భయంతోనే వ్యక్తిగత దాడి | Rahul Gandhi's Diagnosis Of PM Modi's Personal Attacks | Sakshi
Sakshi News home page

భయంతోనే వ్యక్తిగత దాడి

Published Fri, May 4 2018 2:48 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

 Rahul Gandhi's Diagnosis Of PM Modi's Personal Attacks - Sakshi

ఔరాద్‌ (కర్ణాటక): ప్రధాని మోదీకి భయం పట్టుకున్న ప్రతీసారి తనపై వ్యక్తిగత దాడికి దిగుతారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ అన్నారు. తాము లేవనెత్తిన యుద్ధ విమానాల ఒప్పందం, బ్యాంకులకు రూ. వేల కోట్లు కుచ్చుటోపి పెట్టిన నీరవ్‌ మోదీ తదితర అంశాలపై బదులివ్వలేకే వ్యక్తిగత దాడికి దిగుతున్నారని విమర్శించారు. గురువారం రాహుల్‌ కర్ణాటకలోని బీదర్‌ జిల్లా ఔరాద్‌లో జరిగిన ర్యాలీ మాట్లాడారు. ‘నా గురించి ఆయన (మోదీ) ఏదైనా మాట్లాడనివ్వండి. అది తప్ప యినా, ఒప్పయినా పెద్ద విషయం కాదు. ఆయన దేశానికి ప్రధాని. అందువల్ల ఆయనపై నేను వ్యక్తిగత విమర్శలు చేయను’ అని అన్నా రు. తనపై మోదీ చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగ్గవి కావని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో గబ్బర్‌ సింగ్‌ గ్యాంగ్‌
మోదీ.. గాలి జనార్దన్‌రెడ్డి సోదరులకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడాన్ని రాహుల్‌ తప్పుపట్టారు. ‘షోలే సినిమాలో గబ్బర్‌ సింగ్‌ ఉన్నాడు. మీరు ఇప్పటికే గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌ (జీఎస్టీకి వ్యంగ్య వ్యాఖ్య) తెచ్చారు. కానీ ఈసారి ఇంకా ముందుకెళ్లిపోయారు. కర్ణాటక ఎన్నికల్లో మొత్తం గబ్బర్‌సింగ్‌ గ్యాంగ్‌ను దించేశారు. గబ్బర్‌ సింగ్‌లా యడ్యూరప్ప, గాలి జనార్దన్‌ రెడ్డి సోదరులు తయారయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని చెప్పే మీరు.. జైలుకు వెళ్లి వచ్చిన రెడ్డి సోదరులను అసెంబ్లీకి పంపాలని ప్రయత్నిస్తున్నారు’అని ఎద్దేవా చేశారు.

మోదీకి ‘ఎఫ్‌’ గ్రేడ్‌
మోదీపై రాహుల్‌ ట్వీట్ల దాడికి దిగారు. కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలోని వ్యవసాయరంగానికి ఇచ్చిన ప్రాముఖ్యం విషయంలో మోదీ ప్రోగ్రెస్‌ కార్డుకు తాను ‘ఎఫ్‌’గ్రేడ్‌ ఇస్తానంటూ ట్వీట్‌ చేశారు. దీంతోపాటు మద్దతు ధరకు సంబంధించిన చార్ట్‌ను కూడా పోస్ట్‌ చేశారు.

దేవేగౌడను అవమానించలేదు
రాహుల్‌ జేడీ(ఎస్‌) అధినేత హెచ్‌డీ దేవెగౌడను అవమానించలేదని, అది కాంగ్రెస్‌ సంస్కృతి కాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ చెప్పారు. రాహుల్‌ దేవెగౌడను అవమానించారని మోదీ వ్యాఖ్యానించిన నేప థ్యంలో శర్మ ఈ మేరకు వివరణ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement