న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం మధ్యాహ్నం ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయన వీల్‌చైర్‌లో ఆసుపత్రి నుంచి బయటకు వస్తూ మీడియాతో మాట్లాడారు. తనను బలవంతంగా డిశ్చార్చ్ చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనకు అందిస్తున్న చికిత్స ఇంకా పూర్తి కాలేదని, బలవంతంగా పంపిస్తున్నారని అన్నారు. ’ఇది అన్యాయం. నా ఆరోగ్యం క్షీణింప చేసేందుకు జరుగుతున్న కుట్ర. నేను ఇంకా కోలుకోలేదు.
ఎలాంటి సౌకర్యాలు లేని చోటకు నన్ను తరలిస్తున్నారు. అయినా దీన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను’ అని ఆయన వ్యాఖ్యానించారు. లాలూ డిశ్చార్చ్ సందర్భంగా పెద్దఎత్తున ఆర్జేడీ అభిమానులు ఎయిమ్స్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అక్కడి సెక్యూరిటీ గార్డ్‌కు గాయాలయ్యాయి. లాలూను చంపేందుకు కుట్ర చేస్తున్నారని.. ఆయన ఆరోగ్యం కుదుటపడకుండానే పంపేస్తున్నారని ఆర్జేడీ ఎంపీ జయప్రకాశ్ నారాయణ యాదవ్ ఆరోపించారు.
మరోవైపు లాలూ ఆరోగ్యం మెరుగుపడిందని, అందుకే ఆయనను రాంచీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నామని ఎయిమ్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయన డిశ్చార్చ్ వెనుక కుట్ర, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలను ఎయిమ్స్ వైద్యులు ఖండించారు. డిశ్చార్జి సందర్భంగా ఎయిమ్స్ డైరెక్టర్‌కు లాలూ లేఖ రాశారు. ‘నాకు ఏదైనా జరిగితే ఎయిమ్స్ బృందం బాధ్యత వహించా ల్సి ఉంటుంది’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
రాహుల్ పరామర్శ: అంతకుముందు ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న లాలూ ప్రసాద్ యాదవ్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించి.. కాసేపు మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
ఢిల్లీ ఎయిమ్స్‌లో లాలూతో రాహుల్
Comments
Please login to add a commentAdd a comment