విపక్షాల ఐక్యతకు రాహుల్ విఘాతం
పార్లమెంట్‌లో తాను మాట్లాడితే భూకంపం వస్తుందని..
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో తాను మాట్లాడితే భూకంపం వస్తుందని, ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత అవినీతికి సంబంధించిన సంచలన సమాచారం తన వద్ద ఉందని, అందుకే తనను పార్లమెంట్‌లో మాట్లాడనివ్వకుండా పాలకపక్షం అడ్డుకుంటోందంటూ అదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ చివరి రోజు కూడా ఆ సంచలన సమాచారం ఏమిటో బయట పెట్టలేకపోయారు. పైగా పెద్ద నోట్ల రద్దుపై కాంగ్రెస్‌తో గొంతు కలిపిన ప్రతిపక్షాలకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. తద్వారా ప్రతిపక్షాల ఐక్యతను దారుణంగా దెబ్బతీశారు.
పెద్ద నోట్ల రద్దుపై దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దష్టికి మరోసారి తీసుకెళ్లేందుకు పార్లమెంట్ భవనంలోని గాంధీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్‌కు శుక్రవారం ఉదయం ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్‌తో కలసి ర్యాలీ నిర్వహించేందుకు తణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, జనతాదళ్ (యు) పార్టీలతోపాటు వామపక్షాలు, జాతీయవాద కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. పార్లమెంట్‌లో చూపిన విపక్షాల ఐక్యతను బయట కూడా చూపించాలనే ఉద్దేశంతోనే ఇందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి.
సరిగ్గా ఇలాంటి సమయంలో రాహుల్ గాంధీ ర్యాలీకన్నా ముందుగానే కొంత మంది పార్టీ సీనియర్ నాయకులను తీసుకొని వెళ్లి ప్రధాని మోదీని కలుసుకున్నారు. దీంతో కోపం వచ్చిన వామపక్షాలు, ఎస్పీ, బీఎస్పీ, ఎన్‌సీపీ పార్టీలు చివరి నిమిషంలో ర్యాలీ నుంచి తప్పుకున్నాయి. దీంతో మిగతా పార్టీల నాయకులనే కాంగ్రెస్ పార్టీ తన వెంట రాష్ట్రపతి భవన్‌కు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇటీవలి తన ఉత్తరప్రదేశ్ పర్యటన సందర్భంగా తన దష్టికి వచ్చిన రైతుల సమస్యలను చర్చించేందుకే మోదీని కలుసుకున్నానంటూ తర్వాత రాహుల్ ఇచ్చిన వివరణతో ర్యాలీ నుంచి తప్పుకున్న పార్టీలు సంతప్తి చెందడం లేదు. తమను తీసుకెళితే మాత్రం యూపీ రైతుల సమస్యలకు మద్దతు ఇవ్వకపోదుమా! అంటూ బీఎస్పీ వర్గాలు రాహుల్ వైఖరిని విమర్శిస్తున్నాయి.
మోదీ వ్యక్తిగత అవినీతికి సంబంధించిన సమాచారం తన వద్ద ఉందంటూ రాహుల్ గాంధీ ఊదరగొట్టడాన్ని పాలకపక్ష బీజేపీ, ఈ ఏడాదిలో ఇదే పెద్ద జోకంటూ కొట్టిపారేయగా, కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందింది. ‘రాహుల్ వద్ద నిజంగా మోదీకి సంబంధించిన సమాచారం ఉందా? ఉంటే అది తీవ్రమైనదేనా? దానికి సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయా? అంతటి తీవ్రమైన సమాచారం అయినప్పుడు పార్టీలోని సీనియర్ నాయకులతోని ఎందుకు సంప్రదించలేదు? చివరకు తుస్సుమనే సమాచారమేనా? అలాగైతే, ఇప్పటికి అంతంత మాత్రం వ్యక్తిగత ప్రతిష్ట కలిగిన రాహుల్ గాంధీకి ఉన్న ప్రతిష్ట ఊడిపోయే ప్రమాదం ఉంది’ అన్నది కాంగ్రెస్ సీనియర్ నేతల ఆందోళన. ఒకప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని కుదిపేసిన ‘2జీ స్కామ్’ కన్నా పెద్దదయితేనే రాహుల్ ఆరోపణలకు విలువుంటుంది. లేకపోతే కాంగ్రెస్ సీనియర్ నేతల ఆందోళనే నిజమవుతుంది.