సాక్షిప్రతినిధి, వరంగల్: కారు ప్రచారం జోరందుకుంది. శుక్రవారం పరకాలలో ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గెలుపు కోసం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు భారీగా జనం రావడం.. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఛలోక్తులతో సాగిన ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. అభివృద్ధిని వివరిస్తూ.. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించడంతో సభకు వచ్చినవారు చప్పుట్లు, కేరింతలు కొట్టారు.
మధ్య మధ్యలో ‘కొత్తకుండలో ఈగ చొచ్చినట్లు..’, ‘రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై వారిది నెత్తా.. కత్తా’, ‘పాలిచ్చే బర్రెను అమ్ముకుని దున్నపోతును తెచ్చుకోవద్ద’ంటూ సామెతలు చెబుతూ ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు. ‘రైతుబంధు వేస్ట్ అని పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అంటుండు.. రైతుబంధు వేస్టా..? మూడు గంటల కరెంట్ చాలు అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటుండు.. ధరణిని ఎత్తేస్తామని కాంగ్రెస్సోళ్లు అంటున్నారు.. ధరణిని ఎత్తేస్తామనేవాళ్లను బంగాళాఖాతంలో కలిపేద్దామా..?, మూడు గంటల కరెంట్ కావాల్నా..? ఇరవై నాలుగంటల కరెంటు కావాల్నా ఆలోచించుకోవాలి..?’ అంటూ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ, నేతలపై ధ్వజమెత్తారు.
‘అన్ని వర్గాల అభ్యున్నతిని పరిగణనలోకి తీసుకొని రూ.200 నుంచి రూ.2వేల ఆసరా పింఛన్ పెంపుదల, పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్.. ఇలా చదివితే చాంతాడంత పథకాల లిస్టు అవుతుంది’ అని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని ఆయన ప్రజలకు వివరించారు. ‘చల్లా ధర్మారెడ్డి నా దగ్గరకు ఎప్పుడు వచ్చినా నా నియోజకవర్గానికి అది కావాలి, ఇది కావాలి అని అడిగేవాడు తప్ప, ఏనాడూ తన సొంత పని కోసం అడగలేదు.. మనిషి హైదరాబాద్‌లో ఉన్నా మనసు మాత్రం పరకాల చుట్టూ తిరుగుతుందన్నారు.
చల్లా ధర్మారెడ్డి జనం మనిషి.. జనం సాదక బాధలు తెల్సిన నాయకుడ’ని కేసీఆర్ సభలో ధర్మారెడ్డికి కితాబు ఇచ్చారు. పరకాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటాని.. ధర్మారెడ్డిని గెలిపిస్తే ఆయన అడిగిన పనులన్నీ చేసి పెడతానన్నారు. ఎన్నికలు వస్తాయ్, పోతాయని, విచక్షణతో ఆలోచించి, నిజానిజాలు తెలుసుకుని, మంచి అభ్యర్థులను గెలిపిస్తే.. మెరుగైన ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు మేలు జరుగుతుందని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు.. మాయమాటలను నమ్మి మోసపోవద్దు.
నవంబర్ 30 తారీఖున ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ మూడో తారీఖున ఎవరు గెలుస్తారు అనేది తేలిపోతుంది.. ఆ తర్వాత అసలు ముచ్చట మొదలవుతుంది. పరకాలలో ఎవరు గెలిస్తే అక్కడ అధికారంలోకి వాళ్లు వస్తారు’ అని అన్నారు. ‘పరకాలలో ఆడబిడ్డలు తాగునీళ్ల కోసం బిందెలతో ధర్నాలు చేసేది కదా.. తెలంగాణ రాగానే రైతు బాగుంటే దేశం బాగుంటుందని రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.. సంపదను పెంచుతున్నాం.. పంచుతున్నాం’ అంటూ కేసీఆర్ ఉద్వేగంగా మాట్లాడారు.
పదేళ్లలో రూ.2వేల కోట్ల అభివృద్ధి:
పరకాల ఎమ్మెల్యే, అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి
పదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పరకాల నియోజకవర్గంలో సుమారు రెండు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసుకున్నామని పరకాల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి అన్నారు.
దేశంలో, తెలంగాణలో ఎక్కడా లేని విధంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుతో లక్ష మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఒక్క సంగెం, పరకాల మండలాల్లోనే పదకొండు వేల మంది యువతకు ఉపాధి కల్పించబోతున్నామన్నారు. పరకాలలో ఆర్డీఓ ఆఫీస్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఏర్పాటు చేసుకున్నామని, తాను చేసిన అభివృద్ధి మీ కళ్ల ముందు కన్పిస్తుందన్న చల్లా ధర్మారెడ్డి... అభివృద్ధి చేసి మీ ముందున్న తనను కారు గుర్తుకు ఓటేసి గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.
కేసీఆర్ సభ ఇలా..
పరకాల సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాదసభకు సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం 4.42 గంటలకు హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. 4.45 గంటలకు సభాప్రాంగణానికి చేరుకున్న కేసీఆర్.. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రసంగించగానే 4.50 గంటలకు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 5.16 గంటల వరకు ప్రసంగించారు.
వేలాది మంది ప్రజలు రోడ్లపైనే నడుచుకుంటూ వస్తుండగానే సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించి తిరిగి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరారు. సభలో మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య, సీనియర్ నాయకులు లింగంపల్లి కిషన్‌రావు, సహోదర్‌రెడ్డితో పాటు పరకాల నియోజకవర్గ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి: గులాబీ పార్టీ వీడుతున్న ముఖ్య నేతలు!
Comments
Please login to add a commentAdd a comment