మండలంలోని బడేదేవరకొండపై మళ్లీ సర్వే మొదలవుతోంది. గతంలో ఇచ్చిన సర్వేపై సంతృప్తి చెందని న్యాయస్థానం పూర్తిస్థాయిలో సర్వే జరిపించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
పార్వతీపురం టౌన్: మండలంలోని బడేదేవరకొండపై మళ్లీ సర్వే మొదలవుతోంది. గతంలో ఇచ్చిన సర్వేపై సంతృప్తి చెందని న్యాయస్థానం పూర్తిస్థాయిలో సర్వే జరిపించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇటీవ ల రాష్ట్ర స్థాయి అధికారుల బృందం మండలం లోని కోరిగంగాపురం పంచాయతీ పరిధిలోని బడేదేవరకొండ వద్దకు వచ్చి మ్యాప్‌లు పరిశీ లించారు. మైన్స్ కమిషనర్ విజయమోహన్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారుల బృందం వచ్చి పరిశీలించి పూర్తిస్థాయి నివేదిక సమర్పిం చడానికి 45రోజులు గడువు కోరినట్లు సమాచారం.
అయితే గడువు సమయం దగ్గర పడుతున్నందున మళ్లీ బడేదేవరకొండపై సర్వేచేయడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం అటవీశాఖ, రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు కొత్తగా వచ్చిన ఆర్డీఓ సుదర్శన్ దొరను కలసి సర్వే విషయంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వారికి క్షేత్రస్థాయిలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా స్పష్టమైన నివేదికను తయారు చేసేలా సర్వే చేయాలని ఆదేశించారు. గతంలో మాదిరిగా ఎవరికి వారు కాకుండా ఇరుశాఖలు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సర్వే జరిపి ఒక నివేదికను సిద్ధం చేయాలని సూచించారు.
చివరిగా తానుకూడా క్షేత్రస్థాయిలో పరిశీలనకు వస్తానని ఆర్డీవో తెలిపారు. పూర్తిస్థాయిలో సర్వే జరిపి హద్దులు గుర్తించి నివేదికను తయారు చేయడానికి వారం రోజులు పట్టవచ్చని అటు అటవీశాఖ, ఇటు రెవెన్యూశాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అటవీశాఖ తరఫున సాలూరు రేంజర్, పార్వతీపురం తహసీల్దార్, సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు.