రాజశేఖర్, వీకే నరేశ్
‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’ లో ఏం జరుగుతోంది? అన్నది ఆదివారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నటుడు వీకే నరేశ్ అధ్యక్షతన కొత్త కార్యవర్గం ఏర్పడిన సంగతి తెలిసిందే. కొత్త కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు కూడా కాకముందే కార్యవర్గ సభ్యుల మధ్య అంతరాలు పెరగడంతో ఇటీవల వివాదాలు తలెత్తుతున్నాయని పలువురు భావిస్తున్నారు. ‘మా’లో అటు నరేశ్, ఇటు ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్‌ల వర్గాలు తయారయ్యాయని సమాచారం.
ఆదివారం ‘మా’ సభ్యుల మీటింగ్ ఉందంటూ ‘మా’ జనరల్ సెక్రటరీ జీవిత, రాజశేఖర్‌లు ‘మా’ సభ్యులకు, ఈసీ మెంబర్లకు మెసేజ్‌లు పంపడంపైనా వివాదం నెలకొంది. ఫిల్మ్‌చాంబర్‌లో ఆదివారం నిర్వహించిన ‘మా’ సమావేశం నరేశ్, రాజశేఖర్ వర్గాల మధ్య మాటల యుద్ధంతో వాడి వేడిగా సాగిందని టాక్. అధ్యక్షుడి స్థానంలో ఉన్న నరేశ్ ‘మా’ కి నిధుల సేకరణ కార్యక్రమాలు చేపట్టకపోగా, ‘మా’లోని 5.5కోట్ల మూల ధనం నుంచి ఖర్చు చేస్తున్నారని పలువురు సభ్యులు మండిపడ్డారని భోగట్టా.
ఇరువర్గాల వారిని ‘మా’ ట్రెజరర్ పరుచూరి గోపాలకృష్ణ సముదాయించేందుకు ప్రయత్నించినా, ఆయన మాట వినకపోవడంతో సమావేశం నుంచి బయటకు వచ్చేశారట. కాగా, కోర్టు ఆర్డర్ ప్రకారం ఇది ‘మా’ జనరల్ బాడీ మీటింగ్ కాదని కేవలం ఫ్రెండ్లీ మీటింగే అని, త్వరలో జనరల్ బాడీ మీటింగ్ ఉంటుందని జీవితా–రాజశేఖర్‌లు చెప్పారు. నటుడు, ‘మా’ ఈసీ మెంబర్ పృథ్వీ మాట్లాడుతూ– ‘‘మా’లో కొందరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలా ఫీలవుతున్నారు. కృష్ణంరాజుగారు, చిరంజీవిగారు వంటి సినీ పెద్దలు జోక్యం చేసుకుంటేనే ‘మా’ సమస్యకి పరిష్కారం అవుతుంది’’ అన్నారు. సమావేశం అనంతరం బయటికి వచ్చిన ‘మా’ సభ్యులు ఎవరికి తోచింది వారు మీడియా ముందు చెప్పడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment