సాక్షి, వరంగల్: వరంగల్ తూర్పు బీఆర్‌ఎస్ రోజురోజుకూ ఖాళీ అవుతోంది. ఒకరి తర్వాత ఒకరు ముఖ్య నేతలు గులాబీ పార్టీకి బైబై చెప్పి ప్రత్యామ్నాయ పార్టీల వైపు అడుగులేస్తున్నారు. ఇన్నాళ్లు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వ్యవహారశైలి నచ్చక అంతర్గత అసంతృప్తితో ఉన్న కీలక నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ, ఇంకొందరు బీజేపీలోకి వెళ్తుండడంతో గులాబీ శిబిరంలో అలజడి మొదలైంది. కీలక నేతలందరూ తమకు ప్రాధాన్యతనిచ్చే పార్టీలోకి వెళ్తుండడంతో వివిధ డివిజన్ల నాయకులు, కార్యకర్తలు కూడా రాత్రికి రాత్రే పార్టీ కండువాలు మార్చేస్తున్నారు.
ఎవరూ ఊహించని విధంగా ఈ నియోజకవర్గంలో ట్రయాంగిల్ పోరు నడుస్తుందని మౌత్ టాక్ నడుస్తున్నా.. పోలింగ్ వచ్చేనాటికి రెండు పార్టీల మధ్యే ప్రధాన పోరు ఉండొచ్చన్న టాక్ ఉంది. చాలామంది ముఖ్య నేతలతోపాటు ఇంకొందరు ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్దామనుకున్నా.. ఇప్పుడే వెళ్తే పోలీసుల నుంచి ఒత్తిళ్లు మొదలవుతాయన్న నేపథ్యంలో వేచి చూసే ధోరణితో పోలింగ్ ముందునాటికి వారికిష్టమైన పార్టీల్లో చేరేలా ప్రణాళికలు రచించుకున్నారు. పరకాల, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగల బీఆర్‌ఎస్ కీలక నేత గోపాల నవీన్‌రాజ్‌తో పాటు ఆయన బంధం, కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్ తదితరులకు ఇటీవల హైదరాబాద్‌లో కొండా సురేఖ మురళీధర్‌రావు సమక్షంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పారు.
ఖిలా వరంగల్ మండల ప్రాథమిక వ్యవసాయ పరస్పర సహకార సంఘం అధ్యక్షుడు, డీసీసీబీ డైరెక్టర్, ఓడీసీఎంఎస్ డైరెక్టర్ కేడల జనార్దన్, చాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ సాగర్ల శ్రీనివాస్, ఏనుమాముల మార్కెట్ మాజీ డైరెక్టర్లు వేణుమాధవ్, సంగరబోయిన చందర్, మాజీ కార్పొరేటర్లు కేడల పద్మ, శామంతుల ఉషశ్రీపద్మ శ్రీనివాస్, బత్తిని వసుంధర, కత్తెరశాల వేణు తదితరులు చేరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాహుల్ పాదయాత్రలో శాప్ మాజీ డైరెక్టర్ రాజనాల శ్రీహరి, మాజీ మేయర్ గుండా ప్రకాశ్‌రావు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.
ఆయనతో పొసగలేకనే..
శాప్ మాజీ డైరెక్టర్ రాజనాల శ్రీహరి మంత్రి కేటీఆర్ వీరాభిమాని అయినా నరేందర్ ఒంటెద్దు పోకడలు నచ్చక ఆ పార్టీలోనే ఉంటూ చాలాసార్లు విమర్శలు గుప్పించారు. ఆయన గన్‌మెన్లను ఉపసంహరించినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఇటీవల బీఆర్‌ఎస్ రెబల్‌గా నామినేషన్ వేసిన రాజనాల శ్రీహరి చివరలో ఉపసంహరించుకున్నారు. బీఆర్‌ఎస్ అధిష్టానం ఆదేశంతో ఆయన వెనక్కి తగ్గారని నరేందర్ వర్గం ప్రచారం చేయడంతోపాటు గులాబీ పార్టీలో అనుకున్నంత ప్రాధాన్యత దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం చేరారు.
ఇక మాజీ మేయర్ గుండా ప్రకాశ్‌రావు కూడా నగరంలో ప్రభావితం చేసే వ్యక్తుల్లో ఒకరు. ఈయన తన ఎమ్మెల్యే టికెట్‌కు ఎక్కడా పోటీ వస్తారన్న ఉద్దేశంతో ఓ పోలీసుస్టేషన్ పరిధిలో పాత కేసు తిరగదోడి వేధింపులకు గురిచేయడంతో ఆయన ఇన్నాళ్లు సమయం కోసం వేచి చూశారని ఆయన మద్దతుదారులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కా హామీ లభించడంతో మాజీ మేయర్ గుండా ప్రకాశ్‌రావు హస్తం కండువా కప్పుకున్నారు. దీంతో వరంగల్ తూర్పు కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక్కసారిగా మరింత జోష్ పెరిగినట్లయ్యింది.
మున్ముందు మరిన్ని..
బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే చుట్టూ తిరిగే ముఖ్యులు కూడా ఆయనతో బాగానే మాట్లాడుతున్నా లోలోన మాత్రం తమకు సరైన గుర్తింపు దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నారు. పైకి స్నేహంగా కనిపిస్తున్నా...లోపల మాత్రం సరైన సమయంలో నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. పోలింగ్ నాటికి ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు చాలా మంది పార్టీ మారే అవకాశాలున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతోపాటు బీజేపీలోనూ బీఆర్‌ఎస్ నుంచి చేరికలు జరుగుతుండడంతో కమలం పార్టీలోనూ జోష్ పెరిగింది. శనివారం కేంద్ర మంత్రి అమిత్ షా సభ ఉండడంతో బీఆర్‌ఎస్ నుంచి కీలక నేతలు చేరే అవకాశముందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా ఎమ్మెల్యే నరేందర్ వ్యవహర శైలే తలనొప్పిగా మారడంతో ఆయన అనుయాయుల్లో ఆందోళన మొదలైంది. ఇతర పార్టీల నుంచి కొందరు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నా వాళ్లు కోవర్టులయ్యే అవకాశం ఉండడంతో వారిని దూరందూరం ఉంచుతున్నారన్న ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment