మోదీ.. ఓ మురికి కాలువ! | Congress leader Adhir Ranjan insults PM Modi | Sakshi
Sakshi News home page

మోదీ.. ఓ మురికి కాలువ!

Published Tue, Jun 25 2019 3:57 AM | Last Updated on Tue, Jun 25 2019 5:22 AM

Congress leader Adhir Ranjan insults PM Modi - Sakshi

లోక్‌సభలో మాట్లాడుతున్న అధిర్‌ రంజన్‌. చిత్రంలో సోనియా గాంధీ, కాంగ్రెస్‌ సభ్యులు

న్యూఢిల్లీ: లోక్‌సభలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌ పార్టీల మధ్య సోమవారం మాటలయుద్ధం నడిచింది. కేంద్ర పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌ చంద్ర సారంగి లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ అత్యంత అరుదైన రాజకీయ నేత అని, స్వామి వివేకానందుడి వంటివారని కితాబిచ్చారు. దీన్ని పలువురు కాంగ్రెస్‌ ఎంపీలు తప్పుపట్టారు. ఈ సందర్భంగా సహనం కోల్పోయిన కాంగ్రెస్‌ పక్షనేత అధిర్‌ రంజన్‌ చౌదరీ ప్రధాని మోదీని ‘మురికి కాలువ’గా అభివర్ణించారు.

తుకడే తుకడే గ్యాంగ్‌లను సహించబోం..
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి సారంగి లోక్‌సభలో మాట్లాడుతూ.. ‘నాటి యూపీఏ సర్కారు ప్రభుత్వ వైఫల్యానికి పర్యాయపదంగా మారింది. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీకి ఎంతలా సాగిలపడిపోయిందంటే ప్రధానిని కూడా యాక్సిడెంటల్‌ అని పిలిచేవారు’ అని మాజీ ప్రధాని మన్మోహన్‌ను ప్రస్తావించారు. ‘ఎవరైతే వందేమాతరం గేయాన్ని ఆలపించరో, వారికి భారత్‌లో ఉండే హక్కు ఉందా? దేశాన్ని ముక్కలుముక్కలుగా విభజించాలనుకునే తుకడే– తుకడే గ్యాంగ్‌లను సహించబోం. ప్రధాని మోదీని దూషించడం అంటే హిమాలయాలను తలతో ఢీకొట్టడమే. కొందరు ప్రతిపక్ష నేతలు పాకిస్తాన్‌లోని బాలాకోట్‌ ఉగ్రస్థావరాలపై చేసిన దాడులకు సాక్ష్యాలను అడుగుతున్నారు. ‘నీ తండ్రి ఇతనే’ అని తల్లి చెబితే అందుకు ఎవరైనా సాక్ష్యాలు చూపించమని అడుగుతారా?’ అని వ్యాఖ్యానించారు.  

ఇందిర ఎక్కడ.. మోదీ ఎక్కడ?: కాంగ్రెస్‌
మోదీ భజనలో తరించిన సారంగి అన్ని హద్దులు దాటేశారని కాంగ్రెస్‌ లోక్‌సభ పక్షనేత అధిర్‌ రంజన్‌  ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘బీజేపీ ప్రభుత్వం ‘పొలిటికల్‌ ప్లాగరిజం సిండ్రోమ్‌’ అనే వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి ఉన్నవాళ్లు గత ప్రభుత్వం ఏమీ చేయలేదనీ, అన్నీ తామే చేశామని భ్రమపడుతుంటారు. హరిత విప్లవం(వ్యవసాయం), శ్వేత విప్లవం(పాల దిగుబడి పెంపు), టెక్నాలజీ విప్లవం కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయి. ఓఎన్‌జీసీ, ఐవోసీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ, హాల్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు మా హయాంలోనే ఏర్పడ్డాయి. చివరికి బీజేపీ ప్రభుత్వం పాక్‌పై ప్రయోగించిన క్షిపణులు కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడే తయారయ్యాయి. మన ప్రధాని పెద్ద సేల్స్‌మ్యాన్‌. మేం మా ఉత్పత్తులను సరిగ్గా మార్కెట్‌ చేసుకోలేకపోయాం.

అందుకే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయాం’’ అని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీ జోక్యం చేసుకుంటూ..‘మేం ఇందిరానే ఇండియా.. ఇండియానే ఇందిర’ అనేంతగా దిగజారిపోలేదు అని విమర్శించారు. దీంతో సహనం కోల్పోయిన రంజన్‌ చౌదరి ‘గంగామాత ఎక్కడ? మురికికాలువ ఎక్కడ?’ అని వ్యాఖ్యానించి సభలో ఒక్కసారిగా దుమారం రేపారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా ఖండించారు. 125 కోట్ల మంది ప్రజలెన్నుకున్న ప్రధానిని కాంగ్రెస్‌ అవమానించిందనీ, ఈ అహంకారమే ఆ పార్టీని అంతం చేస్తుందని హెచ్చరించారు. దీంతో చివరికి అధిర్‌ స్పందిస్తూ..‘నాకు హిందీ మరీ అంత బాగా రాదు. భారీ గంగానది ఎక్కడ? మామూలు కాలువ ఎక్కడ?’ అని మాత్రమే నేను చెప్పబోయా. ఒకవేళ నా మాటలకు ప్రధాని నొచ్చు కుని ఉంటే క్షమాపణలు కోరుతున్నా’ అని వివరణ ఇచ్చారు.

నవభారతాన్ని మీరే తీసుకోండి
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం సందర్భంగా కాంగ్రెస్‌ పక్షనేత గులాంనబీ ఆజాద్‌ కేంద్ర ప్రభుత్వంపై సునిశిత విమర్శలు చేశారు. నవభారతంలో మనుషులు అడవిని చూసి కాకుండా తోటి మనుషుల్ని చూసి భయపడుతున్నారనీ, గాంధీజీ హంతకులను బీజేపీ ఎంపీ ప్రశంసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మోదీ నవభారతంలో చిన్నారులపై అత్యాచారాలు ఆమాంతం పెరిగాయి. నిరుద్యోగం ఆల్‌టైం గరిష్టానికి చేరింది. కాబట్టి మీ నవభారతాన్ని(బీజేపీ ఎన్నికల నినాదం) మీరే ఉంచుకోండి. ప్రేమ, ఆప్యాయతలకు నిలయమైన మా ఇండియాను మాకు తిరిగిచ్చేయండి’ అని వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement