
న్యూఢిల్లీ: పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రాహుల్‌గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి తొలిసారి అధ్యక్షత వహించనున్నారు. దీంతో నూతన సారథికి సీడబ్ల్యూసీ ఘన స్వాగతం పలకనుంది. ఈ భేటీ శుక్రవారం ఉదయం పదిన్నరకు ప్రారంభమవుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ తెలిపారు. కాగా ఈ సమావేశ అజెండా అధికారికంగా వెల్లడి కానప్పటికీ దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఇందులో చర్చించ నున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కనబరిచిన ప్రభావవంతమైన పనితీరును పార్టీకి భవిష్యత్‌లో ఎలా అన్వయించాలో యోచించనున్నట్లు తెలిపారు.
2జీ కేసులో నిందితులందరూ నిర్దోషులన్న కోర్టు తీర్పుపైనా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, నరేంద్ర మోదీ ఈ కేసును ప్రచారాస్త్రంగా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో అవినీతి జరగలేదన్న అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ఈ మేరకు ప్రణాళిక రూపొందించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వివరించాయి. గతంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గైర్హాజరీలో పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ సీడబ్ల్యూసీ సమావేశానికి అధ్యక్షత వహించినప్పటికీ పూర్తి స్థాయి అధ్యక్షుడిగా మాత్రం ఇదే తొలి భేటీ కావడం గమనార్హం. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ డిసెంబర్ 11న ఏకగ్రీవంగా ఎన్నిక కాగా 16న బాధ్యతలు చేపట్టారు.