Survey again
-
ఆ జాబితా పరిగణించం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేదల ఇళ్లకు సంబంధించిన ఇందిరమ్మ పథకం అమలు విషయంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మళ్లీ పేచీ నెలకొంది. గ్రామీణ ప్రాంత ఇళ్లకోసం అందిన సుమారు 30 లక్షల దరఖాస్తులపై సర్వే చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. 23 లక్షల దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించి, జాబితా సిద్ధం చేసింది. ఆ దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది.అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేను తాము పరిగణనలోకి తీసుకోబోమని.. తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగా మళ్లీ సర్వే చేసి వివరాలు అందజేయాలని కేంద్రం తేల్చిచెప్పింది. దీనితో కంగుతినడం రాష్ట్ర ప్రభుత్వం వంతు అయింది. అన్ని లక్షల దరఖాస్తులకు సంబంధించి కేంద్ర యాప్‌తో మళ్లీ సర్వే చేయటం ఇప్పటికిప్పుడు అయ్యే పనికాదు. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది.కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందితే.. లబ్ధి దారులకు మొదటి విడత సొమ్ము అందజేసేందుకు సిద్ధమైంది. అలాంటిది కేంద్రం పెట్టిన మెలికతో గందరగోళం మొదలైంది. కేంద్రం నుంచి అందే నిధుల కోసం.. దాదాపు పుష్కర కాలం తర్వాత రాష్ట్రంలో మళ్లీ ఇందిరమ్మ పేరుతో పేదల ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తెలంగాణ పరిధిలో దాదాపు 19 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించారు. ఇప్పుడు వచ్చే నాలుగేళ్లలో దాదాపు 20 లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో వీలైనన్ని నిధులను కేంద్రం నుంచి పొందాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరింది.ఎన్ని ఇళ్లు మంజూరు చేస్తుందనేది కేంద్రం ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. పైగా ఒక్క ఇల్లు కూడా అనర్హుల చేతికి అందకూడదని, కేంద్రం ఖరారు చేసిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, అనర్హులకు ఇళ్లు మంజూరు చేసినట్టు తేలితే నిధులు ఇవ్వబోమని షరతులు పెట్టింది. దీనికి అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. అక్రమాలకు తావు లేకుండా చూడాలని అధికారులను అప్రమత్తం చేసింది. కానీ సర్వే విషయంలోనే ఇప్పుడు చిక్కు వచి్చంది. కేంద్రం రూపొందించిన యాప్‌తో మళ్లీ సర్వే.. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకోసం ప్రభుత్వానికి దాదాపు 30 లక్షల దరఖాస్తులు అందాయి. కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన పరిశీలనాంశాల ఆధారంగా అధికార యంత్రాంగం ఇటీవలే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి.. 23 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది. ఇందులో 19.50 లక్షల మంది సొంత జాగా ఉన్నవారుకాగా.. మూడున్నర లక్షల మంది సొంత భూమి లేనివారు.రాష్ట్రం తాజాగా ఈ వివరాలను కేంద్రానికి అందజేసి నిధులు మంజూరు చేయాలని కోరింది. అయితే తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగా ఈ సర్వే జరగనందున పరిగణనలోకి తీసుకోబోమని, ఆ మొబైల్ యాప్ ద్వారా మళ్లీ సర్వే చేసి వివరాల జాబితా సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం ప్రామాణికంగా నిర్ధారించిన అంశాలనే పరిగణనలోకి తీసుకుని సర్వే చేశామని, వివరాల్లో ఎలాంటి తేడా ఉండదని.. దీన్ని గుర్తించి ఆ జాబితాను కేంద్ర ప్రభుత్వ యాప్‌తో అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.అయినా కేంద్రం ససేమిరా అంటున్నట్టు తెలిసింది. దరఖాస్తుల్లో బ్యాంకు ఖాతా, ద్విచక్ర వాహనాలు, పన్ను చెల్లింపు వంటి వివరాలేవీ లేవని, అవి లేకుండా జాబితా తీసుకోబోమని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇవి పెద్దగా తేడా చూపే అంశాలు కాదని, ఇళ్లను మంజూరు చేసేనాటికి ఆ వివరాలను కూడా అప్లోడ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కోరినట్టు తెలిసింది. కేంద్రం సానుకూలంగా స్పందించి నిధులు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉన్నా... కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. కేంద్ర నిధులు రాకుంటే పథకం భారమే! పట్టణ ప్రాంత ఇళ్లకు కేంద్రం యూనిట్ కాస్ట్‌ను రూ.లక్షన్నరగా ఖరారు చేసింది. దీనితో వీలైనన్ని ఎక్కువ ఇళ్లను పట్టణ ప్రాంత ఖాతా కింద పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా మంజూరు చేసే పట్టణ ప్రాంత ఇళ్లలో 4 శాతాన్ని తెలంగాణకు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఇది చాలా తక్కువని, సంఖ్య మరింత పెంచాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది.కానీ స్పష్టత రావాల్సి ఉంది. ఇక గ్రామీణ ప్రాంత ఇళ్లకు సంబంధించి యూనిట్ కాస్ట్ రూ.73 వేలుగా ఉంది. ఈ నిధులన్నా పొందుదామంటే కేంద్రం పెట్టిన మెలిక కలవరపెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. కేంద్రం నుంచి సాయం అందని పక్షంలో మొత్తం నిధులను రాష్ట్రమే భరించాల్సి వస్తుంది. అది పెద్ద భారంగా మారుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
మళ్లీ మోదీయే బాద్షా!
న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగితే మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని రిపబ్లిక్ టీవీ, సీ–వోటర్ సర్వే పేర్కొంది. మొత్తం 543 స్థానాల్లో 335 సీట్లను ఈ కూటమి చేజిక్కించుకుంటుందని వెల్లడించింది. అటు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ 89 చోట్ల విజయం సాధిస్తుందని సర్వే అభిప్రాయపడింది. ఇటు, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమికి, అధికార టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనీ సర్వే తెలిపింది. రాజకీయ వాతావరణం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతోందని పేర్కొంది. ఏపీలోని 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ 13 చోట్ల విజయం సాధిస్తుందని.. టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీయే 12 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. గతంలో కంటే వైఎస్సార్సీపీ అదనంగా ఐదు స్థానాలు గెలుచుకోనుందని పేర్కొంది. ఇటు తెలంగాణ (17 స్థానాలు)లో టీఆర్ఎస్ 11 స్థానాల్లో, బీజేపీ 3, కాంగ్రెస్ రెండు చోట్ల, ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధిస్తాయని వెల్లడించింది. తమిళనాట రజనీమాట... అమ్మలేని లోటు స్పష్టంగా కనబడుతున్న తమిళనాడు రాజకీయాలను ఇకపై రజనీకాంత్ శాసిస్తారని సర్వే అభిప్రాయపడింది. ఈ రాష్ట్రంలోని 39 ఎంపీ స్థానాల్లో రజనీకాంత్ పార్టీకి 23 సీట్లు వస్తాయని పేర్కొంది. ద్రవిడ రాజకీయాలను కాదని అన్నాడీఎంకే, డీఎంకే వంటి పక్షాలను పక్కనపెట్టి 33 శాతం తమిళ ఓటర్లు రజనీకి పట్టంగడతారని తెలిపింది. అటు డీఎంకే 14 సీట్లతో రెండో స్థానంలో అన్నాడీఎంకే రెండు చోట్ల విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఒకవేళ రజనీ సార్వత్రిక ఎన్నికల రంగంలోకి దిగని పక్షంలో డీఎంకే 32 సీట్లను గెలుచుకుంటుందని.. అప్పుడు అన్నాడీఎంకే 6 సీట్లు, బీజేపీ ఒకచోట విజయం సాధిస్తాయని పేర్కొంది. మోదీకే పగ్గాలు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సర్వే వెల్లడించింది. ప్రధాని మోదీ చరిష్మా కారణంగా 41.4 శాతం ఓట్లతో ఎన్డీయేకి 335 సీట్లు వస్తాయని పేర్కొంది. యూపీఏ 27.7 శాతం ఓట్లతో 89 సీట్లు సాధిస్తుందని పేర్కొంది. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ ఓట్ల శాతంతోపాటు సీట్లలోనూ స్వల్ప తగ్గుదల కనబడుతోంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీయేతర ఇతర పార్టీలు స్వల్ప ఆధిక్యాన్ని పొందే అవకాశముందని సర్వే పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో బీజేపీ దూసుకుపోతుండటంతో ఇక్కడ కోల్పోయిన స్థానాలను మిగిలిన ప్రాంతాల్లో గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. అటు ప్రధాని పీఠంపై ఎవరు కూర్చోవాలన్న విషయంలో మోదీకి 62.7 శాతం మంది ఓటేయగా.. రాహుల్ 12.6 శాతం మంది అభిమానాన్ని పొందగలిగారు. కన్నడ, మరాఠీ రాష్ట్రాల్లోనూ.. పొరుగున ఉన్న కర్ణాటకలోనూ బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరచనుందని అంచనా. మొత్తం 28 సీట్లలో బీజేపీ 22 చోట్ల, యూపీఏ 5, జేడీఎస్ ఒక స్థానంలో గెలుస్తుందని సర్వే పేర్కొంది. మహారాష్ట్రలో మాత్రం ఎన్డీయేకు సర్వే భారీ మెజారిటీని కట్టబెట్టింది. మొత్తం 48 సీట్లలో ఎన్డీయేకే 44 స్థానాలొస్తాయని పేర్కొంది. ఇక్కడ కాంగ్రెస్‌కు 2, ఎన్సీపీకి రెండు సీట్లు దక్కుతాయని తెలిపింది. అయితే కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీచేస్తే ఎన్డీయేకే 35 సీట్లే రావొచ్చని అభిప్రాయపడింది. దీనికితోడు ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన శివసేన నిత్యం కత్తులు నూరుతున్న నేపథ్యంలో బీజేపీ, శివసేన వేర్వేరుగా పోటీ చేస్తే.. మరిన్ని తక్కువ సీట్లు రావొచ్చని అభిప్రాయపడింది. ఈశాన్యరాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో బీజేపీ దాదాపుగా అన్ని సీట్లను గెలచుకుంటుందని సర్వే పేర్కొంది. అయితే ఐఎన్ఎల్డీ, ఎన్సీపీ, జార్ఖండ్ ముక్తిమోర్చా, తృణమూల్ కాంగ్రెస్, జేడీఎస్ వంటి ప్రాంతీయ పార్టీలతో ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పొత్తుపెట్టుకుంటే యూపీఏ సీట్లలో పెరుగుదల కనబడుతుందని సర్వే పేర్కొంది. ప్రత్యర్థుల కోటల్లో కమలవికాసం ఇన్నాళ్లుగా బీజేపీ విస్తరించేందుకు ఇబ్బందికరంగా ఉన్న ప్రాంతాల్లో 2019 ఎన్నికల్లో ఈ పార్టీ గణనీయమైన సీట్లు సాధించేందుకు వీలున్నట్లు అర్థమవుతోంది. గత ఎన్నికల్లో ఒడిశాలో ఒక సీటు మాత్రమే గెలిచిన బీజేపీ ఈసారి 13 చోట్ల విజయం సాధిస్తుందని.. అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ (బీజేడీ) పార్టీ సీట్లలో నుంచి బీజేపీ భారీగా లాభం పొందుతుందని సర్వే తెలిపింది. అటు పశ్చిమ బెంగాల్ (42)లో బీజేపీ 12 సీట్లు గెలుచుకునే అవకాశం ఉండగా.. అధికార తృణమూల్ 29 సీట్లలో గెలుస్తుందని అంచనా వేసింది. అత్యధిక ఎంపీ సీట్లున్న యూపీలో ఈ సారి బీజేపీ ఆధిపత్యానికి యూపీఏ గండికొట్టనుంది. మొత్తం 80 సీట్లలో బీజేపీ 60 స్థానాలను గెలుచుకోనుండగా యూపీఏ 18 చోట్ల, ఇతరులు రెండుచోట్ల గెలుస్తారని సీ–వోటర్, రిపబ్లిక్ సర్వే వెల్లడించింది. మొత్తంమీద ఒక్క పంజాబ్‌లోనే ఎన్డీయే కన్నా యూపీఏ ఎక్కువ స్థానాలు గెలుచుకోనున్నట్లు సమాచారం. -
బడేదేవరకొండపై మళ్లీ సర్వే
పార్వతీపురం టౌన్: మండలంలోని బడేదేవరకొండపై మళ్లీ సర్వే మొదలవుతోంది. గతంలో ఇచ్చిన సర్వేపై సంతృప్తి చెందని న్యాయస్థానం పూర్తిస్థాయిలో సర్వే జరిపించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇటీవ ల రాష్ట్ర స్థాయి అధికారుల బృందం మండలం లోని కోరిగంగాపురం పంచాయతీ పరిధిలోని బడేదేవరకొండ వద్దకు వచ్చి మ్యాప్‌లు పరిశీ లించారు. మైన్స్ కమిషనర్ విజయమోహన్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారుల బృందం వచ్చి పరిశీలించి పూర్తిస్థాయి నివేదిక సమర్పిం చడానికి 45రోజులు గడువు కోరినట్లు సమాచారం. అయితే గడువు సమయం దగ్గర పడుతున్నందున మళ్లీ బడేదేవరకొండపై సర్వేచేయడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం అటవీశాఖ, రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు కొత్తగా వచ్చిన ఆర్డీఓ సుదర్శన్ దొరను కలసి సర్వే విషయంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వారికి క్షేత్రస్థాయిలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా స్పష్టమైన నివేదికను తయారు చేసేలా సర్వే చేయాలని ఆదేశించారు. గతంలో మాదిరిగా ఎవరికి వారు కాకుండా ఇరుశాఖలు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సర్వే జరిపి ఒక నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. చివరిగా తానుకూడా క్షేత్రస్థాయిలో పరిశీలనకు వస్తానని ఆర్డీవో తెలిపారు. పూర్తిస్థాయిలో సర్వే జరిపి హద్దులు గుర్తించి నివేదికను తయారు చేయడానికి వారం రోజులు పట్టవచ్చని అటు అటవీశాఖ, ఇటు రెవెన్యూశాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అటవీశాఖ తరఫున సాలూరు రేంజర్, పార్వతీపురం తహసీల్దార్, సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు. -
సర్వే అడ్డగింత
- ఇరువర్గాల వాదనలతో కొద్దిసేపు ఉద్రిక్తత - వెనుదిరిగిన అధికారులు, టి.సిరసపల్లి గ్రామస్థులు - నేడు పోలీసుల సమక్షంలో మళ్లీ సర్వే మునగపాక : టి.సిరసపల్లి గ్రామ శివారు రామారాయుడుపేట కొండ వద్ద బుధవారం మధ్యాహ్నం భయానక వాతావరణం కనిపించింది. రెండు ప్రాంతాల రైతులు వాదోపవాదాలు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చేసేది లేక సిరసపల్లి గ్రామానికి చెందిన రైతులు వెనుదిరిగారు. ఇందుకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే... సిరసపల్లి పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 138, 139లలో ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూముల్లో సిరసపల్లికి చెందిన రైతులు 1994 నుంచి మొక్కలు పెంచుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల పార్కు ఏర్పాటుకు ముందుకువచ్చిన విషయం తెలిసిందే. దీంతో సాగులో ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారాలు అందించాల్సి ఉండగా కొంతమంది తప్పుడు పేర్లను జాబితాల్లో చేర్చారంటూ, దీంతో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని రీ సర్వే చేపట్టాలని కోరుతూ వారం రోజులుగా స్థానిక రైతులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సంబంధిత భూములను రీ సర్వే చేస్తున్నామని, రైతులు రావాలని వీఆర్ఓ బిభీషణ, సర్వేయర్ ఉపేంద్ర కోరడంతో బుధవారం సాయంత్రం సుమారు 65మంది రైతులు సంబంధిత ప్రాంతానికి చేరుకున్నారు. ఈ విషయం ముందే తెలుసుకున్న సమీప రామారాయుడుపేట గ్రామస్థులు కూడా 138 సర్వే నెంబర్‌కు చెందిన కొండ తమ ప్రాంతంలో ఉందని ఇక్కడకు రావడానికి మీకు హక్కులేదని చెప్పడంతో కొంతసేపు వాతావరణం వేడెక్కింది. రామారాయుడుపేట నుంచి పురుషులు, మహిళలు పెద్ద ఎత్తున కర్రలు, ఆయుధాలతో తరలివచ్చి అధికారులతో గొడవకు దిగారు. చేసేది లేక అధికారులు, సిరసపల్లి గ్రామ రైతులు వెనుతిరిగి రెవెన్యూ కార్యాలయానికి చేరుకొని జరిగిన విషయాన్ని డీటీ గురునాథరావు దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందించిన ఆయన గురువారం పోలీసుల సమక్షంలో సర్వే చేయించేందుకు నిర్ణయించారు. పరిశ్రమల పార్కుకు సంబంధించి చేపట్టనున్న భూసేకరణ రెండు గ్రామాల మధ్య వివాదానికి దారి తీస్తుందనడంలో సందేహం లేదు.