
రాహుల్ అమెరికా పర్యటన వెనక మతలబేంటి?
- కాంగ్రెస్‌ను ప్రశ్నించిన బీజేపీ
న్యూఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అమెరికా పర్యటన విషయంలో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తన విమర్శలను మరింత పెంచింది. రాహుల్ గాంధీ అమెరికాలో పాల్గొంటారని చెబుతున్న ‘వీకెండ్ విత్ చార్లీ రోస్’ సదస్సు ఎప్పుడో జూలైలో ముగిసిందని, అలాంటిది ఇప్పుడు ఆ పేరు చెప్పి రాహుల్ అమెరికాలో పర్యటించడం వెనుక ఏం మతలబు ఉందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ఈ విషయంలో పొంతనలేని సమాధానాలు చెబుతోందని ఆయన ఎద్దేవా చేశారు. ఆ పార్టీ రోజుకో కథ చెబుతోందని అన్నారు. రాహుల్ పేరుతో తమ వద్దకు ఎవరూ రాలేదని, అలాగే తమ వద్దకు రావాల్సిన అతిథుల జాబితాలో కూడా అలాంటి పేరులేదని ఈ వార్షిక సదస్సును నిర్వహించే ఆస్పియన్ ఇన్‌స్టిట్యూట్ మేనేజర్ తమకు చెప్పారని నరసింహారావు వెల్లడించారు.
రాహుల్ వ్యక్తిగతంగా ఎక్కడికైనా వెళ్లవచ్చని, అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పక్కదోవపట్టించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ వస్తే తమ విజయావకాశాలు దెబ్బతింటాయని కాంగ్రెస్ మిత్రపక్షాలు చెప్పడంతో రాహుల్‌ను బలవంతంగా సెలవుపై పంపించారని బీజేపీ ఎద్దేవా చేస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా తిప్పికొట్టింది. ఓటమి భయంతోనే బీజేపీ ఇటువంటి చౌకబారు విమర్శలు చేస్తోందని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్‌సింగ్ సుర్జేవా దుయ్యబట్టారు.