మళ్లీ మోదీయే బాద్‌షా! | 2018 C-Voter survey poll shows Modi bests Rahul in PM showdown, BJP repeats 2014 success | Sakshi
Sakshi News home page

మళ్లీ మోదీయే బాద్‌షా!

Published Fri, Jan 19 2018 1:09 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

2018 C-Voter survey poll shows Modi bests Rahul in PM showdown, BJP repeats 2014 success - Sakshi

న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగితే మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని రిపబ్లిక్‌ టీవీ, సీ–వోటర్‌ సర్వే పేర్కొంది. మొత్తం 543 స్థానాల్లో 335 సీట్లను ఈ కూటమి చేజిక్కించుకుంటుందని వెల్లడించింది. అటు కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యూపీఏ 89 చోట్ల విజయం సాధిస్తుందని సర్వే అభిప్రాయపడింది. ఇటు, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమికి, అధికార టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనీ సర్వే తెలిపింది.

రాజకీయ వాతావరణం ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా మారుతోందని పేర్కొంది. ఏపీలోని 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 13 చోట్ల విజయం సాధిస్తుందని.. టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీయే 12 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. గతంలో కంటే వైఎస్సార్‌సీపీ అదనంగా ఐదు స్థానాలు గెలుచుకోనుందని పేర్కొంది. ఇటు తెలంగాణ (17 స్థానాలు)లో టీఆర్‌ఎస్‌ 11 స్థానాల్లో, బీజేపీ 3, కాంగ్రెస్‌ రెండు చోట్ల, ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధిస్తాయని వెల్లడించింది.  

తమిళనాట రజనీమాట... అమ్మలేని లోటు స్పష్టంగా కనబడుతున్న తమిళనాడు రాజకీయాలను ఇకపై రజనీకాంత్‌ శాసిస్తారని సర్వే అభిప్రాయపడింది. ఈ రాష్ట్రంలోని 39 ఎంపీ స్థానాల్లో రజనీకాంత్‌ పార్టీకి 23 సీట్లు వస్తాయని పేర్కొంది. ద్రవిడ రాజకీయాలను కాదని అన్నాడీఎంకే, డీఎంకే వంటి పక్షాలను పక్కనపెట్టి 33 శాతం తమిళ ఓటర్లు రజనీకి పట్టంగడతారని తెలిపింది. అటు డీఎంకే 14 సీట్లతో రెండో స్థానంలో అన్నాడీఎంకే రెండు చోట్ల విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఒకవేళ రజనీ సార్వత్రిక ఎన్నికల రంగంలోకి దిగని పక్షంలో డీఎంకే 32 సీట్లను గెలుచుకుంటుందని.. అప్పుడు అన్నాడీఎంకే 6 సీట్లు, బీజేపీ ఒకచోట విజయం సాధిస్తాయని పేర్కొంది.

మోదీకే పగ్గాలు  
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సర్వే వెల్లడించింది. ప్రధాని మోదీ చరిష్మా కారణంగా 41.4 శాతం ఓట్లతో ఎన్డీయేకి 335 సీట్లు వస్తాయని పేర్కొంది. యూపీఏ 27.7 శాతం ఓట్లతో 89 సీట్లు సాధిస్తుందని పేర్కొంది. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో బీజేపీ ఓట్ల శాతంతోపాటు సీట్లలోనూ స్వల్ప తగ్గుదల కనబడుతోంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీయేతర ఇతర పార్టీలు స్వల్ప ఆధిక్యాన్ని పొందే అవకాశముందని సర్వే పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో బీజేపీ దూసుకుపోతుండటంతో ఇక్కడ కోల్పోయిన స్థానాలను మిగిలిన ప్రాంతాల్లో గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. అటు ప్రధాని పీఠంపై ఎవరు కూర్చోవాలన్న విషయంలో మోదీకి 62.7 శాతం మంది ఓటేయగా.. రాహుల్‌ 12.6 శాతం మంది అభిమానాన్ని పొందగలిగారు.

కన్నడ, మరాఠీ రాష్ట్రాల్లోనూ..
పొరుగున ఉన్న కర్ణాటకలోనూ బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరచనుందని అంచనా. మొత్తం 28 సీట్లలో బీజేపీ 22 చోట్ల, యూపీఏ 5, జేడీఎస్‌ ఒక స్థానంలో గెలుస్తుందని సర్వే పేర్కొంది. మహారాష్ట్రలో మాత్రం ఎన్డీయేకు సర్వే భారీ మెజారిటీని కట్టబెట్టింది. మొత్తం 48 సీట్లలో ఎన్డీయేకే 44 స్థానాలొస్తాయని పేర్కొంది. ఇక్కడ కాంగ్రెస్‌కు 2, ఎన్సీపీకి రెండు సీట్లు దక్కుతాయని తెలిపింది. అయితే కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీచేస్తే ఎన్డీయేకే 35 సీట్లే రావొచ్చని అభిప్రాయపడింది.

దీనికితోడు ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన శివసేన నిత్యం కత్తులు నూరుతున్న నేపథ్యంలో బీజేపీ, శివసేన వేర్వేరుగా పోటీ చేస్తే.. మరిన్ని తక్కువ సీట్లు రావొచ్చని అభిప్రాయపడింది. ఈశాన్యరాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్‌లలో బీజేపీ దాదాపుగా అన్ని సీట్లను గెలచుకుంటుందని సర్వే పేర్కొంది. అయితే ఐఎన్‌ఎల్‌డీ, ఎన్సీపీ, జార్ఖండ్‌ ముక్తిమోర్చా, తృణమూల్‌ కాంగ్రెస్, జేడీఎస్‌ వంటి ప్రాంతీయ పార్టీలతో ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ పొత్తుపెట్టుకుంటే యూపీఏ సీట్లలో పెరుగుదల కనబడుతుందని సర్వే పేర్కొంది.

ప్రత్యర్థుల కోటల్లో కమలవికాసం
ఇన్నాళ్లుగా బీజేపీ విస్తరించేందుకు ఇబ్బందికరంగా ఉన్న ప్రాంతాల్లో 2019 ఎన్నికల్లో ఈ పార్టీ గణనీయమైన సీట్లు సాధించేందుకు వీలున్నట్లు అర్థమవుతోంది. గత ఎన్నికల్లో ఒడిశాలో ఒక సీటు మాత్రమే గెలిచిన బీజేపీ ఈసారి 13 చోట్ల విజయం సాధిస్తుందని.. అధికారంలో ఉన్న నవీన్‌ పట్నాయక్‌ (బీజేడీ) పార్టీ సీట్లలో నుంచి బీజేపీ భారీగా లాభం పొందుతుందని సర్వే తెలిపింది.

అటు పశ్చిమ బెంగాల్‌ (42)లో బీజేపీ 12 సీట్లు గెలుచుకునే అవకాశం ఉండగా.. అధికార తృణమూల్‌ 29 సీట్లలో గెలుస్తుందని అంచనా వేసింది. అత్యధిక ఎంపీ సీట్లున్న యూపీలో ఈ సారి బీజేపీ ఆధిపత్యానికి యూపీఏ గండికొట్టనుంది. మొత్తం 80 సీట్లలో బీజేపీ 60 స్థానాలను గెలుచుకోనుండగా యూపీఏ 18 చోట్ల, ఇతరులు రెండుచోట్ల గెలుస్తారని సీ–వోటర్, రిపబ్లిక్‌ సర్వే వెల్లడించింది. మొత్తంమీద ఒక్క పంజాబ్‌లోనే ఎన్డీయే కన్నా యూపీఏ ఎక్కువ స్థానాలు గెలుచుకోనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement