
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన బస్సుయాత్ర రెండోరోజు పెద్దపల్లిలో కొనసాగనుంది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు విజయరమణారావుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. రాహుల్‌గాంధీ పాల్గొనే కార్యక్రమాలకు జాతీయ, రాష్ట్ర నాయకత్వం తరలిరానున్న నేపథ్యంలో భద్రతను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
మంథని–కరీంనగర్ పర్యటన ఇలా..
రాహుల్‌గాంధీ గురువారం ఉదయం భూపాలపల్లి జిల్లాలో పర్యటన ముగించుకొని బస్సులో పెద్దపల్లి జిల్లా మంథనిలో ప్రవేశించనున్నారు. అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలి కేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంథనిలో రోడ్ షో లో పాల్గొన్న అనంతరం రామగిరి మండలం సెంటినరీకాలనీలో మధ్యాహ్నం రాష్ట్ర నాయకులతో కలిసి భోజనం చేస్తారు.
తర్వాత సింగరేణి కార్మికులు, రైతులతో సమావేశమవుతారు. వారితో మాట్లాడాక బస్సులో కమాన్‌పూర్ చౌరస్తాకు చేరుకొని, రోడ్ షోలో పాల్గొంటారు. సబ్బితం నుంచి బైక్ ర్యాలీ ద్వారా పెద్దపల్లి బహిరంగ సభకు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. భారీ బహిరంగ సభ అనంతరం రాత్రి 7 గంటలకు కరీంనగర్ చేరుకొని, 10 గంటల వరకు పాదయాత్ర చేయనున్నారు.
40 వేల మందితో భారీ బహిరంగ సభ..
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల కు చెందిన సుమారు 40 వేల మంది పాల్గొననున్నా రు. సభా ప్రాంగణంలో భద్రత ఏర్పాట్లను రాహుల్‌గాంధీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఉన్నతాధికారులు, పెద్దపల్లి పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. మాజీ ఎమ్మె ల్యే విజయరమణారావు సభాస్థలిని పరిశీలించారు. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడి జిల్లాపై ఫోకస్..
అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం ఉమ్మడి కరీంనగర్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఏడుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఉమ్మడి జిల్లాలో బస్సు యాత్ర చేపడుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మొత్తం 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా అధిష్ఠానం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
సిటీలో రాహుల్ యాత్ర ఇలా..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గురువారం కరీంనగర్‌లో పర్యటించనున్నారు. మొగ్దుంపూర్ వద్ద నేతలు స్వాగతం పలుకుతారు. నగరంలోని మారుతీనగర్ చౌరస్తా నుంచి రాత్రి ఏడు గంటలకు పాదయాత్రగా నాకా చౌరస్తా మీదుగా అశోక్‌నగర్ నుంచి రాజీవ్‌చౌక్ చేరుకుంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ.వేణుగోపాల్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రోహిత్‌చౌదరి, క్రిస్టోఫర్‌తిలక్, జీవన్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి యాత్రలో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment