మంగళవారం లోక్‌సభలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: గాంధీ–నెహ్రూ కుటుంబసభ్యులు మినహా మరెవరినీ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. దేశం కోసం పనిచేసిన ఇతర నేతలకు కనీసం గుర్తింపు కూడా ఆ నేతలు ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ముగింపు సందర్భంగా మంగళవారం ప్రధాని లోక్‌సభలో సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన.. ‘దేశంలో అత్యవసర పరిస్థితి విధించి దేశం ఆత్మను చంపేసింది. ముస్లిం మహిళలకు సాధికారిత కల్పించేందుకు వచ్చిన అవకాశాలను జార విడిచింది’అంటూ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధి చెందిన, బలమైన దేశంగా ఎదిగేందుకు పార్టీలకతీతంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రప తి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.
వారు మాత్రమేనా?
రెండోసారి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ప్రధాని లోక్‌సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన.. తమ నేతల సేవలను గుర్తించడం లేదంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై స్పందించారు. ‘జాతి నిర్మాణానికి కృషి చేసిన కొద్దిమంది పేర్లను మాత్రమే కొందరు నేతలు ప్రస్తావిస్తున్నారు. ఇతరులను మరుగుపరచడమే వారి ఉద్దేశం. మేం అలా కాదు, దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామిగా ఉన్నారనే భావిస్తాం. వారు ఎన్నడైనా పీవీ నరసింహారావు చేపట్టిన మంచి కార్యక్రమాల గురించి లోక్‌సభలో ప్రస్తావించారా? మన్మోహన్ సింగ్ జీ ఘనతపై మాట్లాడారా?’ అని ప్రశ్నించారు. వాజపేయి అందించిన సేవలను యూపీఏ ప్రభుత్వం గుర్తించలేదన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వంటి నేతలను భారతరత్న పురస్కారంతో తాము గౌరవించామన్నారు.
మీరు పైకి ఎదిగితేనే మాకు సంతోషం
విమర్శలతో తమ పార్టీ స్థాయిని మోదీ ఏమాత్రం దిగజార్చలేరని అనంతరం కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ తిప్పికొట్టారు. దీనికి ప్రధాని స్పందిస్తూ..‘ఉన్నత స్థాయిలో ఉన్నట్లుగా మీరు ఎంతగా భావిస్తే కింద ఉన్నవారు అక్కడ తక్కువగా, అసహ్యంగా మీకు కనిపిస్తారు. మాకు అంత ఎత్తుకు ఎదగాలని లేదు. ప్రజలతో నేలపై ఉండటంలోనే మాకు ఆనందం’ అని అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ నేతలను జైలుకు పంపకుంటే నాకు శాపం తగులుతుంది. వారు కనీసం బెయిల్‌పైన బయట ఉన్నందుకు సంతోషపడండి’ అని సోనియా గాంధీ, రాహుల్ గా>ంధీలను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు.‘జైలులో ఫలానా ‘ఎ’ఎందుకు లేరు, ‘బి’ ఎందుకు లేరు అంటూ అడిగేవారికి నా సమాధానం ఒక్కటే. జైలుకు ఎవరిని పంపాలి, బెయిల్ ఎవరికి ఇవ్వాలనేది కోర్టులే చూసుకుంటాయి. ప్రజలను యథేచ్ఛగా అరెస్టులు చేయించిన ఎమర్జెన్సీ విధించిన నాటి ప్రభుత్వం కాదు మాది’ అని ప్రధాని అన్నారు.
అభివృద్ధిని విస్మరించబోం
‘అభివృద్ధే మా ఎజెండా. దీనిని మేం విస్మరించబోం. ఆధునిక మౌలిక వసతులు, ప్రజా సంక్షేమం ద్వారానే ప్రతి పౌరుడి సాధికారిత సాధ్యం. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాన్ని మరింత ముందుకు తీసుకెళతాం. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా దేశాన్ని మార్చడానికి కలిసి కృషిచేద్దాం’ అన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక తాము తీసుకున్న చర్యలు రైతులు, వ్యాపారులు, యువతతోపాటు ఇతర వర్గాల వారికి ఎంతో ప్రయోజనం కలిగిస్తాయన్నారు. ‘సోషలిస్ట్ నేత రాం మనోహర్ లోహియా చెప్పినట్లుగా దేశంలోని పేదలకు ముఖ్యంగా మహిళలకు (పానీ ఔర్ పాయిఖానా) నీరు, మరుగుదొడ్లు సమకూర్చడం మా లక్ష్యం’ అని అన్నారు. పేదల సంక్షేమం, ఆధునిక మౌలిక సదుపాయాలు కలిగిన సమ్మిళిత భారతం కోసం విభేదాలు మరిచి కలిసి పనిచేద్దామన్నారు.
ఇది ఎమర్జెన్సీ ప్రకటించిన రోజు
కాంగ్రెస్ హయాంలో 1975 జూన్ 25వ తేదీన విధించిన ఎమర్జెన్సీ దేశ ప్రజాస్వామ్యంపై మాయని మచ్చ అని ప్రధాని అన్నారు. ‘పత్రికల గొంతులు నొక్కి, న్యాయ వ్యవస్థను అగౌరవపరిచిన ఎమర్జెన్సీకి నేటితో 44 ఏళ్లు. అప్పటి చీకటి రోజులను మర్చిపోలేం. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి దేశం ఆత్మను చంపేసింది’ అని అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
ముస్లింలను ఎదగనివ్వలేదు
ముస్లిం మహిళలకు సాధికారిత కల్పించేందుకు వచ్చిన ఎన్నో అవకాశాలను కాంగ్రెస్ జార విడిచింది. ‘ముస్లింలను ఎదగనివ్వడం మా పార్టీ బాధ్యత కాదు. వారు బురదలోనే ఉండాలనుకుంటే అలాగే ఉండనివ్వండి’ అంటూ అప్పటి నేతలు అనేవారని రాజీవ్ గాంధీ హయాంలో మంత్రిగా పనిచేసిన మంత్రి ఒకరు ఇటీవల తనకు చెప్పారని మోదీ తెలిపారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సదరు నేత వ్యాఖ్యల వీడియోను యూట్యూబ్‌లో ఉంచుతామని మోదీ అన్నారు. ముస్లిం మహిళల అభివృద్ధి కోసం వచ్చిన మరో అవకాశాన్ని వదలకండంటూ త్వరలో ప్రవేశపెట్టబోయే ట్రిపుల్ తలాక్ బిల్లునుద్దేశించి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment