పాలన్పూర్: సెబీ జరిమానా నేపథ్యంలో, ‘నిజాయితీ లేని’ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీపై ప్రధాని మోదీ నోరు మెదపాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో బానస్కాంత జిల్లాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో రూపానీ, మోదీపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘దేశంలో అన్ని రాష్ట్రాల్లోకెల్లా గుజరాత్‌లో అవినీతి తీవ్రస్థాయికి చేరింది. లంచం కోసం ప్రతీ రెండు నిమిషాలకో పోలీసు వస్తున్నారని సూరత్‌లోని వ్యాపారి ఒకరు నా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన అతి కొద్ది నెలల్లోనే అమిత్ షా తనయుడు జయ్ షా తన కంపెనీ టర్నోవర్‌ను రూ.50 వేల నుంచి రూ.80 కోట్లకు పెంచారు. ఇది అవినీతి జరగకుండా సాధ్యమా? అనేది మీకందరికీ తెలుసు. కొద్ది రోజుల క్రితం మీ ముఖ్యమంత్రి నిజాయితీ లేని వాడంటూ సెబీ తేల్చింది’ అని రాహుల్ అన్నారు. ‘‘నేను అవినీతికి పాల్పడను.. ఎవరినీ పాల్పడనివ్వను.. అని మోదీ నిరంతరం చెబుతుంటారు. అయితే ప్రస్తుతం సెబీ జరిమానాపై నేను మాట్లాడను.. మావాళ్లు నోరు మెదపరు.. అన్నది కొత్త నినాదంలా మారింది. ఈ దేశానికి ‘చౌకీదార్ (వాచ్‌మెన్).. ‘భాగీదార్ (భాగస్వామి)’లా ఉంటానన్నారు... మరి జయ్, రూపానీ విషయంలో నోరు మెదపరేం’’ అని రాహుల్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment