
నాహన్: 2019లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో సమూలమైన మార్పులు తెచ్చి, ప్రజలు, వ్యాపారులకు ఉపశమనం కల్పిస్తామని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన హిమాచల్ ప్రదేశ్‌లో బహిరంగ సభల్లో మాట్లాడారు. కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్‌లో అవినీతి భారీ స్థాయిలో ఉందన్న మోదీ ఆరోపణలను రాహుల్ నీతి ఆయోగ్ నివేదిక ఆధారంగా కొట్టిపారేశారు.
నివేదిక ప్రకారం బీజేపీ పాలిత గుజరాత్‌తో పోల్చితే హిమాచల్‌లో అవినీతి తక్కువేనని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బయటపడిన వ్యాపమ్ కుంభకోణం, లలిత్ మోదీ స్కాం వంటి వాటిని ఆయన ప్రస్తావించరని రాహుల్ విమర్శించారు. ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోకుండా, ముందుచూపు లేకుండానే తొందరపాటుగా జీఎస్టీని అమల్లోకి తెచ్చి చిన్న పరిశ్రమలను కుప్పకూల్చిందన్నారు. నల్లధనం నిర్మూలన అంటూ నోట్లను రద్దు చేశారనీ...ఆ చర్య ద్వారా ప్రభుత్వం ఎంత నల్లధనం పట్టుకుందో ప్రపంచమంతా చూసిందని రాహుల్ వ్యగ్యంగా అన్నారు.