధ్యత ఉంటుందని అన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాలంటూ కేంద్ర హోం శాఖ సలహా ఇవ్వడం.. అప్రజాస్వామిక, అనైతిక, రాజ్యాంగ వ్యతిరేక పద్ధతుల్లో బీజేపీ చేస్తున్న పకడ్బందీ కుట్రగా టీఎంసీ సెక్రటరీ జనరల్, బెంగాల్ మంత్రి పార్థ చటర్జీ అభివర్ణించారు. ఈ మేరకు మంత్రి అమిత్ షాకు సోమవారం లేఖ రాశారు. నిజానిజాలేమిటో పరిశీలించకుండానే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నివేదిక తీసుకోకుండానే కేంద్ర హోంశాఖ ఓ నిర్ధారణకు రావడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై తాము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని, హోం శాఖ తన సలహాను తక్షణం ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా టీఎంసీ ఆరోపణలు ఆధార రహితమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు.
బీజేపీ నిరసన ర్యాలీలు
శనివారం ఘర్షణలు జరిగిన బశీర్‌హట్ (సందేశ్‌ఖలి) ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ కార్యకర్తల హత్యను, రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితికి నిరసనగా బీజేపీ 24 పరగణాల జిల్లాల బశీర్‌హట్ సబ్ డివిజన్‌లో బ్లాక్ డేతో పాటు 12 గంటల షట్‌డౌన్ పాటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా బీజేపీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
మోదీతో గవర్నర్ భేటీ
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలకు వివరించినట్లు బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి తెలిపారు. భేటీ వివరాలు వెల్లడించలేనని ఆయన ఢిల్లీలో మీడియాతో అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంపై తన సమావేశాల్లో చర్చించలేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment