సాక్షి,హైదరాబాద్: మేనిఫెస్టోల పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని, తర్వాత వాటిని విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైరయ్యారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి శుక్రవారం(ఏప్రిల్ 5) ఒక బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ మోసాలు ఇప్పటికే అనేకసార్లు అనుభవపూర్వకంగా రుజువైనందున, మళ్లీ మేనిఫెస్టోల పేరుతో ప్రజలను మోసం చేయవద్దని సూచిస్తున్నామని లేఖలో తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని, వారికే ఎంపీ టికెట్ కూడా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మారిన వెంటనే పదవి పోయేలా చట్టం తీసుకొస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం హాస్యాస్పదమని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి అరచేతిలో స్వర్గం చూపిస్తూ హామీలివ్వడం తర్వాత చేతులు ఎత్తేయడం మీకు అలవాటేనని లేఖలో హరీశ్‌రావు చురకంటించారు.
‘కాంగ్రెస్ మోసం చరిత్రలో ఎన్నోసార్లు రుజువయింది. మీ నాయకత్వంలోనే 2004, 2009 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. రెండు సందర్భాల్లోనూ అటు కేంద్రంలో ఇటు ఆంధ్రప్రదేశ్‌లో మీరే అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన అన్ని హామీలన్నింటిని విస్మరించారు. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడానికి మళ్లీ మీరు తెలంగాణలో పర్యటిస్తున్నారు.
అసలు మీ మేనిఫెస్టోలకు ఏమైనా విలువ ఉన్నదా ? ఒక్కదానినైనా అమలు చేశారా ? అలాంటి వారికి మేనిఫెస్టోలు ఎందుకు? ఈసారి మీ మేనిఫెస్టోలో చెప్పిన మాటలకు చేతలకు ఏమాత్రం పొంతనలేదని విషయం ఇప్పటికే రుజువైంది. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఇచ్చిన హామీలు అమలు చేయాలని మీరు చెప్పలేదు. హామీలు ప్రకటించడమే తప్ప వాటిని అమలు చేసే విషయంలో ఏమాత్రం శ్రద్ధ లేని మీకు, మళ్ళీ కొత్త హామీలను ఇచ్చే నైతిక హక్కు లేదు. తెలంగాణ ప్రజలను మళ్లీమళ్లీ మోసం చేయాలనుకునే మీ ఎత్తుగడలు ఇక ముందు సాగబోవు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా’ అని లేఖలో హరీశ్‌రావు తెలిపారు.
ఇదీ చదవండి.. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
Comments
Please login to add a commentAdd a comment