సాక్షిప్రతినిధి, వరంగల్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సరిగ్గా మరో మూడు రోజులే ఉంది. సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ రంగులు మారుతున్నాయి. ఉదయానికున్న సమీకరణాలు.. సాయంత్రానికి తలకిందులవుతున్నాయి. పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రత్యర్థి వ్యూహాలను పసిగట్టడం, ప్రచారాలు, కార్యక్రమాలపై నిఘా పెట్టడం.. ఉల్లంఘనలుంటే వాటిపై అధికారులకు ఫిర్యాదు చేయడం వంటివి ముమ్మరంగా సాగుతున్నాయి. వీటితోపాటు ప్రత్యర్థి పార్టీలో కొందరిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వారు చేసిన తప్పులను వీరికి తెలియజేసే పనిని వారికి అప్పజెబుతున్నారు. ఇందుకోసం రూ.లక్షలు ఖర్చు పెట్టడానికై నా సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఫలానా పార్టీ అనే తేడా లేకుండా అన్నింటిలోనూ ఇలాంటి పోకడలు కనిపిస్తున్నాయి. సోమవారం నుంచి ఇవి మరింత తీవ్రరూపం దాల్చనున్నాయి.
కోవర్టుల కలకలం..
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే నానుడి ఉన్నదే. కొంతమంది నాయకుడి వెన్నంటే ఉండి.. నమ్మకంగా నటించి ఇక్కడి విషయాలను ప్రత్యర్థులకు చేరవేస్తున్నారు. సంపాదనే పరమావధిగా ఈ పని చేస్తున్నారు. నాయకులు తనవెనుక ఉండే వారిలో ఇలాంటి వారు ఉన్నారని తెలిసినా వారెవరో గుర్తించలేకపోతున్నారు. ప్రత్యర్థుల చెంత నమ్మకంగా పని చేస్తున్నవారిని నాయకులు బుట్టలోకి లాగుతున్నారు.
వారి ద్వారా అక్కడ జరిగే విషయాలను తెలుసుకుంటూ ఎదుటివారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నేతల వివరాలు, సభలు, సమావేశాల్లో జరిగే ఉల్లంఘనలు, ఎన్నికల్లో ధన, మధ్య ప్రలోభాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వివరాలు తెలుసుకునేందుకు ఈ కోవర్టులు ఉపయోగపడుతున్నారు. మరికొన్ని చోట్ల ఒక్కడుగు ముందేసిన కోవర్టులు.. ఓ పార్టీకి చెందిన అభ్యర్థి ఇచ్చిన డబ్బులు పంచుతూ మరో పార్టీ అభ్యర్థికి ఓటేయమని చెబుతున్నారన్న చర్చ ఉంది. ఇందుకోసం ప్రత్యర్థులు భారీగానే ముట్టచెబుతున్నారని సమాచారం.
ఏం చేశారు.. ఎవరికి పంచారు?
బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఆయా పార్టీల అధిష్టానం పంపిన పార్టీ ఫండ్‌పై పలు నియోజకవర్గాల్లో రచ్చ జరుగుతోంది. ‘ఎవరికి ఇచ్చారు.. ఎక్కడ పంచారు?’ అంటూ బహిరంగంగానే నిలదీతల ఘటనలు వెలుగుచూస్తున్నాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థులకు రూ.10 కోట్ల నుంచి 25 కోట్ల వరకు అందినట్లు ఆపార్టీ ముఖ్యనేతలే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు రెండు విడతల్లో ఐదు రోజుల తేడాతో రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు అందినట్లు ఆ పార్టీవర్గాల్లో జరుగతున్న చర్చ. అలాగే బీజేపీ అధిష్టానం అభ్యర్థులను బట్టి రూ.50 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు అందించినట్లు ఆ పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది.
అర్బన్ స్థానాల్లో పోటీ చేస్తున్న కొందరికి అంతకుమించే అందించినట్లు ప్రచారం. అయితే పార్టీ కార్యకర్తలు, ఓటర్ల కోసం పంపిణీ చేయాల్సి ఉండగా.. చాలా చోట్ల వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమను పట్టించుకోవడం లేదంటూ కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కొన్నిచోట్ల డబ్బుల వ్యవహారంలో అభ్యర్థుల కుటుంబాల్లో ముదిరిన ఆధిపత్యం ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరింది. ఓవైపు అన్ని పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పడరాని పాట్లు పడుతుంటే... మరోవైపు కోవర్టులు, పార్టీఫండ్, డబ్బుల పంపిణీ వివాదాలతో తలలు పట్టుకుంటున్నారు.
కోవర్టులకు భారీ నజరానాలు!
రహస్య స్నేహితులు(కోవర్టులు) అందించిన స మాచారాన్ని బట్టి వారికి నజరానాలు అందించేందుకు అన్ని పార్టీల ముఖ్యనేతలు, అభ్యర్థులు సిద్ధమయ్యారు. ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారు. ఎన్నికల సంఘం విధించిన వ్యయ పరిమితి, ప్రచార సమయంలో అభ్యర్థి వెంట తప్పనిసరిగా వీడియో బృందం ఉంటోంది. వీటి బారి నుంచి తప్పించుకునేందుకు అభ్యర్థులంతా రహస్య పద్ధతులు అవలంబిస్తున్నారు.
ఎన్నికల నిబంధనల్లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని వివిధ వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమయాల్లో జరిగిన ఉల్లంఘనలకు సంబంధించిన ఆధారాలతో సహా ప్రత్యర్థులకు చేరవేస్తే అందుకు తగ్గట్లుగా ప్రతిఫలం అందజేస్తున్నారు. కోవర్టుల స మాచారంతోనే ఎన్నికల సంఘాల వరకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. భూపాలపల్లి, మహబూ బాబాద్, ములుగు, జనగామ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట తదితర నియోజకవర్గాల్లో ఈ తరహా ఫిర్యాదులందాయి. పలుచోట్ల డబ్బులు తరలి స్తున్న వాహనాలు కూడా పోలీసులకు చిక్కాయి.
ఇవి చదవండి: 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే.. తప్పుకుంటా: కేసీఆర్‌కు ఈటల సవాల్
Comments
Please login to add a commentAdd a comment