
సాక్షి, న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ అమేథీ పర్యటన ఖరారైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తరువాత రాహుల్ మొదటిసారిగా జూలై 10న అమేథీలో పర్యటించనున్నారు. ముందుగా లక్నోకు చేరుకుని గౌరీగంజ్‌లో అక్కడి పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ చతికిలపడటానికి గల కారణాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆ తర్వాత శివమహేశ్ మెడికల్ కళాశాల వేడుకకు హాజరు కానున్నారు.
15 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ కుటుంబీకులు అమేథీలో విజయబావుటా ఎగురవేస్తూ వస్తున్నారు. కానీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్‌గాంధీ పరాజయం పాలయ్యారు. కేరళలోని వయనాడ్ నుంచి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. దేశమంతటా కాంగ్రెస్ తక్కువ స్థానాలకు పరిమితం కావటంతో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. 2017లో కాంగ్రెస్ అధ్యక్షుడుగా రాహుల్ బాధ్యతలు చేపట్టారు.