హస్తం.. హోరు.. అనుకరించిన కాంగ్రెస్‌ నేతలు! | - | Sakshi
Sakshi News home page

హస్తం.. హోరు.. అనుకరించిన కాంగ్రెస్‌ నేతలు!

Published Sat, Nov 18 2023 1:18 AM | Last Updated on Sat, Nov 18 2023 12:03 PM

- - Sakshi

నర్సంపేటలో మాట్లాడుతున్నరాహుల్‌ గాంధీ, పక్కన అభ్యర్థి దొంతి మాధవరెడ్డి

సాక్షి, వరంగల్‌: ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ నర్సంపేట, వరంగల్‌ తూర్పు నియోజకవర్గ పర్యటనలు విజయవంతం కావడంతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపింది. అధికార పార్టీ అవినీతిని వెలుగులోకి తెచ్చి సంపదను పేదలకు సంక్షేమ రూపంలో పంచుతామని చెప్పడంతో కార్యకర్తలు ఈలలు, కేకలతో హోరెత్తించారు. శుక్రవారం మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నుంచి 2 గంటలకు రాహుల్‌గాంధీ హెలికాప్టర్‌లో నర్సంపేటకు చేరుకున్నారు.

తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం, ఎమ్మెల్యే అభ్యర్థి దొంతి మాధవరెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, ఇనగాల వెంకట్రాంరెడ్డి పూలబొకేలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంలో స్థానిక అంబేడ్కర్‌ సెంటర్‌కు చేరుకుని కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగించారు. అనంతరం హెలికాప్టర్‌లో మామూనూరులో దిగిన ఆయన అక్కడి నుంచి వరంగల్‌ చౌరస్తాకు చేరుకున్నారు. అభ్యర్థి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, పార్టీ నాయకులు స్వాగతం పలికి, పుష్పగుచ్ఛాలు అందజేశారు.

జనసంద్రంగా పాదయాత్ర!
జనసంద్రంగా మారిన చౌరస్తాలో కారు దిగుతూనే రాహుల్‌ ప్రజలకు అభివాదం చేశారు. ప్రచారంలో భాగంగా వరంగల్‌ చౌరస్తా నుంచి జేపీఎన్‌ రోడ్డు, మండిబజార్‌, పోచమ్మమైదాన్‌ వరకు పాదయాత్ర సాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు రాహుల్‌తో పాదం కలిపారు. ప్రధాన రహదారిలో వేగంగా నడుస్తూ ఇరువైపులా వ్యాపార, వాణిజ్య సముదాయాలు, భవనాల ఎదుట, పైఅంతస్తుల్లో ఉన్న ప్రజలకు అభివాదం తెలుపుతూ రాహుల్‌గాంధీ ముందుకుసాగారు. పోచమ్మమైదాన్‌లో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌కు తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో జంక్షన్‌ జనంతో కిక్కిరిసిపోయింది.

రాహుల్‌ స్పీచ్‌కు విశేష స్పందన..
రాహుల్‌గాంధీ ప్రసంగానికి పార్టీ శ్రేణులు, అభిమానులు నీరాజనాలు పలికారు. పీఎం నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ.. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక చెట్టు కొమ్మలేనని పేర్కొనడంతో ప్రజల నుంచి స్పందన కనిపించింది. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పొందుపర్చిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రస్తావించగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కులగణన, పేదరిక నిర్మూలన, స్థానిక సంస్థల్లో కులాల లెక్కింపు, రాజకీయ ప్రాధాన్యత, ఆ మేరకు బడ్జెట్‌ కేటాయిస్తామని ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఆరుగ్యారంటీలు, కేసీఆర్‌ అవినీతి అంతం చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని, నర్సంపేట, తూర్పు నుంచి పోటీ చేస్తున్న దొంతి మాధవరెడ్డి, కొండా సురేఖను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ పరిశీలకులు డాల్వీ, దీపమున్సీ, కార్పొరేటర్‌ గుండేటి నరేంద్రకుమార్‌, మాజీ కార్పొరేటర్లు తత్తరి లక్ష్మణ్‌, నాయకులు మీసాల ప్రకాశ్‌, నల్లగొండ రమేష్‌, గోపాల నవీన్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేటలో..
నర్సంపేటలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి దొంతి మాధవరెడ్డి గెలుపు కోసం నిర్వహించిన రోడ్‌షోలో ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో తరలిరావడంతో నర్సంపేట పట్టణంలోని వరంగల్‌, నెక్కొండ, మల్లంపల్లి, పాకాల రోడ్లు పూర్తిగా నిండిపోయాయి. కాగా, మహేశ్వరం గ్రామంలోని సెయింట్‌థెరిస్సా పాఠశాల ఎదుట హెలిపాడ్‌ను ఏర్పాటు చేయగా కార్యకర్తలు, నాయకులు, భారీ సంఖ్యలో చేరుకున్నారు.

మధ్యాహ్నం 2గంటలకు రాహుల్‌గాంధీ హెలికాప్టర్‌ దిగి అభివాదం చేస్తూ ప్రత్యేక వాహనంలో నర్సంపేటలోని అంబేడ్కర్‌ సెంటర్‌కు చేరుకుని కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగించారు. రాహుల్‌ రాకతో ట్రాఫిక్‌ను మళ్లించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. డీఎస్పీలు రవీందర్‌, మురళి ఆధ్వర్యంలో ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు బందోబస్తును నిర్వహించారు.

రౌడీ రాజ్యం.. నియంత పాలన:
కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా సురేఖ

వరంగల్‌ తూర్పులో రౌడీ రాజ్యం, నియంత పాలన కొనసాగుతోందని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దౌర్జన్యాలు, స్థలాల కబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి మమ్ముల్ని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రెండుసార్లు ప్రజలను మభ్య పెట్టి, మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. ప్రజలకే మేలు జరగలేదని, కల్వ కుంట్ల కుటుంబం మాత్రం బాగుపడిందన్నారు. మళ్లీ ఎన్నికల్లో అధికారం కావాలని ముందుకొస్తున్నారని, ప్రజలు గుర్తించి తిప్పికొట్టాలని, కాంగ్రెస్‌ను ఆదరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి: కారు.. జోరు! అంతటితో ఆగిపోదు.. అసలు ముచ్చట అప్పటినుంచే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement